Imran Khan Attack: 'చూస్తున్నాం, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం'- ఇమ్రాన్ ఖాన్ కాల్పుల ఘటనపై భారత్
India's Reaction On Imran Khan: పాకిస్థాన్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని భారత్ పేర్కొంది.
India's Reaction On Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిగిన ఘటనపై భారత్ స్పందించింది. పాకిస్థాన్‌లో పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి అన్నారు.
ఇదీ జరిగింది
దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలంటూ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, ఇమ్రాన్ ఖాన్ లాంగ్‌మార్చ్ పేరిట ర్యాలీ చేపట్టారు. గురువారం లాంగ్ మార్చ్ వజీరాబాద్‌లో అల్లాహో చౌక్‌కు చేరుకోగా ఇమ్రాన్ ఖాన్ కంటెయినర్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.
ర్యాలీలో ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ఇమ్రాన్ కంటెయినర్ పైకి ఎక్కి నిలబడిన సమయంలో జరిపిన ఈ కాల్పుల్లో ఆయన కాలికి గాయాలైనట్టు పీటీఐ నేత ఫవాద్ చౌధురి వెల్లడించారు. చికిత్స నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. పీటీఐకి చెందిన దాదాపు నలుగురు నాయకులు ఈ కాల్పుల్లో గాయపడ్డారు.
నిజానికి ఈ మార్చ్‌పై దాడి జరిగే ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరికలు వచ్చాయి. నిఘా వర్గాలు కూడా అప్రమత్తంగానే ఉన్నాయి. అయినా దాడి జరిగింది. మరోసారి ప్రధాని కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్న ఇమ్రాన్‌పై అటాక్ జరగటం అక్కడ సంచలనమైంది. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు...విచారణ జరిపారు. ఈ విచారణలో...తాను ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసేందుకే వచ్చానని అంగీకరించాడు నిందితుడు. దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని అందుకే చంపాలనుకున్నానని వివరించాడు.
నిజానికి...ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటంలో కొంత మేర సక్సెస్ అయ్యారు ఇమ్రాన్ ఖాన్. ఈ ఉద్యమం పీక్స్‌లో ఉందనగా ఆయనపై దాడి జరిగింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని సింపథీ కోసం ప్రయత్నించే అవకాశముంది. అంతే కాదు...షహబాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతుని కూడగట్టుకునేందుకూ ప్రయత్నించవచ్చు. ఇక ఇమ్రాన్ మద్దతుదారులు దేశంలో అలజడి సృష్టిస్తే ప్రచ్ఛన్న యుద్ధమూ తప్పదు. లేదంటే...షహబాజ్ చేతులు ఎత్తేసి పూర్తి అధికారాలను సైన్యానికి అప్పగించవచ్చు. ఈ రెండిట్లో ఏది జరిగినా...పాకిస్థాన్ కథ మళ్లీ మొదటికే వస్తుంది. ఈ మధ్యే FATF గ్రే లిస్ట్ నుంచి బయటపడ్డ ఆ దేశానికి...ప్రస్తుత పరిణామాలు పెద్ద దెబ్బే అవుతుండొచ్చు. పదేపదే సైన్యాన్ని తప్పు పడుతున్న ఇమ్రాన్ ఖాన్‌ను అణిచివేసేందుకు...షహబాజ్ ప్రభుత్వం ఆ సైన్యాన్నే అడ్డు పెట్టుకునే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ప్రస్తుత దాడితో ఇమ్రాన్ ఖాన్‌కు సింపథీ అయితే దక్కుతుంది. ఇది భవిష్యత్‌లో ఆయనకు రాజకీయంగా మంచి మైలేజ్ ఇచ్చే అంశమే. మరో వారం పది రోజుల్లో పాకిస్థాన్‌లో రాజకీయాలు ఎలా మారతాయో గమనించాలి.
Also Read: Gujarat AAP CM Candidate: గుజరాత్‌లో ఆమ్‌ఆద్మీ సీఎం అభ్యర్థిగా గద్వీ- ఎవరో తెలుసా?