Guruvayur Elephant Camp: ఏనుగులంటే నాకు ప్రాణం, వాటిని సంరక్షించటం నా అదృష్టం అంటున్న మహిళా అధికారి
కేరళలోని గురువాయర్ ఆలయంలో ఏనుగులను సంరక్షించే బాధ్యతను తొలిసారి ఓ మహిళకు అప్పగించారు.
47 ఏళ్ల ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి
మూగజీవాలను అమితంగా ప్రేమిస్తుంటారు కొందరు. పెంపుడు జంతువులే ప్రాణంగా బతికేవారూ ఉంటారు. కేరళలోని గురవాయర్‌లో ఇలాంటి జంతు ప్రేమికురాలే ఉన్నారు. పేరు సీఆర్ లెజుమోల్. మావటి కుటుంబంలో పుట్టిన ఈమెకు ఏనుగులంటే ఎంతో ఇష్టం. వాటిని
సంరక్షించటం ఇంకా ఇష్టం. ఈ అభిరుచే ఆమెకు ఇప్పుడు ఉపాధి అయింది. అందుకే తెగ సంబరపడిపోతున్నారు. గురవాయర్‌లోని శ్రీకృష్ణ ఆలయంలోని పున్నతుర్ కొట్టలో ఏనుగులను సంరక్షించే బాధ్యతలు ఇటీవలే తీసుకున్నారు సీఆర్ లెజుమోల్. శ్రీకృష్ణుడికి పరమ భక్తురాలైన ఆమె, ఈ అవకాశాన్ని తన అదృష్టంగా భావిస్తోంది. మరో విశేషం ఏంటంటే 47 ఏళ్ల ఆలయ చరిత్రలో ఏనుగుల సంరక్షణకా విభాగానికి తొలి మహిళా మేనేజర్ ఈమే.
10 ఎకరాల స్థలంలో ఏనుగులు సంరక్షణ
పున్నతుర్ కొట్టలో మొత్తం 47 ఏనుగులున్నాయి. భక్తులే వీటిని ఆలయానికి సమర్పించారు. ప్రస్తుతానికి వీటి సంరక్షణా బాధ్యత అంతా ఈమే
చూసుకోనున్నారు. ఆలయానికి చెందిన ఏనుగులను ఉంచేందుకే ప్రత్యేకంగా ఈ పున్నతుర్ కొట్టను నిర్మించారు. 1975లో స్థానిక పాలకుడైన గురువాయర్ దేవస్వామ్ ఈ కొట్టను కొనుగోలు చేశారు. దాదాపు 10 ఎకరాల స్థలంలో నిండైన పచ్చదనంతో ఉంటుందీ స్థలం. ఈ ప్రశాంత వాతావరణంలోనే ఏనుగులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. సీఆర్ లెజుమోల్‌కి పెద్ద బాధ్యతనే అప్పగించారు. దాదాపు 150 మంది సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ మావటి వాళ్లతో మాట్లాడుతూ ఏనుగులు ఆరోగ్య పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉండాలి. ఆమె తండ్రి, మామగారు ఈ పున్నతుర్ కొట్టలోనే మావటి వాళ్లుగా పని చేసి రిటైర్ అయ్యారట. ఆమె భర్త కూడా మావటిగానే పని చేస్తున్నారు.
అభిరుచే ఉద్యోగంగా మారింది..
1996లో ఈ ఆలయంలో క్లర్క్‌గా చేరారు లెజుమోల్. ఈ బాధ్యతలు తీసుకోకముందు అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేశారు. ఈ బాధ్యత తనకు అప్పగించటం పట్ల చాలా ఆనందంగా ఉన్నారామె. ఏనుగులను సంరక్షించుకునే గౌరవమైన హోదాలో ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులకు కావాల్సిన ఆహారం అందించేందుకు ఇప్పటికే కాంట్రాక్ట్‌లు పూర్తయ్యాయి. రోజువారీ ఆలయంలో జరిగే కార్యక్రమాల్లో ఏనుగులు పాల్గొనేలా చూడటమే తన డ్యూటీ అని వివరిస్తున్నారు లెజుమోల్. పండగ రోజుల్లో ఓ 20 ఏనుగులను వేరే ఆలయాలకూ పంపుతామని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు వాటికి మెడికల్ చెకప్‌లు చేయిస్తూ, వాటి ఆరోగ్యాన్ని కాపాడతామని అంటున్నారు. ఏనుగులను సంరక్షించుకునే బాధ్యతలు అప్పగించటం పట్ల తన కుమారులూ ఎంతో ఆనందంగా ఉన్నారని చెబుతున్నారు. అభిరుచే ఉద్యోగంగా మారే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి అవకాశం కొద్ది మందికి మాత్రమే వస్తుంది. ఇప్పుడీ జాబితాలో చేరిపోయారు సీఆర్ లెజుమోల్.
Also Read: Maharashtra Political Crisis: పతనం అంచున ఠాక్రే సర్కార్- 24 గంటల్లో మరో ఏడుగురు ఎమ్మెల్యేలు జంప్
Also Read: Bengaluru Traffic Police: ట్రాఫిక్ పోలీస్ కాదు కలెక్షన్ కింగ్, ఆరు గంటల్లో రూ. 2 లక్షలు వసూలు