IISC Bangalore: దేశంలోనే ఉన్నత విద్యా సంస్థగా 'బెంగుళూరు ఐఐఎస్సీ' - హైదరాబాద్ ఐఐఐటీకి బెస్ట్ ర్యాంకుల్లో చోటు
World University Rankings: ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన 'టైమ్స్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్' విడుదలయ్యాయి. భారత్ నుంచి బెంగుళూరు ఐఐఎస్సీ ఉన్నత సంస్థగా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి 'టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్' విడుదలయ్యాయి. దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థగా బెంగుళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (IISC) నిలిచింది. 2024 ఏడాదికి అమెరికా, బ్రిటన్ లకు చెందిన ప్రఖ్యాత వర్శిటీలు ర్యాంకింగ్స్ లో సత్తా చాటాయి. అమెరికాలోని హార్వర్డ్ విశ్వ విద్యాలయం, స్టాన్ ఫోర్డ్ వర్శిటీ తొలి 2 స్థానాలు కైవసం చేసుకోగా, బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ వర్శిటీలు 4, 5 ర్యాంకుల్లో నిలిచాయి. అలాగే, ఇంపీరియల్ కాలేజ్ లండన్ 10వ ర్యాంకులో ఉంది.
భారత్ లో విద్యా సంస్థలివే
భారత దేశానికి సంబంధించి ఫిజికల్ సైన్స్, ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, లైఫ్ సైన్స్ సబ్జెక్టుల్లో బెంగుళూరు ఐఐఎస్సీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సంస్థ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్సుల్లో 100 - 125 ర్యాంకుల కేటగిరీలో, ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్సెస్ ల్లో 201 - 250 ర్యాంకుల కేటగిరీల్లో స్థానం దక్కించుకుంది.
తెలంగాణ నుంచి
తెలంగాణ నుంచి హైదరాబాద్ ఐఐఐటీకి ఇంజినీరింగ్ విభాగంలో 301 - 400 ర్యాంకుల కేటగిరీలో చోటు దక్కించుకోగా, జామియా మిల్లియా ఇస్లామియా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ, శూలిని యూనివర్శిటీ ఆఫ్ బయో టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్, శిక్షా 'ఒ' అనుసంధాన్ డీమ్డ్ యూనివర్శిటీలు 401 - 500 ర్యాంకుల కేటగిరీలో నిలిచాయి. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ, ఐఐటీ గువాహటి, విట్ వర్శిటీ వంటివి 201 - 600 ర్యాంకుల కేటగిరీలో ఉన్నాయి. అమిటీ యూనివర్శిటీ, అమృత విశ్వవిద్యాపీఠం, బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ - పిలానీ, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీ, ఐఐటీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) ధన్ బాద్, ఐఐటీ పాట్నా 601- 800 ర్యాంకుల కేటగిరీలో చోటు దక్కించుకున్నాయి. ఆర్ట్స్, హ్యూమానిటీస్ సబ్జెక్టులకు సంబంధించి ఢిల్లీ వర్శిటీ, జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీ 501 - 600 ర్యాంకుల కేటగిరీలో నిలిచాయి.
సైకాలజీలో ఏకైక వర్శిటీ
భారత దేశం నుంచి సైకాలజీలో ఈ జాబితాలో ఢిల్లీ వర్శిటీ మాత్రమే చోటు దక్కించుకుంది. ఈ సంస్థ 401 - 500 ర్యాంకుల కేటగిరీల స్థానంలో చోటు దక్కించుకుంది. వాణిజ్య - అర్థశాస్త్రాల్లో జామియా మిలియా ఇస్లామియా వర్శిటీ 401 - 500 కేటగిరీల ర్యాంకుల కేటగిరీలోనే స్థానం సంపాదించుకుంది. క్లినికల్ అండ్ హెల్త్ లో మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 201 - 250 ర్యాంకుల కేటగిరీలో నిలవగా, సామాజిక శాస్త్రాల్లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ 401 - 500 ర్యాంకుల కేటగిరీలో చోటు దక్కించుకుంది.