Heavy Rains: నెల రోజుల్లో 15 శాతం అధిక వర్షపాతం- ఆగస్టు మొదటి వారంలో రుతపవనాలకు బ్రేక్
Heavy Rains: జులై నెలలో రుతుపవనాలు సాధారణం కంటే దాదాపు 15 శాతం ఎక్కువగా నమోదు కాగా.. 10 శాతం లోటు నుంచి 6 శాతం అధికంగా వర్షాలు కురిసాయి.
Heavy Rains: జులై నెలలో రుతుపవనాలు సాధారణం కంటే దాదాపు 15 శాతం ఎక్కువగా నమోదు అయ్యాయి. జూన్ చివరిలో 10 శాతం లోటు నుంచి 6 శాతం అధికంగా వర్షాలు కురిసాయి. దీంతో జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడిక్కడ నీళ్లు రోడ్లపై చేరిపోయాయి. పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో రుతుపవనాలు తగ్గుముఖం పట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 6 నుంచి 7వ తేదీ నాటికే రుతుపవనాలు బలహీన పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికే దక్షిణ, మధ్య భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం తగ్గిపోయింది. గత రెండు రోజుల్లో రోజువారీ దేశవ్యాప్తంగా వర్షపు గణాంకాలు సాధారణం కంటే తక్కువగా పడిపోయాయి. సీజన్ రెండో భాగంలో ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య భారత దేశంలో వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. మరోవైపు ఎల్ నినో బలపడుతుందనే భయాలు కొనసాగుతున్నప్పటికీ.. ఈ సంవత్సరం రుతుపవనాలు సాధారణ పరిధిలో (96 శాతం నుంచి 104 శాతం వరకు) ముగుస్తుందనే ఆశలను పెంచింది. ఐఎండీ అంచనా వేసినట్లుగా దీర్ఘ కాల సగటు క్రియాశీల దశ జూన్ 24 నాటికి ప్రారంభమైంది. అలాగే తరువాతి 34 రోజులలో 24 (జూలై 28 వరకు) దేశంలో సాధారణ రోజువారీ వర్షపాతం నమోదైంది.
దేశంలో మొత్తం 36 వర్షపాతం ఉప విభాగాల్లో.. ఒక నెల క్రితం రుతుపవనాల లోటు 20% లేదా అంతకంటే ఎక్కువ ఉండగా, జూలై 30 నాటికి ఆ సంఖ్య ఆరుకు తగ్గింది. వీటిలో ఐదు ఉప విభాగాలు తూర్పు, ఈశాన్య ప్రాంతాలలో ఉన్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఈ ప్రాంతాల్లో కొంత వర్షం పడే అవకాశం ఉంది. బీహార్, జార్ఖండ్, గంగానది పశ్చిమ బెంగాల్, తూర్పు యూపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని ఉత్తర ప్రాంతాలలో వచ్చే ఐదు నుంచి ఆరు రోజుల్లో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. రుతుపవనాల ద్రోణి ఆగష్టు 6 నుంచి 7 నాటికి హిమాలయ పర్వతాల వైపు మళ్లే అవకాశం ఉందని.. ఇది రుతుపవనాల బలహీన దశ ప్రారంభానికి సంకేతమని ఐఎండీచీఫ్ చెప్పారు.
రుతుపవనాలు బలహీన దశలోకి ప్రవేశించడం లేదా యాక్టివ్ స్పెల్ తర్వాత విరామం తీసుకోవడం సాధారణమే అయినప్పటికీ.. ఇప్పటి వరకు బలహీనంగా ఉన్న ఎల్ నినో ఉనికి రాబోయే రోజులపై కాస్త ఆందోళనను పెంచుతోంది. భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి ఎం రాజీవ్ మాట్లాడుతూ.. బలహీనమైన దశ ఆగస్టు 20 వరకు కొనసాగవచ్చని కొన్ని నమూనాలు సూచిస్తున్నాయి. ఎల్ నినో మందగించడం లేదని రుతుపవనాల పట్ల ఆందోళన కల్గిస్తోందని అన్నారు. రాబోయే రెండు నెలల్లో దాని ప్రభావాన్ని మనం ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదని రాజీవ్ చెప్పారు. ఇదిలా ఉండగా... జూలై 21 నాటికి దేశంలో ఖరీఫ్ విత్తన విస్తీర్ణం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.4% ఎక్కువగా ఉందని తాజా ప్రభుత్వ గణాంకాలు వివరించాయి. ఇది మంచి వర్షపాతం కారణంగా గణనీయంగా పుంజుకుందని సూచిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు తెలంగాణలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈరోజు తేలిక పాటి, రేపు భారీ వర్షాలు కురవబోతున్నట్లు పేర్కొంది. మంగళవారం రోజు ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్ని చోట్లు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. అలాగే హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
Also Read: తెలంగాణలో మళ్లీ వానలు - నేడు మోస్తరు, రేపు భారీ వర్షాలు