Electric Vehicles: వర్షాల్లోనూ ఈవీలు నడపొచ్చు, బ్యాటరీతో ఏ సమస్యా ఉండదంటున్న నిపుణులు
Electric Vehicles: వానాకాలంలో విద్యుత్ వాహనాలు నడపటం వల్ల ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని నిపుణులు చెబుతున్నారు.
Electric Vehicles :
ఐపీ సిస్టమ్‌తో బ్యాటరీ భద్రం..
వానాకాలంలో విద్యుత్ వాహనాలు నడపొచ్చా..? వాటిని ఛార్జ్ చేసుకునే సమయంలో ఎలాంటి ప్రమాదమూ జరగదా..? ప్రస్తుతం విద్యుత్ వాహనదారులను వెంటాడుతున్న ప్రశ్నలివి. విద్యుత్ వాహనాలను నీళ్లలో నడిపితే, షాక్‌కు గురయ్యే ప్రమాదముందన్న అనుమానమూ కొందరిలో వ్యక్తమవుతోంది. అయితే...ఎక్స్‌పర్ట్‌లు దీనిపై వివరణ ఇస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలను ఎలాగైతే వర్షాలు నడుపుతామో, అదే విధంగా విద్యుత్ వాహనాల్లో ప్రయాణించవచ్చని చెబుతున్నారు. అన్ని ఈవీల్లోనూ ఇంగ్రెస్ ప్రొటెక్షన్ (Ingress Protection)తో
వస్తాయి. దీన్నే IP రేటింగ్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. బ్యాటరీని దుమ్ము, నీటి నుంచి రక్షిస్తుంది ఈ వ్యవస్థ. సాధారణంగా పెట్రోల్, డీజిల్ కార్లను వరదల్లో నడపకూడదనిచెబుతుంటారు. ఈవీ విషయానికొస్తే...ఈ IP సిస్టమ్ వల్ల కార్ ఒక మీటర్ లోతు వరకూ నీళ్లలో ఉన్నా ఏమీ కాదు. దాదాపు అరగంట పాటు అలా నిలిపివేసినా ఎలాంటి డ్యామేజ్ జరగదు. కాబట్టి...వర్షాల్లో విద్యుత్ వాహనాలను నడపటం వల్ల ఎలాంటి ఇబ్బందులూ రావు అని చెబుతున్నారు నిపుణులు.
ప్రొటెక్టివ్ లేయర్స్ ఉంటాయ్..
ఒకవేళ ప్రతికూల పరిస్థితులే ఎదురైనా, ఎన్నో ప్రొటెక్టివ్ లేయర్స్ అందులో ఉంటాయని వివరిస్తున్నారు ఎక్స్‌పర్ట్‌లు. వరదలో మునిగిపోయినప్పుడు బ్యాటరీ సేఫ్‌గానే ఉంటుందని, దానంతట అదే వేరైపోతుందని అంటున్నారు. కాబట్టి...డ్రైవర్‌కు ఎలాంటి సమస్యా రాదని స్పష్టం చేస్తున్నారు. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే...వానాకాలంలో ఈ ఛార్జింగ్ కేబుల్స్‌తో ఎలాంటి సమస్యా ఉండదు. వర్షంలో ఛార్జింగ్ పెట్టిన సమయంలోనూ ఈ వైర్లను తాకితే ఎలాంటి అపాయమూ ఉండదు. ఈ కేబుల్ వైర్లు వెదర్‌ప్రూఫ్‌తో వస్తాయి. ఛార్జింగ్ పెట్టిన సమయంలో
ఉన్నట్టుండి వర్షం పడినా ఆందోళన చెందాల్సిన పని లేదని వివరిస్తున్నారు. ఈవీని మార్కెట్‌లోకి విడుదల చేసే ముందు వెదర్‌ప్రూఫ్ టెస్టింగ్ చేస్తారు.
పెట్రో వాహనాలకే ఎక్కువ ప్రమాదాలు..!
పెట్రో ధరలు పెరిగినప్పటి నుంచి అందరూ విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. పలు సంస్థలు కొత్త ఈవీ వేరియంట్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. టూవీలర్స్‌తో పాటు ఫోర్ వీలర్స్‌కి కూడా బాగానే డిమాండ్ ఉంటోంది. ఇప్పుడు ఈవీ మార్కెట్‌జోరుమీదే ఉన్నప్పటికీ ఓ విషయం మాత్రం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. తరచుగా విద్యుత్ వాహనాలు కాలిపోతుండటం ఈవీ మార్కెట్‌పైఈవీ ప్రభావం చూపుతోంది. కొనుగోలు చేయాలని చూస్తున్న వారు కూడా ఈ ప్రమాదాల కారణంగా వెనకడుగు వేయాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చకు దారి తీసింది. అయితే కొందరు వాహన రంగ నిపుణులు విద్యుత్ వాహనాల కన్నా పెట్రో వెహికిల్సే ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలకు గురి అవుతున్నాయని తేల్చి చెబుతున్నారు.
అయితే ఇక్కడే మరోఅంశం కీలకంగా చెప్పుకోవాలి. పెట్రో వాహనాల నుంచి మంటలు వచ్చినప్పుడు జరిగే నష్టంతో పోల్చి చూస్తే ఈవీలు దగ్ధమైనప్పుడు కలిగే నష్టమే ఎక్కువ. ఇందుకు ప్రధాన కారణంగా ఈవీలోని బ్యాటరీ. ఈ బ్యాటరీలోని రసాయనాలు కాలినప్పుడు ఆ మంటల్ని ఆర్పడం అంతసులభం కాదు. ఇక విద్యుత్ వాహనాల్లో ఎప్పుడు మంటలు చెలరేగుతాయన్నది చెప్పటమూ కష్టమే. అదే పెట్రో వాహనాల్లో అయితే ఫ్యుయెల్ లీకేజ్ లాంటివి ప్రమాదాలకు కారణమవుతాయని కచ్చితంగా చెప్పొచ్చు. విద్యుత్ కార్లను ఓవర్ ఛార్జింగ్ చేసినప్పుడూ ఒక్కోసారి ఇలాంటి ఘటనలు జరిగే ప్రమాదముంటుంది.