Covid Cases in India: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు - రాష్ట్రాలతో కేంద్రం ఎమర్జెన్సీ మీటింగ్!
Covid Cases in India: కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 24 గంటల్లోనే 18 వందల కేసులు నమోదు అవగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమీక్షా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది.
![Covid Cases in India: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు - రాష్ట్రాలతో కేంద్రం ఎమర్జెన్సీ మీటింగ్! Covid Cases in India Corona Updates Centre Hold Covid 19 Review Meeting All States Covid Cases in India: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు - రాష్ట్రాలతో కేంద్రం ఎమర్జెన్సీ మీటింగ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/27/db4d5dd2027a8e7cae64797d48e2cc3f1679897698733519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Covid Cases in India: దేశంలో కరోనా కేసులు చాపకింద నీరులా ప్రవహిస్తున్నాయి. ఒక్కసారిగా ఊపందుకొని కోరలు చాస్తూ పరిగెడుతోంది. గతకొంత కాలంగా రెండు వేలకు చేరువలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనా కేసుల గురించి పూర్తి సమాచారాన్ని వెల్లడించింది. వరుసగా రెండో రోజు 1800లకుపైగా కొత్త కేసులు నమోదు అయినట్లు తెలిపింది. నిన్న ఒక్కరోజే 1890 కేసులు నమోదు కాగా.. నేడు స్వల్ప తగ్గుదల కనిపించింది. గత 24 గంటల్లో 56 వేల 551 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా... 1805 కేసులు బయట పడ్డాయి. దీంతో దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,05,952కు చేరుకుంది. అలాగే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేల 300కు చేరింది.
పదివేల మార్కును దాటడం ఇదే ప్రథమం..
దేశంలో 2020 ఏప్రిల్ తర్వాత 2022 నవంబర్ లో యాక్టివ్ కేసుల సంక్య పదివేల దిగువకు పడిపోయింది. అప్పటి నుంచి పదివేల మార్కును దాటడం ఇదే మొదటిసారి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 932 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,41,64,815కి చేరుకుంది. మహమ్మారి కారణంగా ఆరుగురు మృతి చెందారు. అందులో ఛత్తీస్ గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ‌్‌లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందగా.. కేరళలో ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5 లక్షల 30 వేల 837గా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని తెలిపారు. రికవరీ రేటు 98.79 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైదారోగ్య శాఖ తెలిపింది.
నేడు రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు కరోనా విజృంభణ చాలా తక్కువగానే ఉన్నప్పటికీ... రాబోయే రోజుల్లో వైరస్ ను నిలువరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే నేడు రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది. అలాగే ఏప్రిల్ 10, 11వ తేదీల్లో కరోనాపై నిర్వహించాల్సిన మాక్ డ్రిల్ గురించి రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచాలని, కరోనా హాట్ స్పాట్ లను గుర్తించి, వైరస్ కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇది వరకే రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా, ఇన్ ఫ్లూయెంజా కేసులు పెరగడం కూడా ప్రజల్లో గందరగోళానికి దారి తీస్తోంది. అలాగే ఈ రెండు వ్యాధుల లక్షణాలు కూడా ఒకేలా ఉండడంతో మరింత భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ ను ఎదుర్కునేందుకు రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండడంతో పాటు మాస్కులు, సానిటైజర్లు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)