DGCA: మూత్ర విసర్జన ఘటనపై డీజీసీఏ సీరియస్ - ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా
DGCA: విమానంలో మూత్ర విసర్జన ఘటనపై ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించింది. పైలెట్ లైసెన్సును కూడా మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది.
DGCA: ఎయిర్ ఇండియా విమానంలో ఓ మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘనపై డీజీసీఏ చర్యలు తీసుకుంది. ఈ మధ్యే సంచలనం రేపిన ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం రోజు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియాకు 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆ ఘటన న్యూయార్క్ ఢిల్లీ విమానంలోని పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. తన విధులు నిర్వర్తించడంలో విఫలం అయినందుకు విమానాల్లో సేవలను పర్యవేక్షించే డైరెక్టర్ కు 3లక్షల రూపాయల ఫైన్ విధించింది.
2022వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన నిందితుడు శంకర్ మిశ్రా న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్ లో వస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఇతడు.. ఓ మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సదరు మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ నిందితుడిని తేలిగ్గా వదిలేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన టాటా సన్స్ కంపెనీ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అనంతరం ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు నిందితుడిని బెంగళూరు నుంచి అరెస్టు చేశారు.
విచారణ కమిటీ నిర్ణయంపై ప్రశ్న..
ఆరోపణలకు సంబంధించి ఎయిర్ ఇండియా.. ప్రత్యేకంగా విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నాలుగు నెలల పాటు శంకర్ మిశ్రా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఇదిలా ఉండగా.. జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడు శంకర్.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఇటీవల కోర్టులో తన వాదనను వినిపించాడు. ఈ కేసులో తాను నిందితుడిని కాదని.. ఆ మహిళే మూత్ర విసర్జన చేసుకుని ఉంటుందని చెప్పాడు. ఆమె ప్రొస్టేట్ కు సంబంధించిన సమస్యలతో బాధపడుతోందని... అలాంటి వారు ఇలా చేసుకోవడం సహజమేనని చెప్పారు. కానీ తాను మాత్రం ఆమెపై మూత్ర విసర్జన చేయలేదని అతడు కోర్టుకు సమర్పించిన సమాధానంలో పేర్కొన్నాడు.
అలాగే శంకర్ తరఫున వాదిస్తున్న అడ్వకేట్ అక్షత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. బిజినెస్ క్లాస్‌లో సీటు 9బీ ఉందని, క్రాఫ్ట్‌లోని బిజినెస్ క్లాస్‌లో 9బి సీటు లేదని ప్రోబ్ కమిటీ తప్పుగా భావించిందని అన్నారు. 9ఏ, 9సీ సీట్లు మాత్రమే ఉన్నాయని వివరించారు. కావాలనే తన క్లయింట్ పై మూత్ర విసర్జన ఆరోపణలు చేశారన్నారు. శంకర్ తో పాటు ఆయన న్యాయవాది చేసిన వ్యాఖ్యలను బాధిత మహిళ తీవ్రంగా ఖండించారు.
పోలీసులు ఏం చెప్పారంటే..?
డిసెంబర్ 28న ఎయిర్ ఇండియా సంస్థ తమకు ఈ విషయం చెప్పిందని, ఆ తరవాత బాధితురాలని సంప్రదించి మరిన్ని వివరాలు సేకరించామని పోలీసులు తెలిపారు. "బాధితురాలి ఫిర్యాదు మేరకు పబ్లిక్ ప్లేస్‌లో అనుచితంగా ప్రవర్తించి నందుకు ఐపీసీ సెక్షన్ 510, మహిళా గౌరవాన్ని భంగ పరిచినందుకు సెక్షన్ 509, అవమాన పరిచినందుకు సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. అయితే...ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఉన్న సిబ్బందినీ విచారించారు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం 50 ఏళ్ల శేఖర్ మిశ్రా...బిజినెస్‌క్లాస్‌లో ప్రయాణించాడు. మద్యం మత్తులో ఉన్నాడు. టాయ్‌లెట్ కోసం అని లేచి ముందుకు వెళ్లాడు. అయితే... వాష్‌రూమ్ వరకూ వెళ్లాననుకుని ఆ మత్తులోనే ఓ మహిళపై యూరినేట్ చేశాడు. ఇది జరిగిన వెంటనే సిబ్బందికి ఫిర్యాదు చేశానని, కానీ వాళ్లు స్పందించలేదని ఆరోపిస్తున్నారు బాధితురాలు. "లంచ్ టైమ్ తరవాత ఫ్లైట్‌లో లైట్స్ ఆఫ్ చేశారు. అప్పుడే ఓ ప్యాసింజర్ నా సీట్ దగ్గరకు వచ్చాడు. నాపై యూరినేట్ చేయడం మొదలు పెట్టాడు" అని టాటా గ్రూప్ ఛైర్మన్‌కు రాసిన లేఖలో తెలిపారు బాధితురాలు.