Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేస్తుందా? ఢిల్లీ రాజకీయాల్లో మొదలైన అలజడి
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రోజుకో ఆసక్తికర ఘటన జరుగుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరుగుతాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Arvind Kejriwal Arrest: ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో రోజుకో ఆసక్తికర ఘటన జరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ (Aam Aadmi Party) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఇంటిపై గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దాడులు జరుగుతాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని, తమకు విశ్వసనీయ వర్గాల నుంచి పక్కా సమాచారం ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ ఇంటికి వెళ్లే మార్గాన్ని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు దిగ్బంధించారని ఆరోపిస్తున్నారు.
News coming in that ED is going to raid @ArvindKejriwal’s residence tmrw morning. Arrest likely.
— Atishi (@AtishiAAP) January 3, 2024
‘కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు జరపనున్నట్లు మాకు సమాచారం అందుతోంది. బహుశా ఆయన్ను అరెస్ట్ చేయొచ్చు’ అంటూ ఆప్ కీలక నేత అతిశీ బుధవారం రాత్రి సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం ఉందని ‘డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిషన్ ఆఫ్ దిల్లీ’ ఛైర్‌పర్సన్ జాస్మిన్ షా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తలెత్తబోయే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
మూడో సారి గైర్హాజరు
మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. అనంతరం పలు సార్లు ఈడీ నుంచి కేజ్రీవాల్‌కు సమన్లు వచ్చాయి. నవంబర్ 2, డిసెంబరు 21న విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ ఈ విచారణలకు ఆయన హాజరు కాలేదు. రెండు నోటీసుల తర్వాత మూడో సారి బుధవారం విచారణకు రావాలని తాజా నోటీసులు జారీ చేసింది. మరోసారి విచారణకు గైర్హాజరయ్యారు.
ఎన్నికల పనుల్లో బిజీ
రాజ్యసభ ఎన్నికలు, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల పనుల్లో తాను బిజీగా ఉన్నానని, విచారణకు హాజరవ్వలేనని ఈడీకి కేజ్రీవాల్ రాతపూర్వక సమాధానాన్ని పంపారు. దర్యాప్తు సంస్థ పంపే ఎలాంటి ప్రశ్నావళికైనా జవాబులు తెలపడానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో తనను విచారించడానికి గల నిజమైన ఉద్దేశాన్ని తెలపాలంటూ ఇప్పటికే పలుమార్లు లేఖలు పంపానని వాటిపై ఈడీ స్పందించాలని కోరారు.
కేంద్రం కుట్రలు
ఈడీ నోటీసులపై ఆప్ స్పందిస్తూ.. దర్యాప్తు సంస్థకు సహకరించడానికి కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఈ నోటీసులు ఎందుకు పంపారని..? ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని, అందుకే ఆయన్ను అరెస్టు చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆప్ ఆరోపించింది. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, అవినీతి నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. బీజేపీతో చేతులు కలిపిన వారిపై దర్యాప్తు సంస్థలు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆప్ ఆరోపించింది. దర్యాప్తుకు సహకరించడం అంటే నాయకులను అరెస్టు చేయడం కాదని వ్యాఖ్యానించింది. మరోవైపు ఢిల్లీలోని రూస్ అవెన్యూలోని ఆప్ కార్యాలయం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు.