(Source: ECI/ABP News/ABP Majha)
Fodder Scam Case: లాలూకు ఐదేళ్లు జైలు శిక్ష- దాణా కుంభకోణం కేసులో కోర్టు తీర్పు
ఆర్‌జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు దాణా కుంభకోణం కేసులో ఐదేళ్లు జైలు శిక్ష పడింది.
దాణా కుంభకోణం కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష ఖరారైంది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60లక్షలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఈ నెల 15నే లాలూను దోషిగా తేల్చింది న్యాయస్థానం. ఈ కేసులో మరో 24 మంది నిందితులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.
దాణా కేసే
ఈ డోరాండ్ ట్రెజరీ కేసు కూడా దాణా కుంభకోణానికి (Fodder Scam) సంబంధించినదే. 1990, 1995 మధ్యకాలంలో డోరాండా ట్రెజరీ నుంచి రూ. 139.35 కోట్ల రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేయడంపై ఈ కేసు నమోదైంది. ఇది దాణా కుంభకోణంలో అతిపెద్ద కేసు.
ఏంటి కేసు
దాణా కుంభకోణానికి సంబంధించి 1996లో సీబీఐ పలు కేసులు నమోదు చేసింది. 170 మందిని నిందితులుగా పేర్కొంది. ఇందులో 55 మంది ఇప్పటికే మృతి చెందారు. మరో ఏడుగురిని ప్రభుత్వ సాక్ష్యులుగా సీబీఐ పేర్కొంది. మరో ఇద్దరు కోర్టు తీర్పు రాకముందే తప్పుచేశామని ఒప్పుకున్నారు. ఆరుగురు ఇప్పటికీ తప్పించుకుని తిరుగుతున్నారు. మరో 99 మంది తీర్పు కోసం వేచి చూస్తున్నారు.
లాలూ ప్రసాద్‌తో పాటు మాజీ ఎంపీ జగదీశ్ శర్మ, డా. ఆర్‌కే రాణా సహా పలువురు ఈ డోరాండా ట్రెజరీ కేసులో నిందితులుగా ఉన్నారు.
బెయిల్
దాణా కుంభకోణానికి సంబంధించిన గత నాలుగు కేసుల్లో లాలూకు 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే ఈ కేసులు అన్నింటిలోనూ లాలూకు పట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బిహార్ సీఎంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో పశుసంవర్థక శాఖలో రూ.950 కోట్ల దాణా కుంభకోణం జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో 1996లో ఈ కుంభకోణాన్ని దర్యాప్తు చేసేందుకు సీబీఐ 53 కేసులు నమోదు చేసింది.
Also Read: Shivamogga Murder: భజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్య- 'హిజాబ్' వేళ మరో ఘటన
Also Read: Covid Update: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 16 వేల కేసులు