Jubilee Hills By Election Results 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ఓటమికి 5 కారణాలు!
Jubilee Hills By Election Results 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం బీఆర్ఎస్‌కు మరో చేదు అనుభవాన్ని మిగిల్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండో ఉపఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది.

Jubilee Hills By Election Results 2025: తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే ఉపఎన్నికగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాన్ని అందరూ భావించారు. రెండేళ్ల కాంగ్రెస్ సర్కార్ పాలనపై ఓ పరీక్షగా ఈ ఉపఎన్నికను భావిస్తే, రాజకీయంగా కోల్పోయిన ప్రాభవాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్‌కు మంచి అవకాశంగా మరో పరీక్షగా విశ్లేషణలు జరిగాయి. కానీ, జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ఫలితం మాత్రం బీఆర్ఎస్‌కు మరో చేదు అనుభవాన్ని మిగిల్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన రెండో ఉపఎన్నికలో కూడా తన సిట్టింగ్ స్థానాన్ని గులాబీ పార్టీ కోల్పోయింది. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఐదు ప్రధాన కారణాలు ప్రముఖంగా చెప్పవచ్చు. ఈ కథనం పూర్తిగా చదివితే ఆ ఐదు కారణాలేంటో స్పష్టంగా అర్థమవుతాయి.
1. అధికార పార్టీ పాలనకు రెఫరెండం
ఈ ఉపఎన్నిక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన రెండో ఉపఎన్నిక. 2024 లో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికలో ఆమె సోదరి నివేదిత బరిలో నిలిచింది. అయితే అప్పటికే అధికారంలోకి వచ్చిన ఊపులో హస్తం పార్టీ కంటోన్మెంట్ స్థానాన్ని హస్తగతం చేసింది. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఆయన సతీమణి మాగంటి సునీత కారు పార్టీ అభ్యర్థిగా ఉపఎన్నికలో పోటీ చేసింది. అయితే రిజల్ట్ సేమ్. కంటోన్మెంట్ ఉపఎన్నిక ఫలితమే జూబ్లీ హిల్స్‌లో పునరావృతమైంది. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత వచ్చిన ఉపఎన్నిక ఇది. కాంగ్రెస్ పాలనకు ఇది ప్రజాతీర్పు లాంటిది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని, అది ఈ ఉపఎన్నిక ద్వారా బయటపడుతుందని బీఆర్ఎస్ నేతలు భావించారు. 'ఆరు గ్యారంటీలు' అమలు కావడం లేదని ఇది జూబ్లీహిల్స్ ఓటరు తీర్పు ద్వారా బహిర్గతం అవుతుందని భావించారు. కానీ, కాంగ్రెస్ పార్టీపై జూబ్లీ ఓటర్లు సానుకూలంగా ఉన్నట్లు ఈ ఫలితం తేల్చి చెప్పింది. అభివృద్ధి, సంక్షేమం, 'ఆరు గ్యారంటీలు' అమలు చేసే పాలన తీరుకు ఓటర్లు సానుకూలంగా తీర్పు ఇచ్చినట్లు అర్థమవుతోంది. తాము ఏం చేస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డితోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ క్యాడర్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలం అయ్యారు. దానికి నిదర్శనమే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. అయితే ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైంది.
2. AIMIM మద్దతుతో మైనారిటీ ఓట్ల ఏకీకరణ
జూబ్లీహిల్స్‌లో మైనారిటీ ఓటర్లు విజయాన్ని ప్రభావితం చేసే కీలక అంశం. ఈ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు సుమారు 1.4 లక్షలు ఉన్నాయి. అయితే ఈ ఓట్లను తమ వైపు తిప్పుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైంది. పాత మిత్రపక్షం అయిన ఎం.ఐ.ఎం. కాంగ్రెస్‌తో జట్టు కట్టడంతో బీఆర్ఎస్‌కు గతంలో పడిన మైనారిటీ ఓట్లకు గండిపడింది. ఎం.ఐ.ఎం. ఈ ఉపఎన్నికలో పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించింది. అదే రీతిలో మైనారిటీ ఓట్లను ఆకట్టుకునేందుకు మాజీ క్రికెటర్ అజారుద్ధీన్‌కు మంత్రి పదవిని హస్తం పార్టీ కట్టబెట్టింది. దీంతో మైనారిటీ ఓట్లను కాంగ్రెస్ దక్కించుకోవడంలో సక్సెస్ అయింది. దీంతో గులాబీ పార్టీకి మైనారిటీ వర్గం ఈ ఎన్నికలో మొండి చేయి చూపడంతో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడానికి ముఖ్య కారణంగా మారింది.
