Elephants in Chittoor: చిత్తూరులో ఏనుగుల బీభత్సం - పొలాలను తొక్కి నాశనం చేసిన గజరాజులు
Elephants in Chittoor: చిత్తూరు జిల్లాలో ఓ ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. మొత్తం 12 గజరాజులు పంట పొలాలతో పాటు ఓ లేగదూడను తొక్కి చంపాయి.
Elephants in Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బైరెడ్డిపల్లె మండలం, తార్లచేను గ్రామం శివారులో దాదాపు 12 ఏనుగుల గుంపు పంట పొలాలను తొక్కి నాశనం చేశాయి. అంతేకాకుండా పొలం వద్ద ఉన్న లేగదూడను ఏనుగులు తొక్కి చంపాయి. రాగి, టమోట, వేరుశనగ వంటి పంటలను తొక్కి పూర్తిగా నాశనం చేశాయి. డ్రిప్ పైపులు, బోర్ మోటర్ పరికరాలను కూడా తొక్కడంతో అవన్నీ ధ్వంసం అయ్యాయి. అయితే విషయం గుర్తించిన రైతులు.. తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పంటను మొత్తం నాశనం చేయడంతో తాము ఎలా బతకాలంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏనుగుల బీభత్సం వల్ల సుమారు లక్ష రూపాయలకుపైగా పంట నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెలరోజుల క్రితం శ్రీకాకుళంలో ఏనుగుల బీభత్సం
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు పంటలను నాశనం చేయడమే కాకుండా ప్రజలపై దాడి చేస్తూ ప్రాణాలను తీస్తున్నాయి. ఏనుగుల గుంపు గ్రామాల వైపు రాకుండా జిల్లాకు చెందిన 13 మంది ట్రాకర్లతో విధులు నిర్వహిస్తున్నారు. వీరు ఏనుగులు గ్రామం వైపు రాకుండా చూసే క్రమంలో వాటి బారిన పడి గాయాల పాలవ్వడం ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల భామిని మండలం పసుకుడిలో ఓ ట్రాకర్ పై ఏనుగులు దాడి చేసి తొక్కి చంపేశాయి. ఆ ట్రాకర్ పాతపట్నం మండలం తిమికి చెందిన ఆదినారాయణ అనే గిరిజనుడు. దీనిపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ గా తీసుకుంది. సుమోటోగా కేసు నమోదు చేయడమే గాకుండా ఉన్నతాధికారులతో పాటు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు ఈ వ్యవహరంపై జాతీయ గిరిజన కమిషన్ రిసెర్చ్ అధికారి అంకిత్ కుమార్ సేన్ పేరిట నోటీసు జారీ అయింది.
అటవీ శాఖ ప్రిన్సిపల్ ఛీప్ కన్జర్వేటర్ వై.మధుసూధన రెడ్డి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకార్కు తాజాగా నోటీసులు పంపారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల ట్రాకర్ మృతి చెందారన్న దానిపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరడం ఇప్పుడు అధికారుల్లో చర్చనీయాంశం అయింది. అటు గిరిజనులు కూడా అధికారుల తీరుపై విమర్శలు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రక్షణగా ఉన్న ట్రాకర్ మృతి చెందితే కనీసం ఆ కుటుంబానికి తగిన గౌరవం ఇవ్వలేదంటూ ఆరోపిస్తున్నారు. దహన సంస్కారాల రోజు కూడా ఆ శాఖాధికారులు పెద్దగా పట్టించుకోలేదని ఆదివాసీ వికాస పరిషత్ ప్రతినిధి వాబ యోగి ఆరోపించారు. అదే ప్రభుత్వ ఉద్యోగి అయితే ఇలానే చేసి ఉండేవారా అని ప్రశ్నిస్తున్నారు. ఏనుగుల దాడిలో మృతి చెందితే కేవలం రూ.5లక్షలు ఇచ్చి చేతులు దులుపు కోవడం తగదని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇద్దరు ట్రాకర్లు చనిపోయారని, వారు కూడా గిరిజనులేనని తెలిపారు. వారి కుటుంబాలను కూడా పాలకులు పరామర్శించి ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. తక్షణమే ఆయా కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాగా రూ.50 లక్షలు ఇవ్వాలని, ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.