EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !
ఉచిత పథకాలు అమలు చేస్తామని హామీ ఇస్తే .. వాటికి నిధులు ఎలా సమకూర్చుకుంటారో కూడా చెప్పాలనే నియమాన్ని ఈసీ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. దీనిపై ఈసీ కసరత్తు చేస్తోంది.
EC On Freebies : ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాల విషయంలో కొన్ని మార్గదర్శకాలు పెట్టాలనే ఆలోచనను భారత ఎన్నికల సంఘం చేస్తోంది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపే ఆలోచన చేస్తోంది. ఉచిత పథకాలు ప్రజలను మోసం చేసేవిలా కాకుండా బాధ్యతాయుతంగా ఉండాలి.. వారు ఇస్తున్న హామీలకు నిధులు ఎక్కడ్నుంచి సేకరిస్తారన్న విషయాన్ని కూడా తెలియచెప్పేలా ఉండాలని ఈసీ భావిస్తోంది. ప్రజలకు వీటిపైన ఓ అవగాహన వస్తే .. ఉచిత పథకాల విషయంలో ప్రజల ఆలోచనలు కూడా మారే అవకాశం ఉంటుందని ఈసీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఉచిత పథకాలపై ఇటీవలి కాలంలో దేశవ్యాప్త చర్చ
ఇటీవల దేశవ్యాప్తంగా ఉచిత పథకాలపై చర్చ జరుగుతోంది. శ్రీలంకలో పరిస్థితులు చూసిన తర్వాత చాలా మంది ఆర్థిక నిపుణులు కూడా దేశంలో పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్రాల అప్పులను ఉచిత పథకాలను కంట్రోల్ చేయకపోతే పరిస్థితి గాడి తప్పుతుందని హెచ్చరించారు. సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖల్యాయి. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏది ఉచితమో... ఏది సంక్షేమమో చెప్పడం కష్టమని చెబుతూ.. ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఆ పిటిషన్‌పై విచారణ సమయంలో ఈసీ కూడా తన వాదనను సుప్రీంకోర్టుకు వివరించారు.
ప్రస్తుతం ఉన్న అధికారాలతో ఉచిత హామీలకు చెక్ పెట్టలేమన్న ఈసీ
ప్రస్తుతం ఈసీకి ఉన్న అధికారాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు ప్రకటించే ఉచిత పథకాల్ని అడ్డుకోలేమని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది . చట్టంలో సరైన మార్పులు చేయకుండా, పార్టీలు, ప్రభుత్వాలపై చర్యలు తీసుకోలేమని చెప్పింది ఈసీ. ‘‘పార్టీలు ఎన్నికలకు ముందు.. లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చే ఉచిత పథకాల్ని నియంత్రించడం సాధ్యంకాదు. ఆ పథకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపినాసరే వాటిని అడ్డుకోలేం. ఉచిత పథకాల విషయంలో అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ఓటర్లే. చట్టంలో మార్పులు చేయకుండా, ఈ విషయంలో పార్టీలను నియంత్రించాలనుకుంటే అది ఎలక్షన్ కమిషన్ అధికారాల్ని పరిధిదాటి ఉపయోగించినట్లే అవుతుంది’’ అని ఈసీ సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఉచిత హామీలకు నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పేలా నిబంధన పెట్టే అవకాశం
అయితే ఈ విషయంలో చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరుతూ కేంద్రానికి కొన్ని సూచనలు చేశామని ఈసీ చెప్పింది. 2016లో దాదాపు 47 ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించింది. అయితే అలా అని పూర్తిగా ఊరుకోకుండా ఈసీ తన వంతు ప్రయత్నాలు చేయాలనుకుంటోంది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చేసే సిఫార్సులు ఏవైనా... అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి... రాజకీయ పార్టీలు ఉచిత పథకాల ప్రకటన విషయంలో కొన్ని మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి ఈసీ త్వరలోనే కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.