Economic Survey 2023-24: లోక్‌సభలో ఎకనామిక్ సర్వే, జీడీపీ అంచనాలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
Economic Survey 2023-24: 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఎకనామిక్ సర్వేని నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని తేల్చి చెప్పారు.
Economic Survey 2023-24: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఎకనామిక్ సర్వేని సభలో ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్‌ని ప్రవేశపెట్టే ముందు రోజు ఈ ఎకనామిక్ సర్వే వివరాలను వెల్లడించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఆమె పలు కీలక విషయాలు వెల్లడించారు. ముందుగా GDP అంచనాల గురించి మాట్లాడారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.5% నుంచి 7%కి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు స్పష్టం చేశారు. IMF అంచనాలకు అనుగుణంగా జీడీపీ నమోదవుతుందని వెల్లడించారు. ఎన్ని సమస్యలొచ్చినా బ్యాలెన్స్ చేస్తూ ఆశాజనకంగా ముందుకు సాగిపోతామని వివరించారు. 2024 ఆర్థిక సంవత్సరానికి 8.2% మేర వృద్ధి రేటుని అంచనా వేసినట్టు చెప్పిన నిర్మలా సీతారామన్, 2025 ఆర్థిక సంవత్సరంలో 7% వరకూ వృద్ధి ఉండొచ్చని అంచనా వేశారు. ద్రవ్యోల్బణంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరానికి 4.5% మేర ద్రవ్యోల్బణం నమోదవచ్చని అంచనా వేసింది. అయితే..ప్రస్తుతానికి ఇది అదుపులోనే ఉందని నిర్మలా స్పష్టం చేశారు. అయితే...ఆహార పదార్థాల ధరలు పెరిగిన విషయాన్ని అంగీకరించారు.
"ఎన్ని సవాళ్లు వచ్చినా సరే భారత దేశ ఆర్థిక వ్యవస్థ చాలా గట్టిగా నిలబడింది. కొవిడ్ నుంచి కోలుకున్నాక చాలా వరకూ సమస్యలు తీరిపోయాయి. ఆర్థిక స్థిరత్వం వచ్చింది. అందరి అంచనాలకు అనుగుణంగా ఇంకెన్నో చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 6.5-7% వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నాం"
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
Economic Survey 2023-24 conservatively projects a real GDP growth of 6.5–7 per cent in FY25, with risks evenly balanced, cognizant of the fact that the market expectations are on the higher side. pic.twitter.com/Kvdn4jBdDP
— ANI (@ANI) July 22, 2024
అంతర్జాతీయంగా సప్లై చైన్‌లో అవాంతరాలు వచ్చాయని సర్వే వెల్లడించింది. భారీ వర్షాలు, వరదలు వచ్చినా వాటి ప్రభావం పడకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసినట్టు వివరించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.7% ఉండగా ఇది 2024 ఆర్థిక సంవత్సరం నాటికి 5.4%కి తగ్గిపోయిందని స్పష్టం చేసింది.