Southwest Monsoon : తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు, రాగల 48 గంటల్లో ఆ ప్రాంతాలకు విస్తరించే అవకాశం
Southwest Monsoon : తెలుగు రాష్ట్రాలతో సహా ఇతర ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని ఐఎండీ పేర్కొంది. రాగల 48 గంటల్లో తమిళనాడు, ఏపీతో సహా పలు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది.
Southwest Monsoon : ఏపీ, తెలంగాణతో సహా దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల విస్తరణ నెమ్మదిగా ఉందని భారత వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రుతుపవనాల కదలికలు అలస్యంగా ఉన్నాయని వెల్లడించింది. ప్రస్తుతానికి కర్ణాటకతో పాటు కొంకణ్, గోవా ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు చేరుకున్నట్లు తెలిపింది. రుతుపవనాలు ఉత్తర కొనదాహాను, పుణె, బెంగళూరు, పుదుచ్చేరిలో ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇవి రాగల 48 గంటల్లో కొంకణ్ సహా తమిళనాడు, ఏపీతో సహా ఇతర రాష్ట్రాల్లోకి రుతుపవనాలు విస్తరించే అవకాశముందని తెలిపింది.
తెలుగు రాష్ట్రాలకు చేరువగా రుతుపవనాలు
ఏపీ, తెలంగాణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది. ఉత్తర భారతదేశంలో రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర కోస్తాంధ్ర మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి బలహీనపడుతుందని స్పష్టం చేసింది. ఏపీలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర అదనంగా నమోదు అయినట్లు ఐఎండీ వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది.
రానున్న మూడు రోజులు వర్షాలు
నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని ఇతర ప్రాంతాలకు, కొంకణ్ తీరం వెంబడి ముంబయితో సహా చాలా ప్రాంతాల మధ్య, కర్ణాటకలోని ఇతర ప్రాంతాలలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రానున్న 48 గంటల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని ప్రాంతాలకు, కొంకణ్, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు, మొత్తం కర్ణాటక, తమిళనాడు , తెలంగాణ, ఏపీ , పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. మరోవైపు ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉత్తర కోస్తాంధ్ర తీరం వద్ద సముద్ర మట్టానికి 900 మీ. ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. దీంతో ఏపీలో రాగల మూడు రోజులు వర్ష సూచన ఉందని ఐఎండీ పేర్కొంది.
Also Read : Gujarat Lake Water : చెరువులో నీరంతా గులాబీ రంగులోకి మార్పు - దేవుడి లీలంటూ జనం పూజలు !