Gujarat Lake Water : చెరువులో నీరంతా గులాబీ రంగులోకి మార్పు - దేవుడి లీలంటూ జనం పూజలు !
గుజరాత్‌లోని ఓ చెరువులో నీళ్లు హఠాత్తుగా గులాబీ రంగులోకి మారిపోయాయి. కాలుష్యమని నిపుణులు కంగారు పడుతూంటే.. అ గ్రామ జనం మాత్రం దేవుడి లీలంటూ పూజలు ప్రారంభించేశారు.
Gujarat Lake Water : వేప చెట్టు నుంచి పాలు కారడం, వినాయక విగ్రహాలు నీళ్లు తాగడం లాంటి మిరకిల్స్ మనం తరచూ చూస్తూంటాం.. వింటూంటాం . కానీ చెరువులో నీళ్లన్నీ ఒక్క సారిగా రంగుమారిపోయాయి లాంటి విచిత్రాల గురించి మాత్రం అరుదుగా వింటూ ఉంటాం. అలాంటిది గుజరాత్‌లో జరిగింది. గుజరాత్‌లోని బనస్‌కాంత జిల్లా సుగాం గ్రామంలోని చెరువు ఒక్కసారిగా గులాబీ రంగులోకి మారిపోయింది. దీంతో ఇదేదో అద్భుతం అనుకుని చాలా మంది వచ్చి చూసి పోతున్నారు.
దేవుడి లీల వల్లే గులాబీ రంగులోకి నీళ్లు మారాయనుకుంటున్న గ్రామస్తులు
ఇండియా - పాకిస్తాన్ సరిహద్దులోని గ్రామంలో ఉంటుంది కొరేటి చెరువు. ఇందులో నీరు అనూహ్యంగా గులాబీ రంగులోకి మారింది.ఈ విషయం బయటకు రావడంతో సమీప గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో సరస్సులో నీటిని చూసేందుకు తరలివచ్చారు. వర్షపు నీటితో ఈ చెరువు నిండుతుండగా ఏడాది పాటు గ్రామస్తులు నీటిని వాడుకుంటారు. సమీపంలోని మహదేవ్ ఆలయ లీలతోనే చెరువులో నీరు గులాబీ రంగులోకి మారిందని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఆటోమేటిక్‌గా పూజలు కూడా ప్రారంభమయ్యాయనుకోండి అది వేరే విషయం.
కాలుష్యం వల్లనే అలా మారాయని చెబుతున్న నిపుణులు
అయితే పర్యావరణ వేత్తలు మాత్రం ఈ వ్యవహారంపై ఆందోళనచెందుతున్ారు. స్ధానిక అధికారులు చెరువు నీటి నమూనాలను పరీక్షల కోసం పంపారు. ప్రస్తుతానికి చెరువు నీటిని ఎలాంటి అవసరాలకూ వాడకూడదని గ్రామస్తులకు సూచించారు. స్థానిక అధికారులు ఎవరూ నీటిని వాడకుండా కాపలా పెట్టారు. చెరువు నీటిలో వరద నీరు కలవడంతోనే కెమికల్ రియాక్షన్ కారణంగా చెరువు నీరు గులాబీ రంగులోకి మారిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిపోర్టులు రాగానే అసలు విషయం తేలే అవకాశం ఉంది.
నీళ్లను ఎవరూ తాగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు
నిజానికి వేప చెట్టు నుంచి పాలు కారినా... వినాయక విగ్రహాలు నీళ్లు తాగినా అవేమీ అద్భుతాలు కాదని.. సైన్సేనని చాలా మంది నిరూపిస్తూ ఉంటారు. అయినా సరే వారిని నమ్మేవాళ్లు తక్కువ మందే ఉంటారు. ఎందుకైనా మంచిది దేవుడికి ఓ పూజ చేసేస్తే పోలా అనుకుని వచ్చి పూజలు చేసేవాళ్లే ఎక్కువ ఉంటారు. ఈ గుజరాత్ చెరువుకూ అదే పరిస్థితి. అది కాలుష్యం వల్ల అలా తయారైంది అని సైంటిఫిక్‌గా నిరూపించినా అక్కడి జనం వినే పరిస్థితి లేదు. అందుకే తాగకుండా ఉంటే చాలని అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.