(Source: ECI/ABP News/ABP Majha)
COVID-19 Cases: భారత్‌లోనూ పెరుగుతున్న కరోనా కేసులు, ఆ 5 రాష్ట్రాలు అలెర్ట్
COVID-19 Cases: భారత్‌లోనూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
COVID-19 Cases in India:
యాక్టివ్ కేసుల పెరుగుదల
భారత్‌లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 2,670 యాక్టివ్ కేసులున్నాయి. ఈ ఉదయం నాటికి కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కొవిడ్ బాధితుల సంఖ్య 4 కోట్లు దాటింది. ఇక యాక్టివ్ కేసుల విషయానికొస్తే...ఎక్కువగా కేరళ, కర్ణాటకలోనే నమోదవుతున్నాయి. సగానికి పైగా కరోనా కేసులు నమోదైంది కేరళలోనే. ఆ తరవాత కర్ణాటక, మహారాష్ట్రలోనూ వ్యాప్తి పెరుగుతోంది. ప్రస్తుతానికి కేరళలో 1,444 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 326 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో 161,
ఒడిశాలో 88, తమిళనాడులో 86 యాక్టివ్ కేసులున్నాయి. గతంతో పోల్చి చూస్తే...సంఖ్యా పరంగా కేసులు తక్కువగానే కనిపిస్తున్నప్పటికీ ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని కేంద్రం అప్రమత్తమైంది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలెర్ట్ అయ్యాయి. కొవిడ్ టెస్టుల సంఖ్యను పెంచుతున్నాయి. విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులకు కొవిడ్ టెస్ట్‌లు చేస్తున్నారు. వీలైనంత ఎక్కువగా జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే...ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న BF.7 వేరియంట్‌తో పెద్దగా ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలో కొత్త వేరియంట్..!
చైనాలో BF.7 వేరియంట్‌తో ఇప్పటికే చైనా అల్లాడుతోంది. మృతుల సంఖ్యను ఆ దేశం దాచి పెడుతున్నప్పటికీ...అక్కడి విజువల్స్ మాత్రం అందరినీ కలవర పెడుతున్నాయి. ఒమిక్రాన్‌కు సబ్ వేరియంట్‌లు ఇలా దాడి చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ వైరాలజిస్ట్ ఎరిక్..ఈ విషయం వెల్లడించారు. కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందని ట్విటర్ వేదికగా చెప్పారు. "కరోనా కొత్త వేరియంట్ XBB15 అమెరికాలో వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్‌తో అగ్రరాజ్యంలో మళ్లీ విధ్వంసం చూస్తాం" అని హెచ్చరించారు. గత వేరియంట్‌లతో పోల్చి చూస్తే 120% అధిక వేగంతో ఇది వ్యాప్తి చెందుతుందని అంచనా వేశారు. యూకేలో XBB15 వేరియంట్ వ్యాప్తి వారం రోజుల్లోనే 0-4.3%కి పెరిగిందని ఎరిక్ వెల్లడించారు. మరో వారం రోజుల్లో 10% కి అధికమవుతుందని అన్నారు. ఇదే తరహాలో... అమెరికాలోనూ తీవ్రంగా వ్యాప్తి చెందే ప్రమాదముందని చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీతో ఎన్నో సంవత్సరాల పాటు పని చేసిన ఎరిక్ ఈ హెచ్చరికలు చేయడం సంచలనమవుతోంది. పలువురు నిపుణులు కూడా ఎరిక్ ట్వీట్ చేసిన పోస్ట్‌లను రీట్వీట్ చేస్తూ హెచ్చరిస్తున్నారు.
విదేశీ ప్రయాణికులకు సూచనలు..
చైనా, హాంగ్‌కాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా RT PCR టెస్ట్‌లు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా దేశాల్లో ఫ్లైట్ ఎక్కే ముందే ఈ టెస్ట్ చేయించుకుని ఆ రిపోర్ట్‌ని Air Suvidha పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయా ట్విటర్ వేదికగా ప్రకటించారు. "చైనా, హాంగ్‌కాంగ్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే వాళ్లు RT PCR టెస్ట్‌లు కచ్చితంగా చేయించుకోవాలి. 2023 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది" అని ట్వీట్ చేశారు. ఇప్పటి వరకూ ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇండియాకు వచ్చాక ఎయిర్‌పోర్ట్ వద్ద కొవిడ్ నెగటివ్ రిపోర్ట్ చూపించాలన్న రూల్ ఫాలో అవుతున్నారు. ఒకవేళ ఇక్కడ టెస్ట్ చేశాక పాజిటివ్ వస్తే నేరుగా క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.
Also Read: Delhi Girl Dragged Case: ప్రమాదం జరిగిందా, హత్య చేశారా - కంజావాలా ఘటనపై ఎన్నో అనుమానాలు