(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ అలర్ట్ - మళ్లీ పెరుగుతున్న కేసులు, అధికార యంత్రాగం అప్రమత్తం
Covid in Telangana: తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటివరకూ 14 పాజిటివ్ కేసులు నమోదు కాగా, బుధవారం ఒక్కరోజే ఆరుగురికి వైరస్ సోకింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Covid Cases in Telangana: తెలంగాణలో (Telangana) కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. ఇప్పటివరకూ 14 పాజిటివ్ కేసులు (Corona Positive Cases) నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 6 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 (New Subvariant JN1) కేసులు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.
అధికారులతో మంత్రి సమీక్ష
తెలంగాణలో ప్రస్తుతం 14 మంది కొవిడ్ బారిన పడి ఐసోలేషన్ లో ఉన్నారు. కాగా, కొత్తగా నమోదైన కేసులన్న హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, సిబ్బందితో బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ చికిత్స పరికరాలు, ఔషధాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా కొరత ఉంటే టీఎస్ఎంఎస్ఐడీసీ నుంచి సమకూర్చుకోవాలని నిర్దేశించారు. మాక్ డ్రిల్ వెంటనే పూర్తి చేయాలని, దవాఖానల సన్నద్ధతకు సంబంధించిన వివరాలను కేంద్రానికి పంపాలని చెప్పారు. ఇన్ ప్లూయెంజా మాదిరిగా శ్వాసకోశ వ్యాధులతో బాధ పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దవాఖానలు, జిల్లా స్థాయిలో విభాగాధిపతులు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం విధిగా నమూనాలను ఉప్పల్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ఫ్రింట్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ కు పంపాలని వెల్లడించారు. బుధవారం 319 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ గా తేలిందన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై శనివారం ఆయన మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అంతకు ముందు ఆయన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
భాగ్యనగరంలో
రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండగా, ఈ నెల 14 నుంచి ఇప్పటివరకూ 14 కేసులు వెలుగుచూశాయి. ఒక్క హైదరాబాద్ లోనే 13 మంది, కరీంనగర్ లో ఒకరు కరోనా కొత్త వేరియంట్ బారిన పడ్డారు. మంగళవారం 4, బుధవారం 6 కేసులు వెలుగు చూశాయి. వారందరూ ఇళ్లల్లోనే చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ మరణాలు నమోదు కాలేదని, ఒకరు కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు.
దేశంలో ఇప్పటివరకూ
దేశంలోని కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 కేసులు ఇప్పటివరకూ 21 వెలుగు చూసినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు. ఒక్క గోవాలోనే 14 మంది దీని బారిన పడినట్లు చెప్పారు. మహారాష్ట్ర, కేరళలోనూ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కేసులు పెరుగుతుండడంపై కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ, రాష్ట్రాల మంత్రులు, అధికారులతో సమీక్షించారు. కరోనా వ్యాప్తి, దాని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వైరస్ నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం సజావుగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆస్పత్రుల్లో 3 నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు. కొవిడ్ పూర్తిగా ముగిసిపోలేదని, వైరస్ కట్టడికి కేంద్రం పూర్తిగా రాష్ట్రాలకు సహకరిస్తుందని స్పష్టం చేశారు.
'మాస్కులు వాడండి'
కాగా, కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 అంత ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని, వారాంతాలు, సెలవులు కావడంతో ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు, జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కచ్చితంగా మాస్కులు ధరించాలని చెబుతున్నారు.
Also Read: Weather Latest Update: ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! విపరీతంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు