Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు, శివలింగాన్ని పరిరక్షించే గడువు పొడిగింపు
Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో శివలింగాన్ని కాపాడాలని గతంలో ఇచ్చిన ఆదేశాల గడువుని సుప్రీం కోర్టు పెంచింది.
Supreme Court on Gyanvapi Case:
ఆదేశాలు పొడిగింపు..
జ్ఞానవాపి కేసులో గతంలో "శివలింగాన్ని పరిరక్షించాలి" అని ఇచ్చిన ఆదేశాలను కొనసాగిస్తున్నట్టు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు హిందువులు వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ఈ ఏడాది మే17న శివలింగాన్ని రక్షించాలని ఆదేశాలిచ్చింది. అయితే...ఈ ఆర్డర్ గడువు నవంబర్ 12తో ముగియనుంది. మరోసారి హిందువులు ఈ ఆదేశాలను పొడిగించాలని పిటిషన్ వేయగా...సర్వోన్నత న్యాయస్థానం అందుకు అంగీకరించింది. "గతంలో ఇచ్చిన ఆదేశాల గడువుని పెంచుతున్నాం. మే17న ఇచ్చిన ఆదేశాల మేరకు నడుచుకోవాలి" అని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే...పిటిషన్ వేసిన హిందువులకూ కీలక ఆదేశాలిచ్చింది. అలహాబాద్ హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మస్జిద్ మేనేజ్‌మెంట్ కమిటీ వేసిన అప్పీల్‌పై 3 వారాల్లోగా సమాధానం చెప్పాలని తేల్చిచెప్పింది. జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫిక్ సర్వే చేయగా అందులో శివలింగం బయటపడిందని హిందువులు చెబుతున్నారు. దీనిపై ముస్లింలు, హిందువుల మధ్య వాగ్వాదం కొనసాగుతూ వస్తోంది. చివరకు ఇది సుప్రీం కోర్టుకు చేరింది. హిందువుల పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది మే 17వ తేదీన సుప్రీం కోర్టు వారణాసి జిల్లా మెజిస్ట్రేట్‌కు కీలక ఆదేశాలిచ్చింది. మసీదులో ఉన్న శివలింగాన్ని కాపాడాల్సిన బాధ్యతను అప్పగించింది. అంతే కాదు. ముస్లింలు జ్ఞానవాపి మసీదులో నమాజ్ చేసుకునేందుకు అనుమతినిచ్చింది. అటు వారణాసి కోర్టులోనూ దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది. మసీదులో ఉన్న శివలింగానికి పూజలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కొందరుహిందువులు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ వాయిదా పడుతూ వస్తోంది. నవంబర్ 8న ఈ అంశాన్ని పరిశీలించిన వారణాసి కోర్టు...నవంబర్ 14కి తీర్పుని వాయిదా వేసింది. అటు ముస్లింలు మాత్రం అది శివలింగం కాదని తేల్చిచెబుతున్నారు. వజూఖానాలోవాటర్ ఫౌంటేన్ నిర్మాణంలో ఓ భాగమని అంటున్నారు. నమాజ్ చేసుకునే ముందు అంతా ఇక్కడికే వచ్చి కాళ్లు చేతులు కడుక్కుంటారని వివరిస్తున్నారు.
వారణాసి కోర్టులో..
ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన వారణాసి కోర్టు ఓ కీలక తీర్పునిచ్చింది. మసీదులోని శివలింగానికి పూజలకు అనుమతించాలని ఓ ఐదుగురు హిందూ మహిళలు కోర్ట్‌లో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్ట్...ఈ అంశంపై సర్వే చేయటమే కాకుండా లోపల వీడియో తీసి సాక్ష్యాధారాలు బయట పెట్టాలని ఆదేశించింది. మే 16వ తేదీన ఈ సర్వే పూర్తైంది. మే 19న కోర్ట్‌లో ఈ సర్వేను ప్రవేశపెట్టారు. వీడియోగ్రఫీ సర్వేలో మసీదులో శివలింగం బయపడిందని హిందువులు వాదించారు. కానీ ముస్లింలు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. వాజుఖానాలో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేన్‌కు సంబంధించిన శకలం అని వివరించారు. మే 20 వ తేదీన సుప్రీం కోర్టు ఈ కేసుని వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది.
Also Read: Rajiv Gandhi Case: ఆ దోషులను వెంటనే విడుదల చేయండి, రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు