Himachal Pradesh Election Results 2022: ప్చ్ గెలిచినా ఆనందం లేదు, ఆపరేషన్ లోటస్‌కు బలైపోతున్న కాంగ్రెస్
Himachal Pradesh Election Results 2022: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తున్నా ఆ ఆనందం కనిపించడం లేదు.
Himachal Pradesh Election Results 2022:
కాంగ్రెస్‌పై దాడి...
హిమాచల్‌ప్రదేశ్‌లో లీడ్‌లో దూసుకుపోతోంది కాంగ్రెస్. బీజేపీ రెండో స్థానానికే పరిమితమైంది. అయినా...కాంగ్రెస్ మాత్రం భయపడుతూనే ఉంది. ఇందుకు కారణం...బీజేపీ రిసార్ట్ రాజకీయాలు చేస్తుందనే అనుమానం. ఈ విషయంలో బీజేపీ ఆరితేరిపోయింది. ఎన్నికల్లో గెలవకపోయినప్పటికీ...అధికార పార్టీ ఎమ్మెల్యేలను తన వైపు ఆకర్షించి...ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే జరిగింది.
దీన్నే ఆపరేషన్ లోటస్ అని పిలుస్తుంటారు. ఈ ఆపరేషన్‌తో బాగా నలిగిపోయింది కాంగ్రెస్ పార్టీయే. మహారాష్ట్రలో జరిగిన పరిమాణాలు ఇటీవలి ఉదాహరణ. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన తీరు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. కీలక నేత అయిన ఏక్‌నాథ్ శిందేను తమ వైపు తిప్పుకుని ఆ తరవాత తెర వెనక నుంచి కథంతా బీజేపీయే నడిపిచిందన్న ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. అసోం వేదికగా జరిగిన రిసార్ట్ రాజకీయాలు నెల రోజుల పాటు మహారాష్ట్ర రాజకీయాల్ని ఉత్కంఠగా మార్చాయి. ఇప్పుడే కాదు. అంతకు ముందు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతి చోట బీజేపీ ఆపరేషన్ లోటస్ వ్యూహాన్ని అమలు చేసింది. 2018లో కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో విజయం సాధించింది. కమల్‌నాథ్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తరవాత ఉన్నట్టుండి జ్యోతిరాదిత్య సిందియా పార్టీపై తిరుగుబాటు చేశారు. దీన్ని అదునుగా తీసుకున్న బీజేపీ...సిందియా వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంది. 15 నెలల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సిందియా 2020లో బీజేపీలో చేరారు. ఆ తరవాతే కథంతా మారింది. పరిణామాలు చకచకా మారిపోయాయి.
క్రమంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంది బీజేపీ. ఫలితంగా..కమల్ నాథ్ సర్కార్ కుప్ప కూలింది.
వరుసగా అన్ని రాష్ట్రాల్లో..
2017లో జరిగిన ఎన్నికల్లో మణిపూర్‌లో విజయం సాధించింది కాంగ్రెస్. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 28 స్థానాల్లో గెలుపొందగా...బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌లో అంతర్గత కలహాల కారణంగా...బీజేపీ అలర్ట్ అయింది. వెంటనే రెబల్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ఏడాది గోవాలో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇక్కడ కూడా బీజేపీ ఆపరేషన్ లోటస్‌ను అమలు చేసింది. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నపాటుగా రాజీనామా చేశారు. గవర్నర్‌కు సమర్పించిన వెంటనే...బీజేపీ వాళ్లందరినీ పార్టీలో చేర్చుకుని బలం నిరూపించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకు ముందు 2016లో ఉత్తరాఖండ్‌లోనూ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో సతమతమైంది. అసెంబ్లీ స్పీకర్...ఈ ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేశారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ పాలనను అమలు చేశారు. దీనంతటి వెనక బీజేపీ ఉందని
కాంగ్రెస్ గట్టిగానే వాదించింది. కానీ...బీజేపీ సైలెంట్‌గా ఉంటూనే...కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను తన వైపు లాక్కుంది. ఇలా...ఎక్కడ కాంగ్రెస్ గెలిచినా అక్కడ ఏదో ఓ రకంగా బీజేపీ ఆ అధికారాన్ని లాక్కుంటోంది. ఇప్పుడు హిమాచల్‌లో గెలిచినా..ఆ ఆనందం ఎక్కువ సేపు నిలిచేలా లేదని ఫీల్ అవుతోంది కాంగ్రెస్.