Louvre museum robbery: ఫ్రాన్స్ మ్యూజియంలో దోపిడీ - దోచుకుపోయింది గుంటూరు వజ్రాలే - ఇవిగో డీటైల్స్
Guntur diamonds: పారిస్‌లోని లూవ్రే మ్యూజియంలో దొంగతనం జరగింది. ఖరీదైన వజ్రాలు దోచుకెళ్లారు. అవి గుంటూరు, గోల్కొండకు చెందిన వజ్రాలే.

Guntur diamonds are stolen from Louvre museum in Paris: ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రసిద్ధ లూవ్రే మ్యూజియం నుంచి దొంగలు దొంగిలించిన నెపోలియన్, ఎంప్రెస్ ఆభరణాలు 'అమూల్యమైనవి' . ఈ దొంగతనం ఏడు నిమిషాల్లో జరిగినట్టు ఫ్రెంచ్ అధికారులు ధృవీకరించారు. చరిత్రకారులు, రత్న శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం, ఈ వజ్రాల్లో చాలావరకు గుంటూరు, గోల్కొండ నుంచి 17-18 శతాబ్దాల్లో యూరప్‌కు చేరినవే.
అక్టోబర్ 19, 2025 ఉదయం లూవ్రే మ్యూజియం తెరిచిన కొద్ది సేపటికే ఈ దొంగతనం జరిగింది. ముసుగు ధరించిన నలుగురు దొంగలు స్కూటర్లపై వచ్చి అపోలో గ్యాలరీలోకి ప్రవేశించారు. సీన్ నది వైపు నిర్మాణ పనులు జరుగుతున్న భాగం నుంచి బాస్కెట్ లిఫ్ట్ ఉపయోగించి లోపలికి చొరబడి, రెండు డిస్‌ప్లే కేసులను పగులగొట్టారు. దొరికిన వాటిని తీసుకెళ్లారు.
ఫ్రెంచ్ కల్చర్ మినిస్ట్రీ అధికారికంగా ధృవీకరించిన దొంగిలించిన ఆభరణాల జాబితా:
- క్వీన్ మేరీ-అమేలీ, క్వీన్ హార్టెన్స్ జ్యువెలరీ సెట్‌కు చెందిన టియారా.
- అదే సెట్‌కు చెందిన బ్రూచ్.
- అదే సెట్‌కు చెందిన నెక్లెస్.
- ఎంప్రెస్ జోసెఫిన్‌కు చెందిన డయాడెమ్, ఇయర్‌రింగ్స్.
- ఎంప్రెస్ మేరీ-లూయిస్‌కు చెందిన నెక్లెస్.
- ఎంప్రెస్ యుజీనీకు చెందిన బ్రూచ్.
- ఎంప్రెస్ యుజీనీకు చెందిన టియారా.
- ఎంప్రెస్ యుజీనీ క్రౌన్ (గోల్డ్, ఎమరాల్డ్స్, డైమండ్స్‌తో తయారైనది. అయితే ఇది దొంగలు పారిపోతుండగా పడిపోయి, మ్యూజియం బయట దెబ్బతిన్న స్థితిలో దొరికింది.ఈ ఆభరణాలు నెపోలియన్ I, నెపోలియన్ III కాలం నాటివి. అపోలో గ్యాలరీలో ప్రదర్శనలో ఉన్న ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్ భాగం. వీటి విలువ "అనంతమైనది" అని అధికారులు చెబుతున్నారు.
BREAKING: A gang of daring thieves has staged a "jaw-dropping" daylight heist at the Louvre in Paris, using a crane to smash an upstairs window & escaping on motorbikes as thousands of tourists visited the museum below.
— True Crime Updates (@TrueCrimeUpdat) October 20, 2025
The entire brazen raid on Sunday morning lasted just seven… pic.twitter.com/Ex5WvvsZSc
వజ్రాలు గుంటూరు నుంచి ఫ్రాన్స్‌కు !
ఈ ఆభరణాల్లోని వజ్రాలు భారతదేశంలోని గోల్కొండ గనుల నుంచి వచ్చినవే అని చరిత్రకారులు ధృవీకరిస్తున్నారు. గోల్కొండ వజ్రాలు ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి-కృష్ణా డెల్టా ప్రాంతంలో గుంటూరు జిల్లా సమీపం గల కొల్లూరు గని నుంచి లభించేవి. 4వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు భారత్ ప్రపంచంలోని ప్రధాన వజ్రాల మూలం. గోల్కొండ ఫోర్ట్ వజ్రాల వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
రీజెంట్ డైమండ్ 1698లో గుంటూరు సమీప కొల్లూరు గనిలో లభించింది. 140.64 క్యారెట్ల ఈ వజ్రం థామస్ పిట్ అనే బ్రిటిష్ వ్యాపారి కొనుగోలు చేశారు. 1717లో ఫ్రెంచ్ రీజెంట్‌కు విక్రయించారు. గ్రీక్ డయాడెమ్‌లో అమర్చారు. ఇది లూవ్రే మ్యూజియంలో ప్రదర్శనలో ఉంది. సాన్సీ డైమండ్ గోల్కొండ నుంచి వచ్చినది. ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్‌లో భాగం. హార్టెన్స్ డైమండ్..పింక్ డైమండ్, ఇండియా మూలం. క్వీన్ హార్టెన్స్ సెట్‌లో భాగం. ఎంప్రెస్ యుజీనీ క్రౌన్ 1853లో తయారైనది. 1,354 డైమండ్లు, 1,136 రోజ్ కట్ డైమండ్లు, ఎమరాల్డ్స్‌తో నిర్మితమయింది. ఈ వజ్రాల్లో చాలావరకు గోల్కొండ నుంచి వచ్చినవే, ఎందుకంటే 19వ శతాబ్దానికి ముందు పెద్ద వజ్రాలు ఇండియా నుంచే వచ్చేవి.
ఈ వజ్రాలు భారత్ నుంచి యూరప్‌కు వ్యాపారం, దోపిడీల ద్వారా చేరాయి. 18వ శతాబ్దంలో బ్రిటిష్, ఫ్రెంచ్ వ్యాపారులు గోల్కొండ వజ్రాలను కొనుగోలు చేసి యూరప్‌కు తీసుకెళ్లారు. నెపోలియన్ కాలంలో ఫ్రెంచ్ రాయల్ ట్రెజరీలో చేరాయి. గోల్కొండ వజ్రాలు తమ పారదర్శకత, పరిశుభ్రతకు ప్రసిద్ధి – ఇవి 'టైప్ IIa' వర్గానికి చెందినవి. గుంటూరు ప్రాంత గనులు ఇప్పుడు లేవు కానీ వాటి వజ్రాలు ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలలో ఇంకా మెరుస్తున్నాయి.





















