YouTube Channels Blocked: ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేంద్రం వేటు, అసత్య ప్రచారాలు చేసినందుకే
YouTube Channels Blocked: వదంతులు వ్యాప్తి చేస్తూ, అసత్య ప్రచారాలు చేస్తున్న 8 యూట్యూబ్ ఛానెల్స్‌ని బ్లాక్ చేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది.
YouTube Channels Blocked:
భద్రతకు ముప్పు వాటిల్లుతోంది..
దేశ భద్రతకు భంగం కలిగిస్తున్న 8 యూట్యూబ్ ఛానల్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ 8 ఛానల్స్‌లో ఒకటి పాకిస్థాన్‌కు చెందింది కాగా..మిగతా 7భారత్ న్యూస్ ఛానల్స్‌వే. ఐటీ చట్టం-2021 ప్రకారం..వదంతులను వ్యాప్తి చేస్తూ..వ్యూయర్స్‌ని తప్పుదోవ పట్టిస్తున్న ఈ ఛానల్స్‌ను బ్లాక్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. "కేంద్ర సమాచార, ప్రసార శాఖ, ఐటీ నిబంధనల ఆధారంగా...8 యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్‌ని బ్లాక్ చేస్తున్నాం. బ్లాక్ చేసిన ఈ న్యూస్ ఛానెల్స్‌కి వ్యూయర్‌షిప్ 114 కోట్లు కాగా, 85లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు" అని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మతపరమైన కలహాలు సృష్టించటమే ఈ ఛానెల్స్ పని అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఛానెల్స్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలు కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పింది. "భారత్ మతపరమైన పండుగలను నిషేధించిందని, మతయుద్ధాలు సృష్టిస్తోందని..ఇలా ఎన్నో వదంతులు, అసత్య ప్రచారాలు చేస్తున్నాయి" అని వివరించింది. ఇలాంటి కంటెంట్ దేశంలో అలజడికి కారణమవుతుందని, ప్రజల సామరస్యాన్ని దెబ్బ తీస్తాయని వ్యాఖ్యానించింది కేంద్రం.
గతంలోనూ ఇదే నిర్ణయం..
సాయుధ బలగాలు, జమ్ము కశ్మీర్ లాంటి సున్నితమైన అంశాలపైనా అసత్యప్రచారం చేశాయని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పొరుగు దేశాలతో భారత్‌కు ఉన్న సత్సంబంధాలను ఈ వీడియోలు దెబ్బ తీస్తాయని, దేశ భద్రతకూ ఇవి ఆటంకం కలిగిస్తాయని చెప్పింది. ఇప్పుడే కాదు. గతంలోనూ దేశంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనే ఉద్దేశంలో పలు యూట్యూబ్ ఛానళ్లపై ప్రభుత్వం వేటు వేసింది. దేశానికి చెందిన 18 యూట్యూబ్ ఛానళ్లతో పాటు పాకిస్థాన్‌కు చెందిన 4 యూట్యూబ్ ఛానళ్లను నిషేధిస్తూ భారత సమాచారం- ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ 22 యూట్యూబ్ ఛానళ్లు.. పలు న్యూస్ ఛానళ్లకు చెందిన లోగోలను వాడుకుంటూ, తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి వ్యూయర్స్‌ను మోసం చేస్తున్నాయని ఐ అండ్ బీ మినిస్ట్రీ పేర్కొంది. ఈ ఛానెళ్లు ప్రధానంగా జమ్ముకశ్మీర్, భారత్ ఆర్మీపై తప్పుడు అంశాల్ని ప్రచారం చేస్తున్నాయి.
పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియా అకౌంట్లతోపాటు, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లను ఐ అండ్ బీ మినిస్ట్రీ నిషేధించింది. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతోన్న పలు యూట్యూబ్, సామాజిక మాధ్యమాల అకౌంట్లను భారత్ ఇటీవల బ్లాక్ చేసింది. నిఘా విభాగం అందించిన సమాచారంతో సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ వీటిని బ్లాక్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆ యూట్యూబ్ ఛానళ్లకు 1.20 కోట్ల సబ్స్క్రైబర్లు, 130 కోట్ల వ్యూస్ ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రసారం చేసే ఛానళ్లను మరిన్నింటిని నిషేధిస్తామని అధికారులు తెలిపారు. ఆ దిశగా నిఘా విభాగం పని చేస్తున్నట్లు చెప్పారు.
Also Read: Pawan Kalyan: వాళ్లకీ యాప్ ఉండాలట! పవన్ కల్యాణ్ డిమాండ్ - సీఎం జగన్‌పై సెటైరికల్ కార్టూన్