Hi Mum Scam: ఆస్ట్రేలియాను కుదిపేస్తున్న Hi Mum స్కామ్, ఒక్క మెసేజ్‌తో మిలియన్ డాలర్లు స్వాహా
Hi Mum Scam: ఆస్ట్రేలియాలో Hi Mum స్కామ్ బాధితులు అంతకంతకూ పెరిగిపోతున్నారు.
Hi Mum Scam in Australia:
మెసేజ్‌తో మోసాలు..
స్కామ్ మెసేజ్‌ల కారణంగా ఆస్ట్రేలియన్లు ఈ ఒక్క ఏడాదిలోనే 7 మిలియన్ డాలర్లు పోగొట్టుకున్నారు. "Hi mum" అని మెసేజ్ చేయడంతో మొదలయ్యే ఈ మోసం చివరకు నట్టేట ముంచుతుంది. ఈ మెసేజ్‌తో బాధితుల దృష్టిని మరల్చుతున్నారు సైబర్ నేరస్థులు. "అమ్మా డబ్బులు కావాలి" అని మెసేజ్ చేస్తున్నారు. సొంత పిల్లలే కదా అని వీళ్లు పంపుతున్నారు. అంతా జరిగాక కానీ తెలియటం లేదు
తాము ట్రాప్‌లో చిక్కుకున్నామని. ఎక్కువ శాతం ఈ మోసాలు వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయి. ఫోన్ పోయిందని, కొత్త నంబర్ నుంచి మెసేజ్ చేస్తున్నామని చెప్పి మాటల్లోకి దింపి మెల్లగా డబ్బు లాగేస్తున్నారు. దాదాపు మూడు నెలలుగా ఆస్ట్రేలియాలో ఈ బాధితులు ఎక్కువయ్యారని సైబర్ క్రైం విభాగం వెల్లడించింది. ఇలాంటి మెసేజ్‌లు వచ్చిన వెంటనే అప్రమత్తం అవ్వాలని ఇప్పటికే ప్రజలందరికీ సూచనలు చేసింది. "ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యుల నుంచైనా సరే సాయం కావాలని మెసేజ్‌లు వస్తే వెంటనే నమ్మకండి. ముఖ్యంగా Hi mum స్కామ్ వలలో చిక్కుకోకండి. ఇప్పటికే 1,150 మంది బాధితులు డబ్బు పోగొట్టుకున్నారు. వీళ్ల నుంచి 2.6 మిలియన్ డాలర్ల సొమ్ముని సైబర్ నేరగాళ్లు కాజేశారు" అని ఆస్ట్రేలియన్ కన్‌జ్యూమర్ అండ్ కాంపిటీషన్ కమిషన్ (ACCC) ప్రకటించింది. "మీ పిల్లలైనా, బంధువులైనా, స్నేహితులైనా సరే...సాయం కావాలని మెసేజ్ వస్తే వెంటనే నేరుగా వాళ్ల అసలు నంబర్‌కే కాల్ చేయండి. మెసేజ్ చేసేది వాళ్లేనా కాదా ఓ సారి చెక్ చేసుకోండి. వాళ్లు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడితే...ఇదంతా ఫేక్ అని తేలిపోతుంది" అని సూచించింది. ఈ ఏడాదిలో మొత్తం 11 వేల మంది ఈ స్కామ్ బాధితులుగా మారారు. 7.2 మిలియన్ డాలర్లు పోగొట్టుకున్నారు. 55 ఏళ్లు పైబడిన మహిళలే బాధితుల్లో ఎక్కువ మంది ఉన్నారు.
We're urging Australians to be wary of phone messages from a family member or friend claiming they need help, following a significant rise in 'Hi Mum' scams. More than 1,150 people fell victim to the scam, with total reported losses of $2.6 million. https://t.co/pIeJKLDTVA pic.twitter.com/f7U0iTBK2s
— ACCC (@acccgovau) August 23, 2022
వాట్సాప్‌లో భారీ మోసాలు..
ప్రపంచ నంబర్ వన్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో సైబర్ నేరగాళ్లు మోసం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనికి అతి పెద్ద కారణం ఈ యాప్‌ని ఉపయోగించే వారి సంఖ్య. వ్యక్తిగత, వృత్తిపరమైన పని కోసం కూడా ఈ యాప్‌ని ప్రజలు ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఈ యాప్‌లో మోసానికి గురవడం చాలా సులభం. ఇందులో సైబర్ నేరగాళ్లు వివిధ రకాల పద్ధతుల ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. దీన్ని నివారించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే ఇలాంటి మోసాలకు దూరంగా ఉండొచ్చు.
మోసాన్ని నివారించడం ఎలా?
1. ప్రలోభపెట్టే సందేశం ఏదైనా ఉంటే, దానిని పట్టించుకోకండి.
2. మెసేజ్‌లో లింక్ ఉంటే, దాని క్లిక్ చేయవద్దు లేదా అందులో ఇచ్చిన ఏ నంబర్‌కు కాల్ చేయవద్దు.
3. మీరు పొరపాటున ఆ మెసేజ్‌ని నిజం అని నమ్మి వారితో మాట్లాడినట్లయితే, రివార్డ్ కోసం మీ నుంచి కొంత డబ్బు డిమాండ్ చేస్తే దానిని ఇవ్వకండి.
4. ఈ వ్యక్తులు మిమ్మల్ని డబ్బు అడగడానికి బదులు మీ బ్యాంకింగ్ వివరాలను అడిగే అవకాశం ఉంది. అలాంటి పొరపాటు అస్సలు చేయకండి. వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సంబంధిత సమాచారాన్ని అస్సలు షేర్ చేయవద్దు.