COVID-19 Update: బూస్టర్ డోసుపై ఏ నిర్ణయం తీసుకోలేదు.. యువతకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యం... స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
దేశంలోని యువతకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించామని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. బూస్టర్ డోసుపై ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు.
దేశంలో వయోజన జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించామని ఐసీఎంఆర్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ అన్నారు. బూస్టర్ డోసుపై తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై మాట్లాడిన ఆయన యువతకు రెండు డోసుల టీకా లేదా పూర్తి వ్యాక్సినేషన్ అందించడమే ప్రాథమిక లక్ష్యమని తెలిపారు.
దేశంలో 89 కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ
కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 69 శాతం మంది జనాభాకు కనీసం ఒక డోసు టీకా అందించినట్టు ప్రకటించారు. 25శాతం మందికి రెండు డోసులూ పూర్తిచేసినట్టు తెలిపారు. గత వారంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 59.66 శాతం కేసులు ఒక్క కేరళలోనే నమోదైనట్టు అధికారులు చెప్పారు. కేరళలో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో కరోనా పరిస్థితులను కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గురువారం వివరించారు. దేశంలో ఇప్పటి వరకూ 89 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామన్నారు.
Also Read: ఏపీలో తొలి ఫ్యాబ్రికేటెడ్ హాస్పిటల్.. కేవలం 28 రోజుల్లో నిర్మాణం పూర్తి.. ప్రత్యేకంగా వారి కోసమే
గ్రామాల్లో వ్యాక్సినేషన్ స్పీడ్
పట్టణ ప్రాంతాల్లోని కోవిడ్ -19 టీకా కేంద్రాల్లో 35 శాతం టీకాలు వేయగా, గ్రామీణ ప్రాంతాల్లోని 64 శాతం టీకాలు వేశారని కేంద్రం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పట్టణాల కన్నా గంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. చండీగఢ్, లక్షద్వీప్, గోవా, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, సిక్కింలో 100 శాతం జనాభాకు కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి డోస్ వేశారని పేర్కొ్న్నారు.
Also Read: ఏపీలో కొత్తగా 1,010 కరోనా కేసులు, 13 మరణాలు
30 జిల్లాల్లో 10 శాతం కన్నా అధికం
దేశంలో ప్రతి రోజూ 15 లక్షల నుంచి 16 లక్షల మేర కోవిడ్ నమూనాలు పరీక్ష చేస్తున్నామని అధికారులు తెలిపారు. 30 జిల్లాల్లో కోవిడ్ వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా ఉందన్నారు. మరో 18 జిల్లాల్లో ఇది 5 నుంచి 10శాతంగా ఉందన్నారు. జనసాంద్రత పెరిగే ప్రాంతాల్లో కోవిడ్ వ్యాప్తి పెరిగే అవకాశాలున్నాయన్నారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని తెలిపారు. తక్కువ సంఖ్యలో పాల్గొనే పండుగలు జరుపుకోవాలని సూచించారు.
Also Read: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 311 మంది వైరస్ కారణంగా మృతి