Hmpv Cases in China : చైనాలో తగ్గుముఖం పట్టిన హెచ్ఎంపీవీ కేసులు - కొత్త అంటు వ్యాధులపై అధికారుల కీలక ప్రకటన
Hmpv Cases in China : కొవిడ్ 19 తర్వాత మరోసారి ప్రపంచాన్ని వణికించిన హ్యూమన్ మెటానిమో వైరస్‌కు సంబంధించిన కేసులు చైనాలో తగ్గుముఖం పట్టాయి. దీనిపై అక్కడి అధికారులు తాజాగా కీలక ప్రకటన చేశారు.

Hmpv Cases in China : ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హ్యూమన్ మెటానిమో వైరస్ భారత్‌కూ వ్యాపించింది. కొంతకాలంగా కలవరం రేపుతోన్న ఈ వైరస్ ప్రభావం ఉత్తర చైనా ప్రాంతంలో ఎక్కువగా వ్యాపిస్తుందనే వార్తలు రావడంతో అందరూ భయాందోళనలకు గురయ్యారు. అయితే ప్రస్తుతం అక్కడ హెచ్ఎంపీవీ కేసుల రేటు తగ్గుముఖం పడుతోందని చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. హెచ్ఎంపీవీ కొత్త వైరస్ ఏం కాదని, మెరుగైన నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రావడంతో గత కొన్నేళ్లుగా ఈ కేసుల్లో పెరుగుదల కనిపించని చైనా సీడీసీ పరిశోధకురాలు వాంగ్ లిపింగ్ తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఈ వైరస్‌కు సంబంధించిన కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయన్నారు. ఇప్పుడు ఉత్తర చైనాలో ఈ రేటు తగ్గుతోందన్న ఆమె.. 14 ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సున్న వారిలో కేసుల రేటు తగ్గుతోందని తెలిపారు. కొత్త అంటువ్యాధులేవీ బయటపడలేదని, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన కేసులే నమోదవుతున్నాయని చెప్పారు.
ఈ నెలాఖరుకు మరింత తగ్గుముఖం పట్టే ఇన్ఫెక్షన్స్
దేశంలో ఈ వైరస్‌కు సంబంధించిన కేసుల నమోదులో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, ఇది గతేడాది కంటే అధికమేం కాదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ గావో జిన్‌కియాంగ్ వెల్లడించారు. జనవరి చివరినాటికి దేశవ్యాప్తంగా ఈ ఇన్ఫెక్షన్స్ ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశముందని భావిస్తున్నట్టు కమిషన్ ప్రతినిధి హు కియాంగ్ కియాంగ్ అన్నారు.
భారత్‌లో హెచ్ఎంపీవీ కేసులు
చైనాలో కలకలం సృష్టించిన హెచ్ఎంపీవీ.. ఇప్పుడు భారతదేశంలోనూ వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 17 కేసులు నమోదైనట్టు సమాచారం. గుజరాత్: 5, మహారాష్ట్ర: 3, కర్ణాటక: 2, తమిళనాడు: 2, కోల్‌కతా: 3, అస్సాం: 1, పుదుచ్చేరి: 1 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. మరో పక్క ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళా 2025కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 45 కోట్ల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో భారత్ హ్యూమన్ మెటానిమో వైరస్ కేసులు మరింత పెరిగే అవకాశముందని పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే 2001లోనే ఈ వైరస్‌ను కనుగొన్నామని, ఇదేం కొత్త వైరస్ కాదని ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఇందులో భయాపడాల్సింది ఏం లేదన్నారు. అన్ని శ్వాసకోశ సంబంధిత వ్యాధులను ఎదుర్కొనేందుకు తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆస్పత్రుల్లో అనేక సౌకర్యాలు చేశామని స్పష్టం చేశారు. కానీ ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read : Los Angeles Wildfire : లాస్ ఏంజిల్స్ అగ్ని ప్రమాదం - ఆ రాష్ట్రాల బడ్జెట్ కంటే విలువైన ఆస్తి నష్టం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

