Gujarat Election Result: కోహ్లీ అయినా సరే ఆడిన ప్రతిసారీ సెంచరీ చేయలేడుగా - గుజరాత్ ఫలితాలపై భగవంత్ మాన్
Gujarat Election Result: గుజరాత్ ఎన్నికల ఫలితాలపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు.
Gujarat Election Result:
5 సీట్లు సాధించుకున్నాంగా : భగవంత్ మాన్
గుజరాత్ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆప్...పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 5 సీట్లకే పరిమితమైంది. ఓటు షేర్ విషయంలో కాస్త సంతృప్తి కలిగినా...పూర్తి స్థాయిలో మాత్రం ఆ పార్టీకి నిరాశే మిగిలింది. అటు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించటం వల్ల కాస్తో కూస్తో ఊరట కలిగింది. ఈ ఓటమిపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. గుజరాత్‌లో ఎందుకిలా ఓడిపోయారన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు. "విరాట్ కోహ్లీ కూడా ఆడిన ప్రతిసారీ సెంచరీ చేయలేడుగా" అని బదులిచ్చారు. గుజరాత్‌లో ఆప్ తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంత ధీమాగా ఎలా అనగలిగారు అన్న ప్రశ్నకూ గట్టిగానే బదులిచ్చారు. "కనీసం కేజ్రీవాల్ ధైర్యం చేసి బరిలోకి దిగారు. కాంగ్రెస్‌లాగా ఓటమిని ముందే ఒప్పుకోలేదు. కష్టపడ్డాం. పంజాబ్ నుంచి గుజరాత్‌లోకీ ఎంట్రీ ఇచ్చాం. ఇప్పుడు ఆప్...ఓ జాతీయ పార్టీగా అవతరించింది" అని స్పష్టం చేశారు. అంతే కాదు. గుజరాత్‌లో తమకు 13% ఓటు షేర్ దక్కిందని గుర్తు చేశారు. "మేం సున్నా నుంచి 5 సీట్లకు ఎదిగాం. అలా చూస్తే మేం ఓడిపోయినట్టు కాదుగా" అని చెప్పారు. ఇదే సమయంలో బీజేపీతో పాటు ప్రధాని మోడీపైనా విమర్శలు చేశారు. మూడు చోట్ల ఎన్నికలు జరిగితే...బీజేపీ కేవలం ఒక్క చోట మాత్రమే గెలవగలిగిందని అన్నారు. "హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేకపోయింది" అని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిపై చేసిన పోరాటం నుంచి పుట్టిందని వెల్లడించారు. "వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి ఈ పార్టీ పెట్టలేదు. దేశానికి సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్న సామాన్యుల ఆలోచన నుంచి పుట్టింది" అని స్పష్టం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం..
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపైనా స్పందించారు. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని అధిగమించి ఆప్ అధికారంలోకి వచ్చింది. "ప్రజలే మీ తరపున పోరాటం చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఏ శక్తీ ఓడించలేదు" అని అన్నారు భగవంత్ మాన్. భారత దేశ చరిత్రలో ఇంత వేగంగా పురోగతి సాధించిన పార్టీ మరోటి లేదని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌లో ఓడిపోయినప్పటికీ...అక్కడి ప్రజల సంక్షేమం కోసం పని చేస్తూనే ఉంటామని వెల్లడించారు. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మెజార్టీ మార్క్ 126ను దాటి 134 వార్డుల్లో కేజ్రీవాల్ పార్టీ గెలుపొందింది. మరోవైపు భాజపా 104 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ కేవలం 9 స్థానాలను
సాధించింది. ఆమ్‌ఆద్మీ పార్టీ గెలుపుపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. దిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంసీడీ చరిత్రలోనే అరుదైన సంఘటన జరిగింది. సుల్తాన్‌పురి-ఏ వార్డులో ఆప్ తరపున పోటీ చేసిన బోబి విజయం సాధించారు. దీంతో తొలిసారి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎంసీడీ సభ్యులుగా ఎన్నికైనట్లయింది.
Also Read: Iran Hijab Row: యువకుడిని ఉరి తీసిన ఇరాన్ ప్రభుత్వం, అలా చేశాడన్న కోపంతోనే శిక్ష