3. పనిచేయని మాగంటి 'సానుభూతి' అస్త్రం, కుటుంబ వివాదాలు
మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా నిలబెట్టింది. సానుభూతి ఓట్లు పడి సులభంగా గెలుస్తుందన్నది బీఆర్ఎస్ పార్టీ వ్యూహం. కానీ, ఇది బెడిసికొట్టింది. మాగంటి గోపీనాథ్ సేవలు, సునీతపై సానుభూతి అంశాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లు పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో పాటు ఎన్నికల సమయంలోనే మాగంటి సునీత కుటుంబ గొడవలు రచ్చకు దారి తీశాయి. మాగంటి గోపీనాథ్ మొదటి భార్య,, తల్లి జోక్యం చేసుకోవడం వల్ల అప్పటి వరకు ఎంతో కొంత ఉన్న సానుభూతి ఓటు కూడా చీలిపోయింది. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి 'ప్లాన్ బి' లేకుండా పోయింది. దీంతో అనుకున్న రీతిలో సానుభూతి ఓట్లను బీఆర్ఎస్ దక్కించుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
4. ప్రచారంలో కానరాని అగ్రనాయకత్వం
ఓ వైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కాలికి బలం కట్టుకొని ప్రచారం చేస్తుంటే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. అంతేకాకుండా, సీఎం హోదాలో ఇంతగా ప్రచారం చేయాలా అంటూ ఆ పార్టీ ముఖ్య నేతలు ఎద్దేవా చేశారు. తమ విజయం నల్లేరుపై నడకే అన్నట్లుగా BRS ముఖ్య నేతలు ఉదాసీనంగా వ్యవహరించారు. తన పాలనపై తానే స్వయంగా ప్రజలను ఒప్పించడానికి సీఎం రేవంత్ ప్రయత్నిస్తుంటే, దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నుంచి సరైన రీతిలో కౌంటర్ అటాక్ చేయడంలో విఫలమైంది. ఇక పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్ రావు కీలకమైన సమయంలో తండ్రి మరణంతో ప్రచారంలో పూర్తిగా నిమగ్నం కాలేకపోయారు. దీంతో కేటీఆర్ ఒక్కడిపైనే అధిక భారం పడింది. మరోవైపు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్య నేతలు డివిజన్ల వారీగా ప్రచారంలోనూ, కాంగ్రెస్ వ్యూహాల అమలులో కీలకంగా వ్యవహరిస్తే, అదే స్థాయిలో బీఆర్ఎస్ నేతల భాగస్వామ్యం కొరవడింది. ఈ అంశం కూడా బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణంగా మారింది.
5. బీఆర్ఎస్ సెటిలర్ ఓటర్లకు గండి కొట్టిన కాంగ్రెస్
జీహెచ్ఎంసీ పరిధిలో గులాబీ పార్టీ వికసించడానికి కీలకమైన 'సెటిలర్ల' ఓట్లను ఈ దఫా హస్తం పార్టీ హస్తగతం చేసుకుంది. నియోజకవర్గంలోని కమ్మ సామాజిక వర్గం ఓట్లు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన 'సెటిలర్ల' ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్‌కు పడకుండా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పోల్ మేనేజ్‌మెంట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆయా వర్గాల వారితో సమావేశాలు నిర్వహించడం వంటివి ఫలితానిచ్చాయి. మరోవైపు 'సెటిలర్లు' కూడా అధికారంలో ఉన్న పార్టీతోనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ధోరణి కూడా బీఆర్ఎస్ పార్టీకి చేటు చేసింది. ఈ అంశంపై బీఆర్ఎస్ కీలక నేతలు దృష్టి సారించకపోవడం కూడా ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా మారింది.
ఈ కారణాలన్నీ మిళితమై చివరకు సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోవడానికి దారి తీసింది. అయితే ఈ ఉపఎన్నిక ఫలితం తర్వాత 'కారు' జోరు పెంచడానికి పార్టీ అధినేత కేసీఆర్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.






















