Harish Rao On CMs Meet : ఏడు మండలాలపైనే మొదట చర్చించాలి - చంద్రబాబు, రేవంత్ భేటీపై బీఆర్ఎస్ డిమాండ్
Chandrababu And Revanth Meet : ముఖ్యమంత్రుల భేటీలో ఏడు మండలాలను తెలంగాణకు ఇచ్చే అంశంపై చర్చించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఏడు మండలాలు ఇచ్చిన తర్వాతనే మిగిలిన అంశాలపై ముందుకు వెళ్లాలన్నారు.
Chief Ministers meeting : తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రుల భేటీ ఆరో తేదీన హైదరాబాద్ జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ సీఎం కూడా ఈ భేటీకి అంగీకరించి అధికారికంగా ఆహ్వానం పంపే అవకాశం ఉంది. ఆరో తేదీన ఇరువురి భేటీ ఖాయం కావడంతో ఏ ఏ అంశాలపై చర్చిస్తారన్న దానిపై ఆసక్తి ప్రారంభమయింది. బీఆర్ఎస్ పార్టీ.. ఏపీలో కలిపిన ఏడు మండలాల ను మళ్లీ తెలంగాణలో కలిపేలా మొదటి అంశాన్ని ప్రయారిటీగా తీసుకుని చర్చించాలని డిమాండ్ చేసింది.
రాష్ట్ర విభజన సమయంలో లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్‌ను ఏపీలో కలిపారని హరీష్ రావు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఏపీకి అప్పగించారన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి చొరవ చూపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు రప్పించడానికి ప్రయత్నం చేయాలన్నారు. దీన్నే మొదటి ఎజెండాగా పెట్టాలన్నారు. ఏడు మండలాలు ఇచ్చిన తర్వాతనే మిగిలిన అంశాలపై ముందుకు వెళ్లాలని హరీష్ రావు అన్నారు. చంద్రబాబు అత్యంత శక్తి వంతుడని.. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆయన చేతిలోనే ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.
నిజానికి ఏడు మండలాల సమస్య రెండు రాష్ట్రాల మధ్య లేదు. కానీ భద్రాచలం సమీపంలో ఉన్న ఐదు గ్రామాలు పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్నం, ఎటపాక, గుండాల, కన్నాయిగూడెంలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ ఉంది. ఏపీలో ఏడు మండలాలు కలపాల్సి వచ్చినప్పుడు భద్రాచలం ఆలయ ప్రాంతాన్ని తెలంగాణకు వదిలేసి, మిగతా మండలం మొత్తం ఆంధ్రాకు కేటాయిద్దాం అని చట్టం చేశారు. ఇక్కడ ఒక సాంకేతిక సమస్య ఏమంటే భద్రాచలం పట్టణం మొత్తం అనంటే, కేవలం భద్రాచల పట్టణం మాత్రమేనన్న సాంకేతిక పదజాలంలో తెలంగాణకు భద్రాచలం మాత్రమే ఇచ్చి, భద్రాచలంలోని పంచాయతీలు ముఖ్యంగా, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, భద్రాచలం నెత్తిన ఉన్న పురుషోత్తపట్నం, దానికి ఆనుకొని ఉన్న గుండాల గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రానికి కేటాయించారు.
ఈ ఐదు పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగం. గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి వరద ముప్పు ఉంటుంది. ఆ ఐదు గ్రామాలను తెలంగాణకు కేటాయిస్తే ఆయా ఊర్ల నుంచి కరకట్ట నిర్మించి గోదావరి వరదల నుంచి భద్రాచలం పట్టణానికి శాశ్వతంగా రక్షణ కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపేలా ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. మేనిఫెస్టోలోనూ పెట్టింది. అయితే బీఆర్ఎస్ మాత్రం.. ఏడు మండలాలను వెనక్కి తీసుకోనేలా చర్చించాలని.. అదే పెద్ద విభజన సమస్య అని అంటోంది.