India-China LAC Issue: మళ్లీ అదే కథ.. భారత్- చైనా సైనిక చర్చల్లో పురోగతి శూన్యం
తూర్పు లద్దాఖ్‌లో ఏర్పడిన ప్రతిష్టంభనపై భారత్- చైనా మధ్య జరిగిన 14వ విడత చర్చలు విఫలమయ్యాయి. మరోసారి ఇరు దేశాలు చర్చించుకోవాలని నిర్ణయించాయి.
భారత్- చైనా మధ్య జరిగిన 14వ విడత సైనిక చర్చల్లో కూడా ఎలాంటి పురోగతి రాలేదు. తూర్పు లద్దాఖ్‌లో ఏర్పడిన ప్రతిష్టంభనపై చేసిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ఇరు దేశాల అధికారులు చేసిన ప్రతిపాదనలు కొలిక్కి రాకపోవడంతో మరోసారి భేటీ కావాలని భారత్- చైనా సైన్యాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సంయుక్త ప్రకటన జారీ చేశారు.
భారత్- చైనా మధ్య 14వ విడత కార్ప్స్ కమాండర్ భేటీ బుధవారం జరిగింది. వాస్తవాధీన రేఖ వెంబడి చుషూల్-మోల్దో సరిహద్దు పాయింట్ వద్ద సమావేశం నిర్వహించారు. రక్షణ, విదేశాంగ శాఖ ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు.
ఇరు దేశాల మధ్య గత ఏడాది జరిగిన 13వ చర్చల్లో కూడా ఎలాంటి పురోగతి రాలేదు. ఎల్‌ఏసీ వద్ద ప్రస్తుత పరిణామాలకు చైనా చేసిన దుస్సాహసాలే కారణమని డ్రాగన్‌తో జరిగిన నాటి చర్చల్లో భారత్ ప్రస్తావించింది. ఇరు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ, ఎల్‌ఏసీ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నం చేసిందని భారత ఆర్మీ స్పష్టం చేసింది. ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్తతలు తగ్గించేందుకు చైనా తగిన చర్యలు చేపట్టాలని, తద్వారా శాంతి నెలకొల్పాలని భారత సైన్యం అభిప్రాయపడింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి