Covid 19 Update India: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 36,401 కేసులు, 530 మరణాలు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా కరోనా కేసులు, మరణాలు పెరిగాయి. అలాగే మరో రెండు నెలల్లో కొవాగ్జిన్ చిన్న పిల్లల టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.
దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజాగా గణాంకాలను కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసింది. కొత్తగా కేసులు, మరణాలు పెరిగినట్లు వెల్లడించింది. తాజాగా 18,73,757 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 36,401 మందికి కోవిడ్ సోకినట్లు తెలిపింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 3.4 శాతం పెరిగినట్లు పేర్కొంది. 24 గంటల వ్యవధిలో 530 మంది కోవిడ్ కారణంగా మరణించారు. దేశంలో ఇప్పటి వరకూ మొత్తం కేసులు 3.23 కోట్లకు చేరగా, 4,33,039 మంది మరణించారు.
Also Read: Hyderabad Theft: అమ్మమ్మతో కలిసి యువకుడు దొంగతనాలు.. వీళ్లు ఆడే నాటకాలకి షాక్‌లో బాధితులు
56 కోట్ల టీకా డోసులు
బుధవారం 39 వేల మంది కొవిడ్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 3.15 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇది 97.53 శాతం ఉంది. క్రియాశీల కేసులు 3.6 లక్షలకు తగ్గాయి. ఆ రేటు 1.13 శాతంగా ఉంది. మరోపక్క నిన్న 56,36,336 మందికి కోవిడ్ టీకా వేశారు. ఇప్పటి వరకు మొత్తం 56.64 కోట్ల డోసులు పంపిణీ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా....
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 6,94,807 మందికి కరోనా సోకినట్లు గణాంకాలు ద్వారా తెలుస్తోంది. వైరస్ ధాటికి మరో 10,555 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 21,01,08,057 కు చేరింది. మరణాల సంఖ్య 44,05,573కు పెరిగింది.
మరో రెండు నెలల్లో అందుబాటులోకి పిల్లల టీకా
కొవిడ్-19 వ్యాధి నుంచి రక్షణ కోసం చిన్న పిల్లలకు ఇచ్చే ‘కొవాగ్జిన్’ టీకా మరో రెండు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల ఓ ప్రకటనలో తెలిపారు. ఈ టీకాను 2 నుంచి 18 ఏళ్ల వయసు వారిలో పరీక్షించామని ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన తెలిపారు. రోగ నిరోధకశక్తి ఎలా ఉందనే అంశాన్ని పరిశీలించి, నెల రోజుల్లో పూర్తి వివరాలు తెలుపుతామన్నారు. దీనికి సంబంధించిన క్లినికల్ ట్రైల్స్ పై భారత ఔషధ నియంత్రణ మండలికి చెందిన కమిటీ సంతృప్తి చెందితే చిన్న పిల్లల కోసం రూపొందిస్తున్న కొవాగ్జిన్ టీకాకు అనుమతి వస్తుందని తెలిపారు.
Also Read: Vijayashanthi: ఒవైసీ గారూ.. వెళ్లి తాలిబన్లతో చర్చలు జరిపి రండి.. విజయశాంతి స్ట్రాంగ్ కౌంటర్