Dussehra 2022 Celebrations: కేజ్రీవాల్‌తో కలిసి రావణ సంహారం చేయనున్న 'ఆదిపురుష్'!
Dussehra 2022 Celebrations: దిల్లీ ఎర్రకోటలో నిర్వహించబోయే దసరా వేడుకలకు ప్రత్యేక అతిథిగా హీరో ప్రభాస్ హాజరుకానున్నారు.
Dussehra 2022 Celebrations: దిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించే దసరా వేడుకలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథులుగా రానున్నారు. దిల్లీలో అత్యంత పురాతనమైన లవ్ కుష్ రాంలీలా కమిటీ అక్టోబర్ 5న ఈ వేడుకలు నిర్వహించనుంది.
రావణ సంహారం
రావణుడి దిష్టిబొమ్మను కేజ్రీవాల్, ప్రభాస్ కలిసి.. విల్లు, బాణాలను ఉపయోగించి దహనం చేయనున్నారు. ఈ మేరకు లవ్ కుష్ రాంలీలా కమిటీ అధ్యక్షుడు అర్జున్ కుమార్ తెలిపారు.
భారీ సంఖ్యలో
కరోనా కారణంగా గత రెండేళ్లు దసరా వేడుకలపై ఆంక్షలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం రాంలీలాకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. 1924లో ప్రారంభమైన రాంలీలా 100 ఏళ్ల వేడుకలను కూడా కమిటీలు జరుపుకుంటున్నాయి.
ఎర్రకోటలోని శ్రీ ధార్మిక రాంలీలా కమిటీ వైస్ ప్రెసిడెంట్ వినయ్ శర్మ మాట్లాడుతూ భజనలు, కవి సమ్మేళనాలు వంటి స్టేజ్ షోలను కూడా ఏర్పాటు చేశామన్నారు.
ఎర్రకోట గ్రౌండ్‌లో రామలీలాలు సెప్టెంబర్ 26న ప్రారంభమై దసరా అక్టోబర్ 5న ముగుస్తాయి. భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మైదానాన్ని 75 జాతీయ జెండాలతో అలంకరించారు.
ఆదిపురుష్‌గా
ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
అయోధ్యలో సరయు నదీ తీరంలో టీజర్‌ను రిలీజ్ చేశారు. 1:40 నిమిషాల నిడివి ఉంది టీజర్. శ్రీరామునిగా ప్రభాస్ కనిపించారు. 'భూమి క్రుంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది.
సంక్రాంతి కానుకగా... వచ్చే ఏడాది జనవరి 12న (Adipurush Release Date) ప్రపంచవ్యాప్తంగా త్రీడీలో 'ఆదిపురుష్' విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
హాలీవుడ్ లో 'ఆదిపురుష్'
ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా కాకుండా.. పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్మాతలు వెల్లడించారు. దీనికోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నారట. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా 'ఆదిపురుష్' రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Also Read: Uttarkashi Avalanche: ఉత్తరాఖండ్‌లో మంచు తుపాను- చిక్కుకుపోయిన 21 మంది!