Air pollution: పెరుగుతున్న వాయు కాలుష్యం - తగ్గిన ఉష్ణోగ్రతలతో క్షీణించిన గాలి నాణ్యత, అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు
Air pollution: తెలంగాణలో చలి తీవ్రత పెరగడంతో వాయు కాలుష్యం పెరుగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
![Air pollution: పెరుగుతున్న వాయు కాలుష్యం - తగ్గిన ఉష్ణోగ్రతలతో క్షీణించిన గాలి నాణ్యత, అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు Air pollution increasing in Telangana due to cold will increase Air pollution: పెరుగుతున్న వాయు కాలుష్యం - తగ్గిన ఉష్ణోగ్రతలతో క్షీణించిన గాలి నాణ్యత, అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/df242891154cd2329c5e5f0bea66b3c01698401616693876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణలో మారుతున్న వాతావరణ పరిస్థితులతో కాలుష్యం పెరుగుతోంది. ఓ వైపు పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమలు కారణమైతే, మరోవైపు పడిపోతున్న ఉష్ణోగ్రతలు కాలుష్య తీవ్రతను పెంచుతున్నాయి. కొద్ది రోజులుగా చలి క్రమంగా పెరుగుతుండడంతో గాలి నాణ్యత కూడా క్షీణిస్తోంది. ముఖ్యంగా కనిష్ట ఉష్ణోగ్రతల సమయాల్లో గాలి నాణ్యత మధ్యస్థ స్థాయికి పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
చలికాలంలోనే తీవ్రత ఎందుకంటే.?
పరిశ్రమలు, వాహనాలు, చెత్తను కాల్చడం ద్వారా, పీఎం 10 (సూక్ష్మ ధూళికణాలు), పీఎం 2.5 (అతిసూక్ష్మ ధూళికణాలు), ఓజోన్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి పలు కాలుష్య కారకాలు గాలిలోకి ఎక్కువగా విడుదలవుతుంటాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే ఆయా ధూళికణాలు చెల్లాచెదురవుతాయి. చలికాలంలో గాలిలో కదలికలు తక్కువగా ఉంటాయి. దీని వల్ల ఎక్కువ సేపు తక్కువ ఎత్తులో ఒకేచోట ఉండిపోతాయి. ఇవి గాలి పీల్చినప్పుడు ముక్కులోంచి నేరుగా లంగ్స్ లోకి ప్రవేశించడంతో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.
గాలి నాణ్యత లెక్కించేదిలా
గాలిలో నాణ్యత సూచీ 0 - 50 పాయింట్ల వరకూ ఉంటే గాలి స్వచ్ఛమైనదని, 51 - 100 మధ్య ఉంటే సంతృప్తికరమని, 101 - 200 మధ్య ఉంటే మధ్యస్థం అని నిపుణులు పేర్కొంటున్నారు. 201 - 300 ఉంటే హీనం అని, 301 - 400 ఉంటే అతి హీనమని, 401 - 500 ఉంటే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
కోకాపేటలోనే అత్యధికం
దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గాలి నాణ్యత సూచీని నమోదు చేస్తుంది. దీని ప్రకారం కొద్ది రోజులుగా హైదరాబాద్ తో పాటు, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. గురువారం కోకాపేటలో అత్యధికంగా గాలి నాణ్యత సూచీ 275, ఆ తర్వాతి స్థానాల్లో ఇక్రిశాట్ (158), జూపార్క్ (190), పాశమైలారం (183) నమోదైనట్లు తెలుస్తోంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
గాలి కాలుష్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
- ఆస్తమా, సీఓపీడీ వంటి సమస్యలున్న వారు చలి గాలి ప్రభావానికి గురి కాకుండా జాగ్రత్తపడాలి. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలి.
- బయటకు వెళ్లేటప్పుడు ఎన్ - 95 మాస్క్ వాడాలి. మార్నింగ్ వాకింగ్ వెళ్లే వారు ఎండ వచ్చాక బయటకు వెళ్లడం మంచిది.
- దీర్ఘకాలిక జబ్బులు, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారు ఇన్ ఫ్లూయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగుతున్న చలి
మరోవైపు, తెలంగాణలో జనవరి రాక ముందే చలి వణికిస్తోంది. వారం క్రితం వరకూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, క్రమంగా చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఈశాన్యం నుంచి తెలంగాణ వైపు చలిగాలులు వీస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పగలు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే, రాత్రి పూట చలి తీవ్రత పెరుగుతోందని అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
Also Read: 'ఆ భవనంలో దెయ్యం ఉంది' - యూట్యూబ్ వీడియోలతో హల్ చల్, చివరకు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)