రోజూ గంట పాటు మంత్ర పఠనం, కొబ్బరి నీళ్లే ఆహారం - అనుష్ఠానంలో భాగంగా మోదీ కఠిన దీక్ష
Ram Mandir Inauguration: అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రధాని మోదీ ఎంతో కఠినమైన దీక్ష పాటిస్తున్నారు.
Ram Mandir Pran Pratishtha: అయోధ్య రాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఇందుకోసమే తనను దేవుడు పుట్టించి ఉంటాడని ఈ మధ్యే మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ అపురూప ఘట్టం కోసం ప్రజలతో పాటు తానూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాని వెల్లడించారు. ఆ సమయంలోనే ప్రాణ ప్రతిష్ఠకు ముందు 11 రోజుల పాటు దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన కఠిన ఉపవాసం (PM Modi anushthaan) కూడా చేస్తున్నారు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకుంటున్నారు. అంతే కాదు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే...రోజూ గంట 11 నిముషాల పాటు ఓ ప్రత్యేక మంత్రాన్ని పఠిస్తున్నారు. కొంత మంది ఆధ్యాత్మిక గురువుల ఉపదేశం మేరకు ఈ మంత్రాన్ని ఆయన రోజూ జపిస్తున్నారు. ఇలాంటి దీక్ష చేసే సమయంలో ఈ మంత్రాన్ని జపించడం చాలా ముఖ్యమని, అది ఎంతో శక్తిమంతమైనదనీ తెలుస్తోంది. జనవరి 12న ఈ దీక్ష మొదలు పెట్టారు ప్రధాని మోదీ. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో ఇది ముగుస్తుంది. ఈ 11 రోజులుగా ప్రధాని మోదీ కొన్ని పవిత్ర గ్రంథాలనూ పఠిస్తున్నారు. కొన్ని కఠినమైన నిబంధనలూ పాటిస్తున్నారు. చాలా నిష్ఠగా ఉంటున్నారు. నేలపైనే నిద్రిస్తున్నారు. కొబ్బరి నీళ్లు తప్ప మరేమీ తీసుకోడం లేదట. రోజూ గోపూజ చేయడంతో పాటు దానాలు చేస్తున్నారు. ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం చేస్తున్నారు. షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ నిష్ఠను కచ్చితంగా అనుసరిస్తానని ప్రధాని మోదీ తన సన్నిహితులతో చెప్పారు. ఈ దీక్షలో భాగంగానే దేశంలోని పలు ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు ప్రధాని. నాసిక్‌లోని శ్రీ కాలారామ్ ఆలయం, లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయం, గురవాయర్, కేరళలోని శ్రీ రామస్వామి ఆలయంతో పాటు తమిళనాడులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయాలను సందర్శించారు.
స్వయంగా మోదీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో వాయిస్ మెసేజ్‌ని అప్‌లోడ్ చేశారు. ఇలాంటి గొప్ప ఉత్సవాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఇదో చారిత్రక ఘటన (Ayodhya News) అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. జీవితంలో ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా వస్తాయని, ఇదంతా ఆ దైవ సంకల్పమే అని భావోద్వేగానికి లోనయ్యారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులంతా ఉప్పొంగిపోయే సందర్భమని అన్నారు. ప్రతి చోటా రాముడే కనిపిస్తున్నాడని చెప్పారు.
"ఈ వేడుకను నా చేతుల మీదుగా జరగాలనే ఆ దేవుడు నాకీ జన్మ ఇచ్చినట్టున్నాడు. దేశ ప్రజలందరికీ ప్రతినిధిగా నేనీ ప్రాణప్రతిష్ఠ చేస్తాను. ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు పలు కీలక కార్యక్రమాలు జరుగుతాయి. అసలు ఈ ఘట్టాన్ని తలుచుకుంటేనే నేను భావోద్వేగానికి లోనవుతున్నాను. నా జీవితంలో ఇలాంటి అనుభూతి కలగడం ఇదే తొలిసారి"
- ప్రధాని నరేంద్ర మోదీ