Uniform Civil Code News: అసోం ఉమ్మడి పౌరస్మృతి బిల్లులో కఠిన నిబంధనలు రీజనేంటి?
ఉమ్మడి పౌరస్మృతి అమలు దిశగా.. బీజేపీ పాలిత రాష్ట్రాలు కదులుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం ఈ బిల్లును ఆమోదిస్తున్నాయి. ఇటీవల ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలుచేయగా ఇప్పుడు అసోం రెడీ అయింది.
Uniform Civil Code In Assam : దేశంలో ఉమ్మడి పౌర స్మృతి(UCC) అమలు దిశగా మరో రాష్ట్రం ముందుకు కదులుతోంది. ఇప్పటికే దేవభూమి ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఉన్న పుష్కరసింగ్ ధామీ(CM. Pushkarsingh Dhami) ప్రభుత్వం పట్టుబట్టి దీనిని అమలు చేస్తోంది. అసెంబ్లీ(Assembly)లో ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా వ్యతిరేకించినా కూడా.. దానిని అమలు చేయాలనే దిశగా వేసిన అడుగులను బీజేపీ ప్రభుత్వం సాకారం చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈశాన్య రాష్ట్రం అసోం(Assam) వంతు వచ్చినట్టుగా ఉంది. ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వమే ఉండడం గమనార్హం. పైగా పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడు.. హిమంత బిశ్వశర్మ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Narendra modi)కి అత్యంత అనుచరుడిగా మారిపోయారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి.. రాష్ట్రంలో ఈ బిల్లును ప్రవేశ పెట్టాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి శర్మ(CM Sharma) ముందుకు కదులుతున్నారు.
నేడో రేపో ఆమోదం..
ఇటీవల ఉత్తరాఖండ్(Uttarakhand)లో ఆమోదించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు(UCC)లో `సహజీవనం`పై అనేక ఆంక్షలు విధించారు. స్త్రీ, పురుషుల సహజీవనం ద్వారా జన్మించిన పిల్లలను చట్టబద్ధమైన పిల్లలుగా ఈ బిల్లు గుర్తించింది. వారికి ఆస్తిలోనూ వాటా కల్పించింది. ఇక, సహజీవనాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిం దేనని.. ఈ బిల్లులో స్పష్టం చేశారు. ఇక, అసోంలోకి వచ్చేసరికి మరిన్ని వివాదాస్పద నిర్ణయాలు స్పష్టం గా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ బిల్లు ముస్లింలనే టార్గెట్ చేసుకున్నట్టు విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం అసోం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే సోమవారం (ఈరోజు), లేదా రేపు ఈ బిల్లును ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.
ఎందుకు వివాదమైంది?
అసోం ప్రభుత్వం రూపొందించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు.. తీవ్రస్తాయిలో వివాదం సృష్టించేలా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఈ ముసాయిదా బిల్లుపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నా యి. కీలకమైన ముస్లిం మైనారిటీ వర్గాల వివాహాలు, విడాకుల రిజిస్ట్రేషన్ చట్టాన్ని రద్దు చేస్తున్నారు. దీంతో పాటు ఇతర మైనారిటీ వర్గాలకు కూడా.. ఈ బిల్లులో షాక్ ఇచ్చే నిర్ణయాలే ఉండడం గమనార్హం. దీంతో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ.. అసోంలో మైనారిటీ వర్గాలు గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా.. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలు, అసోం నేషనల్ ఫ్రంట్ పార్టీ బిల్లును వ్యతిరేకిస్తుండడం గమనార్హం.
ఇవీ.. బిల్లులో చేర్చిన కీలక అంశాలు..
బాల్య వివాహాలు రద్దు
హిందువులు కేవలం తాళి కట్టడం కాదు. దానిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
చర్చిలలో పెళ్ళి చెల్లదు
సిక్కుల పెళ్ళి చెల్లదు
బౌద్ధుల పెళ్ళి చెల్లదు
జైనుల పెళ్ళి చెల్లదు
ఆదివాసీల పెళ్ళి చెల్లదు
రాష్ట్రంలో ముస్లిం వివాహాలు, విడాకుల రిజిస్ట్రేషన్ చట్టం-1935ను రద్దు
వీటిని స్పెషల్ మ్యారేజీ యాక్ట్ కిందకు తీసుకురానున్నారు.
బహుభార్యత్వం ఏ సామాజిక వర్గంలోనూ చెల్లదు
దీనిని క్రిమినల్ నేరంగా పరిగణించనున్నారు.
విప్లవాత్మక నిర్ణయం: ప్రభుత్వం
అయితే.. ఈ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలుగా పేర్కొనడం గమనార్హం. యూసీసీ అమలుకు అడుగులు వేయబోతున్నామని సీఎం హిమంత బిశ్వశర్మ ఇటీవల చెప్పారు. ఆ దిశగా కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిపుణుల కమిటీ UCC మరియు బహుభార్యత్వ నిషేధ బిల్లును పరిశీలిస్తున్నట్టు చెప్పిన సీఎం.. ఎట్టి పరిస్థితిలోనూ దీనిని ఆమోదించే తీరుతామని చెప్పారు. ``UCC బహుభార్యాత్వాన్ని మాత్రమే నిషేధిస్తోంది, ఇది పౌర నేరంగా పరిగణిస్తారు. కానీ బహుభార్యత్వాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలని మేము ఆలోచిస్తున్నాం. దేశానికి ఏకరూప విధానం అవసరం. అందుకోసం మనం ఏ దిశలో వెళ్లాలనే దానిపై కేంద్ర నాయకత్వంతో కూడా ఒక దశలో చర్చించాను. నేను నిపుణుల కమిటీతో చర్చించా. ఈ రెండింటినీ సమం చేయాలని నిర్ణయించాం. ఇవి దీర్ఘకాలిక సంస్కరణలు`` అని సీఎం శర్మ పేర్కొన్నారు.