Hyderabad Crime News: భార్య దెప్పిపొడుస్తోందని రాయితో కొట్టి చంపేశాడు- హైదరాబాద్‌లోని మేడిపల్లిలో దారుణం
Telangana Crime News : చిన్న గొడవగా మొదలైన వివాదం హత్యకు దారి తీసింది. కోపావేశంలో ఓ భర్త.. తన భార్య తలపై బండరాయితో మోది దారుణంగా చంపాడు.
Husband Kills Wife In Hyderabad : కొన్నిసార్లు చిన్నగా మొదలైన గొడవ పెద్ద పెద్ద పరిణామాలకు దారి తీస్తుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం ఎన్నో అడ్డంకులను, ఇబ్బందులను తెచ్చి పెడుతుంది. ఏ రిలేషన్షిప్ లో అయినా గొడవలు కామన్. కానీ ఆ పరిస్థితి ముదిరితే దారుణాలు జరుగుతాయి. ఇలాంటి కేసులు ఇప్పటికే చాలానే చూసి ఉంటాం. తాజాగా ఇదే తరహా ఘటన ఒకటి హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. చిన్న గొడవ కాస్త హత్య చేసేవరకు దారి తీసింది.
పదే పదే ఇంటి విషయం ప్రస్తావిస్తూ దెప్పిపొడుస్తోందని
హైదరాబాద్ లోని మేడిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్వల్ప వివాదం ముదిరి హత్యకు దారి తీసింది. కోపంలో ఉన్న భర్త.. భార్య తలపై బండరాయితో మోది చంపాడు. బోడుప్పల్ టెలిఫోన్ కాలనీకి చెందిన బాధితురాలు నిహారికకు ఖమ్మం జిల్లా తిరుమలపాలెం కాకరకు చెందిన శ్రీకరరెడ్డితో 2017లోనే వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నాయి. పెళ్లి సందర్భంగా నిహారిక తల్లిదండ్రులు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం ప్రతాప్ సింగారంలో ఇల్లు కొనిచ్చారు. అయితే ఈ ఇల్లు తన పుట్టింటి వారే ఇచ్చారని నిహారిక ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చేదని సమాచారం. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవ మొదలైనట్టు తెలుస్తోంది. డిసెంబర్ 31న మంగళవారం తెల్లవారుజామున మాటామాటా పెరిగి చిన్న గొడవ.. పెద్ద గొడవగా మారింది. ఈ సమయంలో ఆవేశంతో ఊగిపోయిన శ్రీకర్ రెడ్డి.. తానేం చేస్తున్నాడో కూడా మర్చిపోయి.. భార్య నిహారిక తలపై పక్కనే ఉన్న బండరాయితో మోది క్రూరంగా చంపేశాడు. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారమివ్వడంతో.. ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
Also Read: ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
అలాంటి ఆవేశంతోనే కామారెడ్డిలో భార్యను చంపేసిన భర్త
ఇటీవల డబ్బుల విషయంలో గొడవపడి ఓ వ్యక్తి ఆవేశంలో తన భార్యను హతమార్చాడు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం అవుసుల తండాలో డిసెంబర్ 26, 2024న ఈ ఘటన జరిగింది. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన షేర్యా, అతని భార్య మోతీబాయి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మందుకు బానిసైన షేర్యా.. డబ్బుల విషయంలో భార్యను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఇటీవల కూడా వారి మధ్య ఇదే విషయంపై గొడవ జరగ్గా.. అది పెను ప్రమాదానికి దారి తీసింది. ఆవేశంలో షేర్యా.. భార్య మోతీబాయి మెడపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత షేర్యా ఇంటికి తాళం వేసి.. నిజాంసాగర్ పోలీస్ స్టోషన్ కు వెళ్లి లొంగిపోయినట్టు సమాచారం.
Also Read : Crime News: ఏంటీ ఇంత దారుణమా? - రూ.1500 కోసం వ్యాపారి మర్డర్, తిరుపతి జిల్లాలో ఘటన