అప్పుల్లో కర్ణాటక ప్రభుత్వం, అయినా మంత్రులకు కొత్త కార్‌లు - రూ. 10 కోట్ల ఖర్చు
Karnataka Ministers: మంత్రుల సెక్యూరిటీ కోసం ఇన్నోవా కార్‌లను ఇవ్వనుంది కర్ణాటక ప్రభుత్వం.
Karnataka Ministers:
33 వెహికిల్స్ కొనుగోలు..
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయంగా సంచలనమవుతోంది. మంత్రులందరికీ కొత్త వాహనాలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేయనుంది. కొత్తగా 33 Toyota Innova Hycross హైబ్రిడ్ SUVలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. 33 మంత్రులకు వీటిని అందజేయనుంది. ఇందుకోసం సుమారుగా రూ.10 కోట్లు కేటాయించింది. అంటే ఒక్కో వెహికిల్‌కి రూ.30 లక్షలు ఖర్చవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఇందుకు ఆమోదం తెలిపింది. ఆగస్టు 29నే అప్రూవ్ చేశారు సిద్దరామయ్య. అదే రోజు ఉత్తర్వులు కూడా విడుదల చేశారు. Toyota Kirloskar Private Ltd నుంచి నేరుగా ఈ కార్‌లు అందనున్నాయి. ఇందుకోసం Karnataka Transparency in Public Procurement (KTPP) చట్టంలో సెక్షన్ 4(G)ని సవరించింది ప్రభుత్వం. ఎలాంటి టెండర్లు ఇవ్వకుండానే నేరుగా కొనుగోలు చేసేందుకు ఆర్డర్ చేసింది. అసలే ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్రంలో ఇంత ఖర్చు చేసి మరీ మంత్రులకు కార్‌లు కొనడమేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అయితే...కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. మంత్రుల సేఫ్‌టీ కోసం ఈ మాత్రం ఖర్చు చేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
"ఇందులో తప్పేముంది..? మంత్రులు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందిగా. అందుకే కార్‌లు కొంటున్నాం. మిగతా రాష్ట్రాల్లో మంత్రులకు ప్రత్యేక హెలికాప్టర్లు, చాపర్‌లున్నాయి. మాకు అలాంటివేమీ లేవుగా. ఇప్పటికీ నేను సాధారణ ఫ్లైట్‌లోనే ప్రయాణిస్తున్నాను"
- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం
ఇటీవలే గృహ లక్ష్మి పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. వాటికీ దాదాపు రూ.17 వేల కోట్లు కేటాయించింది. ఆ వెంటనే కార్‌ల కొనుగోలుకి ఆమోదం తెలిపింది. వీటికీ కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇలా నిధులను ఈ స్థాయిలో ఖర్చు చేసుకుంటూ పోతే..మిగతా హామీలు ఎలా నెరవేర్చుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా...కార్‌లు కొనుగోలు చేసేంత డబ్బు ప్రభుత్వం దగ్గర ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రస్తుతానికి బీజేపీ మంత్రులు వాడిన వాహనాలనే కాంగ్రెస్ మంత్రులు వాడుతున్నాయి. అయితే...ఇప్పటికే అవి లక్ష కిలోమీటర్లకుపైగా తిరిగాయి. ఫలితంగా మైలేజ్ రావడం లేదు. పదేపదే మొరాయిస్తున్నాయని మంత్రులు చెబుతున్నారు. అందుకే కొత్త కార్‌లు కావాలని ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ విజ్ఞప్తి మేరకు సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రులకు కార్‌లు కొనుగోలు చేసేందుకు రూ.5 కోట్ల నిధులు ఖర్చు చేసింది. కానీ...ఈ సారి ఆ బడ్జెట్ పెరిగిపోయింది. ఇక ఇచ్చిన 5 హామీలను నిలబెట్టుకోడానికి రూ.50 వేల కోట్ల ఖర్చయ్యే అవకాశముంది. అందులో రూ.10 కోట్లు అంటే 0.02%. ఈ లెక్కలు చూపిస్తూ...తాము ఖర్చు చేసేది తక్కువే అని స్పష్టం చేస్తోంది.
Also Read: పాకిస్థాన్ వెళ్లిపోండి, ఇది హిందువుల దేశం - ముస్లిం విద్యార్థులకు టీచర్ వార్నింగ్