Rahul Gandhi: లీగల్ ఫైట్‌కు సిద్ధమైన రాహుల్,కోర్టు తీర్పుని సవాలు చేస్తూ త్వరలోనే పిటిషన్!
Rahul Gandhi: సూరత్ కోర్టు తీర్పుని సవాలు చేస్తూ రాహుల్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
Rahul Gandhi Disqualification:
పిటిషన్ రెడీ..!
రాహుల్ గాంధీపై అనర్హతా వేటు పడినప్పటి నుంచి ఆయన లీగల్‌గా ఎలా ప్రొసీడ్ అవుతారు అన్న ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ మధ్యే ఎన్‌సీపీకి చెందిన ఎంపీ...తనపై పడిన అనర్హతా వేటు నుంచి తప్పించుకున్నారు. మళ్లీ ఎంపీ పదవిని సంపాదించుకున్నారు. అప్పటి నుంచి రాహుల్ పై అందరి దృష్టి పడింది. ఈ క్రమంలోనే రాహుల్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ అదే కోర్టులో ఆయన పిటిషన్ వేయనున్నారు. ఇప్పటికే ఈ పిటిషన్ రెడీ అయిపోయిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ ఈ లీగల్ ప్రొసీడింగ్స్‌ను దగ్గరుండి చూసుకుంటున్నట్టు సమాచారం. సూరత్‌లోని సెషన్స్ కోర్టులో రాహుల్ పిటిషన్ వేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే రాహుల్‌పై ఆరు పరువు నష్టం దావా కేసులు నమోదయ్యాయి. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పాట్నాలోనూ ఈ కేసు నమోదైంది. పాట్నా కోర్టు రాహుల్‌కు సమన్లు జారీ చేసింది కూడా. ఏప్రిల్ 12వ తేదీలోగా విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. సూరత్ సెషన్స్ కోర్టులో వేసే పిటిషన్‌నే పాట్నా, రాంచీ కోర్టుల్లోనే సబ్మిట్ చేయాలని చూస్తోంది కాంగ్రెస్. అందుకే...అందులో ఈ విషయంలో చాలా జాగ్రత్త పడుతోంది. సీనియర్ న్యాయవాదుల సలహాలు తీసుకుంటోంది. నిజానికి రాహుల్‌కు పైకోర్టుల్లో అప్పీల్ చేసుకోడానికి ఇంకా సమయం ఉంది. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అధిష్ఠానం భావిస్తోంది. పిటిషన్‌లో స్పష్టంగా చెప్పాల్సిన పాయింట్లన్నీ కవర్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎక్కడా ఏ తప్పు దొర్లకూడదని న్యాయవాదులకు తేల్చి చెబుతోంది అధిష్ఠానం.
దారి దొరికింది..
రాహుల్ గాంధీపై అనర్హతా వేటు పడిన నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. రాహుల్ లాగానే...తన ఎంపీ పదవిని కోల్పోయిన లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ మళ్లీ ఆ పదవిని సంపాదించుకున్నారు. న్యాయ పోరాటం చేసి అనర్హతా వేటు నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ లీగల్ టీమ్...ఇదే కేసుని ఉదాహరణగా తీసుకుని ముందుకెళ్లే అవకాశాలున్నాయి. వీలైనంత త్వరగా లోక్‌సభ సభ్యత్వాన్ని రీస్టోర్ చేసేందుకు ప్రయత్నాలు మొదలవుతున్నాయి. రాహుల్ న్యాయ పోరాటం చేసేందుకు 30 రోజుల గడువునిచ్చింది సూరత్ కోర్టు. ఈ లోగా ఏదోటి తేల్చుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇంత కీలక సమయంలో ఫైజల్ సభ్యత్వం రీస్టోర్ అవడం ఆసక్తికరంగా మారింది.
అనురాగ్ ఫైర్..
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేస్తే...ఆయన తరపున వాదించేందుకు ఆ పార్టీలోని ఏ ఒక్క న్యాయవాది కూడా ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. అంతే కాదు. రాహుల్‌పై సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. రాహుల్ ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడం కొత్తేమీ కాదని, ఆయనపై 7 పరువు నష్టం దావా కేసులున్నాయని అన్నారు.వాటిపై పలు కోర్టుల్లో విచారణ జరుగుతోందని వెల్లడించారు. పార్లమెంట్ నుంచి ఆయనను తప్పించడంలో కేంద్రానికి, లోక్‌సభ సెక్రటేరియట్‌కు కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రాతనిధ్య చట్ట ప్రకారమే ఆయనపై అనర్హతా వేటు వేశారని అన్నారు.