Afghanistan Crisis Update: అయ్యో పాపం.. పసిపిల్లలను కంచెపై నుంచి విసిరేస్తున్న తల్లులు!
అఫ్గాన్ లో హృదయ విదారక ఘటనలు చూస్తుంటే ప్రపంచమే కన్నీరు పెడుతోంది. కొందరు మహిళలు ఎయిర్ పోర్టులో ఇనుప కంచెల పైనుంచే పిల్లలను విసిరేసి విదేశీ దళాలను పట్టుకోమని అడుగుతున్నారు.
![Afghanistan Crisis Update: అయ్యో పాపం.. పసిపిల్లలను కంచెపై నుంచి విసిరేస్తున్న తల్లులు! Desperate Afghan moms throw babies over barbed wire to UK troops at airport Afghanistan Crisis Update: అయ్యో పాపం.. పసిపిల్లలను కంచెపై నుంచి విసిరేస్తున్న తల్లులు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/19/be93f13ec2edf537a5ea4b091ca9517d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇదొక దయనీయ ఘటన.. తమ పిల్లలను విడిచి నిమిషం కూడా ఉండలేని తల్లులు.. తమ పసిపిల్లల భవిష్యత్తు కోసం వారినే దూరం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఓ వైపు తుపాకీ తూటాలు, మరోవైపు కాల్పుల మోతలు వినిపిస్తున్నప్పటికీ వాళ్లు బెదరలేదు. కానీ తాలిబన్ల రాజ్యానికి మాత్రం భయపడుతున్నారు. ముష్కరుల అరాచక పాలన నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి వెళ్లాలని ప్రయత్నిస్తోన్న అఫ్గాన్ పౌరులపై తాలిబన్లు దాడులు చేస్తున్నారు. విమానాశ్రయం లోపలికి వెళ్లకుండా ఇనుపకంచెలు అడ్డుపెట్టారు. దీంతో నిస్సహాయస్థితిలో ఉన్న ప్రజలు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు.
తమను కాపాడమంటూ ఎయిర్‌పోర్టులో ఉన్న యూఎస్, యూకే దళాలను వేడుకుంటున్నారు. కనీసం తమ తర్వాతి తరం వారినైనా రక్షించుకోవాలనే ఆరాటంతో ఇనుప కంచెలపై నుంచి పిల్లలను లోపలికి విసిరేస్తున్నారు ఆ తల్లులు. ఆ హృదయ విదారక ఘటనలు చూస్తుంటే దుఖం పొంగుకొస్తోందని బ్రిటీష్ ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
మా పిల్లలనైనా..
అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికా, యూకే ప్రత్యేక బలగాలను పంపాయి. కాబూల్ విమానాశ్రయాన్ని అధీనంలోకి తీసుకొని వీరంతా పహారా కాస్తున్నారు. అయితే, తాలిబన్ల పాలనతో భయాందోళనకు గురైన అఫ్గాన్ వాసులు కూడా దేశం విడిచి పారిపోయేందుకు గత సోమవారం ఎయిర్‌పోర్టుకు పోటెత్తారు. ఈ క్రమంలో విమానాశ్రయం వద్దకు తాలిబన్లు చేరుకుని అఫ్గాన్ వాసులను అడ్డుకున్నారు. గేట్లు మూసేసి ఇనుప కంచెలు అడ్డుపెట్టారు.
అయినప్పటికీ అక్కడకు చేరుకున్న వేలాది మంది అఫ్గానీయులు తమను కాపాడాలంటూ యూకే, యూఎస్ బలగాలను కోరుతున్నారు. కనీసం తమ పిల్లలనైనా తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు. కొందరు మహిళలు ఇనుప కంచెల పైనుంచే పిల్లలను విసిరేసి విదేశీ దళాలను పట్టుకోమని అడుగుతున్నారు. ఈ క్రమంలో కొందరు చిన్నారులు కంచెలో చిక్కుకుంటున్నారు అంటూ ఓ బ్రిటిష్ అధికారి మీడియాకు చెప్పారు. ఆ దృశ్యాలు తమను ఎంతగానో కలచివేస్తున్నాయని, వాటిని తలుచుకుని రాత్రిళ్లు తాము కన్నీరు పెట్టుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పేరుకే శాంతిమంత్రం..
మరోవైపు రెండు రోజుల క్రితం వరకు శాంతిమంత్రం జపించిన తాలిబన్లు మళ్లీ తమ సహజ స్వభావాన్ని బయటపెడుతున్నారు. వారికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన వారిపై కాల్పులు జరిపారు. దేశం విడిచి వెళ్లిపోవాలని ప్రయత్నించిన వారిని చితకబాదారు. దీంతో అఫ్గాన్ వాసులు భయాందోళనలో కూరుకుపోయారు.
Taliban Crisis: తాలిబన్లు.. ఎంత పనిచేశారయా? భారత్ లో రేట్లు ఆకాశానికే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)