Telangana Rains: తెలంగాణలో మళ్లీ వానలు - నేడు మోస్తరు, రేపు భారీ వర్షాలు
Telangana Rains: రాష్ట్రంలో రానున్న రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
Telangana Rains: తెలంగాణలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈరోజు తేలిక పాటి, రేపు భారీ వర్షాలు కురవబోతున్నట్లు పేర్కొంది. మంగళవారం రోజు ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్ని చోట్లు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. అలాగే హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 82 శాతంగా నమోదైంది. ఈ మేరకు రాష్ట్రానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి బలంగా గాలులు వీస్తున్నాయని వివరించింది.
ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 0.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇప్పటి వరకు రాష్ట్రం 35.31 సెంటీ మీటర్ల వర్షం కురవాల్సి ఉంది. 55.91 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఆదివారం రోజు సంగారెడ్డి జిల్లా జన్నారంలో 40.3 మిల్లీ మీటర్లు, మేడ్చల్ 37.5, మెదక్ జిల్లా కాగజ్ మద్దూరులో 35, యాదాద్రి జిల్లా బీబీ నగర్ 27.5, నిర్మల్ జిల్లా విశ్వనాథ్ పూర్ 27, సంగారెడ్డి జిల్లా లక్ష్మీసాగర్ 26.8, మేడ్చల్ జిల్లా కేశవరం 26, ఆలియాబాద్ 25, బండ మాదారంలో 24.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
మరోవైపు నేడు రాష్ట్రానికి రానున్న కేంద్రబృందం
తెలంగాణలో వరదల నేపథ్యంలో నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. వరద పరిస్థితిపై అంచనా వేసేందుకు గాను హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర బృందాన్ని నియమించారు. 8 శాఖల అధికారులతో కూడిన సెంట్రల్ టీమ్ తెలంగాణ రాష్ట్రానికి రానుంది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఈ నెల 31వ తేదీ నుంచి తెలంగాణలో పర్యటించనుంది. 8 శాఖల అధికారులతో కూడిన ఈ కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. క్షేత్రస్థాయిలో నష్టాలను కేంద్ర బృందం అంచనా వేసిన తర్వాత తెలంగాణ సర్కారు వివరణాత్మక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. అనంతరం అవసరం మేరకు సెంట్రల్ టీమ్ మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికను కేంద్ర హోంశాఖకు అందజేస్తుంది.
కేంద్ర బృందంలో వ్యవసాయ, ఆర్థిక, రహదారులు, జలశక్తి, విద్యుత్, అంతరిక్ష విభాగంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కు చెందిన అధికారులు ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో 2019-20, 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాల్లో సంబంధిత మంత్రిత్వ శాఖలు అమలు చేసిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద చేసిన కేటాయింపులు, నిధుల విడుదల, ఖర్చుల వివరాలను కూడా కేంద్ర బృందానికి ఇవ్వాలని సంబంధిత శాఖలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది.