Rajiv Gandhi Case: ఆ దోషులను వెంటనే విడుదల చేయండి, రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు
Rajiv Gandhi Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Rajiv Gandhi Case:
ఆరుగురిని విడుదల చేయండి: సుప్రీం కోర్టు
రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నళిని, ఆర్‌పీ రవిచంద్రన్‌తో పాటు అందరినీ విడుదల చేయాలని స్పష్టం చేసింది. మొత్తం ఏడుగురు దోషులకు శిక్ష పడగా...అందులో ఒకరైన పెరరివలన్‌ను ఈ ఏడాది మేలో విడుదల చేశారు. ఏ ఆధారంగా అయితే...ఈ దోషిని విడుదల చేశారో అదే ఆధారంగా మిగతా ఆరుగురిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో మొత్తం ఏడుగురు దోషులుగా ఉన్నారు. నళిని శ్రీహరన్, మురుగన్, శంతన్, ఏజీ పెరరివలన్, జయకుమార్, రాబర్ట్ పయాస్, పీ రవిచంద్రన్‌కు శిక్ష పడింది. వీరిలో ఒకరిని విడుదల చేయగా...మిగతా ఆరుగురు తమిళనాడులోని జైల్లో శిక్ష అనుభవిస్తూ వస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల కారాగార శిక్ష వీళ్లకు విధించారు. ఇన్నాళ్లకు వాళ్లకు విముక్తి లభించనుంది.
Supreme Court directs release of six accused including Nalini and RP Ravichandran, serving life imprisonment in connection with the assassination of former Prime Minister Rajiv Gandhi. pic.twitter.com/nguZY99Svc
— ANI (@ANI) November 11, 2022
ఇలా హత్య జరిగింది..
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని 1991, మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ హత్య కేసులో దోషులుగా తేలిన పెరరివలన్‌తో పాటు మురుగన్, అతని భార్య నలిని, సుతేంతిరా రాజా అలియాస్ సంతన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్‌లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఈ ఏడుగురిని విడుదల చేయాలని గతంలో తమిళనాడు మంత్రివర్గం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇటీవల పెరరివలన్‌ను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసుని విచారించిన ధర్మాసనం రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరరివలన్‌ను విడుదల చేస్తూ ఆదేశాలిచ్చింది. చివరికి ఈ కేసులో దోషిగా తేలిన పెరరివలన్ తన 19 ఏళ్ల వయసులో అరెస్ట్ అయ్యాడు. 31 ఏళ్లుగా పెరరివలన్ జైలు శిక్ష అనుభవించారు. అయితే ఆయన్ను రిలీజ్ చేయాలని తమిళనాడు సర్కార్ చేసిన సిఫార్సును గవర్నర్ అడ్డుకోవడం సబబు కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఆర్టికల్ 142 అధికారాన్ని ఉపయోగించుకుని బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు.
సోనియా చొరవతో తగ్గిన శిక్ష..
నిజానికి ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేలుస్తూ 1998లో వారికి ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణశిక్ష విధించింది. కానీ...ఆ మరుసటి ఏడాదే పెరరివలన్ సహా మురుగన్, నళిని, శాంతన్ మరణశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. తరవాత 2014లో పెరరివలన్‌తో పాటు శంతన్, మురుగన్ మరణశిక్షను జీవిత ఖైదుగా తగ్గించింది. సోనియాగాంధీ చొరవ చూపడం వల్ల 2000 సంవత్సరంలో నళిని మరణశిక్షను కూడా యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించారు. ఆ తర్వాత మిగతా ముగ్గురు దోషులకు కూడా మరణశిక్షను జీవితఖైదుకు తగ్గించారు.