Hindu Temple Vandalised: కెనడాలో హిందూ ఆలయాలపై ఆగని దాడులు, గ్రాఫిటీతో అభ్యంతరకర రాతలు
Hindu Temple Vandalised: కెనడాలోని ఓ ఆలయ గోడలపై అభ్యంతరకర రాతలు రాశారు దుండగులు.
Hindu Temple Vandalised:
గోడలపై రాతలు..
కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. ఒంటారియోలోని ఓ హిందూ ఆలయ గోడలపై గ్రాఫిటీతో అభ్యంతరకర వ్యాఖ్యలు రాశారు దుండగులు. ఇప్పటికే దీనిపై విచారణ చేపడుతున్న పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఆ గోడలపై గ్రాఫిటీతో అభ్యంతరకర రాతలు రాసినట్టు వివరించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందా..? దీని వెనక ఎవరున్నారు..? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరగడంపై హిందువులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
"ఏప్రిల్ 5న పోలీస్ ఆఫీసర్లు ఆ హిందూ ఆలయానికి వెళ్లారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందేనని భావిస్తున్నాం. ఆ బిల్డింగ్ గోడలపై భారత్‌ను కించపరుస్తూ రాతలు రాశారు"
- పోలీసులు
అర్ధరాత్రి పూట ఇద్దరు వ్యక్తులు అదే ప్రాంతంలో తిరిగినట్టు పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు ఈ నేరం తానే చేసినట్టు అంగీకరించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఫిబ్రవరిలోనూ మిస్సిసౌగా ప్రాంతంలోని రామ మందిరంపై ఇలాంటి దాడే జరిగింది. కెనడా ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది.
గతంలోనూ దాడులు..
గతేడాది సెప్టెంబర్‌లోనూ కెనడాలోని BAPS స్వామినారాయణ్ మందిర్ వద్ద ఉన్న శిలాఫలకంపై గుర్తు తెలియన వ్యక్తులు "ఖలిస్థాన్ జిందాబాద్" అనే నినాదాలు రాశారు. అటు పక్కనే హిందుస్థాన్‌ను అనుమానించే విధంగా స్లోగన్స్ రాశారు. స్థానికంగా ఇది పెద్ద అలజడికి కారణమైంది. రాత్రికి రాత్రే వీటిపై ఎవరు రాశారన్న అంశంపై సరైన విచారణ జరపాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. టోర్నటోలో ఉన్న ఈ ఆలయం అక్కడ ఎంతో ప్రసిద్ధి. దీనిపై ఇండియన్ హై కమిషన్ (Indian High Commission) తీవ్రంగా స్పందించింది. ఆలయ ప్రతిష్ఠకు ఇలా మచ్చ తెచ్చిన వారెవరో కనుక్కో వాలని, నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులకు సూచించింది. దీనిపై పలువురు రాజకీయ నేతలూ స్పందించారు.
ఆగ్రహం..
బ్రాంప్టన్ (Brampton) సౌత్ ఎంపీ సోనియా సిధు గతంలో ట్వీట్ చేశారు. "భిన్న సంస్కృతులు, భిన్న విశ్వాసాలున్న సమాజం మనది. ఇక్కడ సురక్షితంగా జీవించే హక్కు అందరికీ ఉంది. ఈ ఘటనకు బాధ్యులెవరో గుర్తించి కఠిన శిక్ష విధించాలి" అని పోస్ట్ చేశారు. ఓ నెటిజన్...టెంపుల్ శిలాఫలకంపై అభ్యంతరకర రాతలు రాసినట్టు ఓ వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అయితే...ఈ వీడియో నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. "ఇలాంటి దుశ్చర్యలకు కెనడాలో తావు లేదు. వీలైనంత త్వరగా నిందితుల్ని పట్టుకుంటారని ఆశిద్దాం" అని ట్వీట్ చేశారు. భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య కూడా ఇదే విషయమై అసంతృప్తి వ్యక్తం చేశారు. కెనడాలోని హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని కొందరు ఉద్దేశపూర్వకంగాఇలాంటివి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనల్ని అందరూ ఖండించాలని సూచించారు.
Also Read: రాహుల్ గాంధీ నవ భారత మహాత్ముడు, ఇద్దరికీ చాలా పోలికలున్నాయి - కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు