Hyderabad Theft: అమ్మమ్మతో కలిసి యువకుడు దొంగతనాలు.. వీళ్లు ఆడే నాటకాలకి షాక్‌లో బాధితులు
దుకాణదారుల దృష్టి మళ్లిస్తూ దొంగతనాలకు పాల్పడుతుండడం ఈ అమ్మమ్మ, మనవడి ప్రత్యేకత. చోరీలకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ అమ్మమ్మ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
అమ్మమ్మతో కలిసి దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్న యువకుడు అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. సాధారణంగా ఎవరైనా కొందరు ముఠాలుగా ఏర్పడి చోరీలకు పాల్పడుతుంటారు. కానీ, తాజా కేసులో మాత్రం ఓ యువకుడు ఏకంగా తనకు వరుసకు అమ్మమ్మ అయ్యే మహిళను దొంగతనాలకు తీసుకెళ్తున్నాడు. గతంలో పలుసార్లు పట్టుబడ్డా సరే.. పట్టించుకోకుండా అవే తరహా నేరాలను మళ్లీ కొనసాగించాడు. చివరికి బాధితుల ఫిర్యాదుతో ఈ విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. చోరీలకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ అమ్మమ్మ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
దుకాణదారుల దృష్టి మళ్లిస్తూ దొంగతనాలకు పాల్పడుతుండడం ఈ అమ్మమ్మ, మనవడి ప్రత్యేకతగా పోలీసులు చెబుతున్నారు. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా చీరాల మండలం, ఎదురుపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో స్థిరపడి ఈ చోరీలకు పాల్పడుతున్నాడు. ప్రకాశం జిల్లాకు చెందిన మేద సన్ని అలియాస్ సంతోష్ అనే 31ఏళ్ల వ్యక్తి మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ఉన్న సూర్యప్రభ అనే అపార్ట్‌మెంట్లో ఉంటున్నాడు. అక్కడే కారు డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అతనికి వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో మరింతగా డబ్బు సంపాదించాలనుకొని తప్పుడు దారులు తొక్కడం ప్రారంభించాడు.
త్వరగా, కష్టంలేకుండా సుఖంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో దొంగతనాలు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఇందుకోసం తనకు తోడుగా వరసకు తనకు అమ్మమ్మ వరసైన ఓ మహిళతో కలిసి పంజాగుట్ట, బంజారాహిల్స్, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నో దొంగతనాలకు పాల్పడ్డట్లుగా పోలీసులు వెల్లడించారు. కొన్ని కేసుల్లో గతంలో జైలుకు సైతం వెళ్లి వచ్చాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.
ఈ క్రమంలోనే తాజాగా మరో నేరానికి పాల్పడ్డాడు. బడంగ్‌పేట ప్రాంతంలోని స్థానిక వెంకటేశ్వర కాలనీలో బద్దం అరుణ అనే మహిళ చీరల షాపు నడుపుతోంది. ఈ నెల 8వ తేదీన ఆ దుకాణానికి సన్నీ, అతని అమ్మమ్మ చీరలు కొనే నెపంతో షాపులోనికి వెళ్లారు. చీరలు కావాలని అడిగారు. ఆమె చీరలు చూపిస్తున్నా.. మరిన్ని కావాలని, ఇంకొన్ని డిజైన్లు చూపించాలని కోరడంతో ఆమె చూపించారు. కొన్ని చీరలను ఎంపిక చేసినట్లు నటించి.. ఆ తర్వాత అసలు నాటకం ఆడారు. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకురమ్మని అతను తన అమ్మమ్మను బయటకు పంపించివేశాడు.
Also Read: Gold-Silver Price: బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి పసిడి, వెండి ధరలివే..
ఇంతలో అరుణ చీరల కోసం లోనికి వెళ్లేసరికి దాదాపు 10 చీరలు తీసుకుని సన్నీ పరారయ్యాడు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితురాలు అరుణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఉదయం అందిన సమాచారం మేరకు పోలీసుల బృందం బాలాపూర్ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సన్నీని అదుపులోకి తీసుకున్నారు. అతణ్ని విచారణ జరపగా చీరల చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. అతని నుంచి రూ.40 వేలు విలువ చేసే చీరలను స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. అయితే, నిందితుడి అమ్మమ్మ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు... చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు