Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Overturn Doon Express : ఉత్తరప్రదేశ్‌లో మరోసారి రైలును బోల్తా కొట్టించే ప్రయత్నం జరిగింది. ఉత్తరాఖండ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న కాలనీ వెనుక రైల్వే లైన్‌పై 7 మీటర్ల పొడవైన టెలికాం స్తంభాన్ని పెట్టారు.
Doon Express : ఉత్తరప్రదేశ్‌లో మరోసారి రైలును బోల్తా కొట్టించే ప్రయత్నం జరిగింది. కాన్పూర్, ఘాజీపూర్, డియోరియా తర్వాత ఇప్పుడు రాంపూర్ జిల్లాలో రైలును బోల్తా కొట్టించేందుకు కుట్ర పన్నారు. ఉత్తరాఖండ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న కాలనీ వెనుక రైల్వే లైన్‌పై పాత 7 మీటర్ల పొడవైన టెలికాం స్తంభాన్ని పెట్టారు. ఇంతలో డెహ్రాడూన్ (డూన్) ఎక్స్‌ప్రెస్ అక్కడి నుండి వెళుతోంది. రైల్వే ట్రాక్‌పై స్తంభాన్ని చూసిన రైలు లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై స్తంభం ఉన్నట్టు సమాచారం అందుకున్న జీఆర్‌పీ, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్‌పై ఉన్న పోల్ ను అధికారులు తొలగించారు.ఆ తర్వాత రైలు మరింత ముందుకు సాగింది.
ఈ సంఘటన గత బుధవారం రాత్రి జరిగింది. బల్వంత్ ఎన్‌క్లేవ్ కాలనీ వెనుక ప్రయాణిస్తున్న బిలాస్‌పూర్ రోడ్ రుద్రాపూర్ సిటీ స్టేషన్‌లోని కిమీ 43/10-11 రైల్వే లైన్ వద్ద రైల్వే ట్రాక్‌పై ఏడు మీటర్ల పొడువైన పాత టెలిఫోన్ స్థంభాన్ని ఉంచారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ (నెం. 12091) లోకో పైలట్ ఆ స్తంభాన్ని గమనించాడు. ఇది చూసి ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపేశాడు.
విచారణ చేపట్టిన జీఆర్పీ ఎస్పీ
ఈ సంఘటన గురించి డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలట్, స్టేషన్ మాస్టర్, జీఆర్ పీకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొంతసేపటికి రాంపూర్ ఎస్పీ కూడా జిల్లా పోలీసు బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్తంభాన్ని స్వాధీనం చేసుకున్న బృందం రాత్రిపూట సెర్చింగ్ ప్రారంభించింది. మొరాదాబాద్‌కు చెందిన జీఆర్పీ ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
రైల్వే ట్రాక్‌పై స్తంభాన్ని ఎవరు పెట్టారు?
అనంతరం గురువారం ఉదయం అధికారుల బృందం మళ్లీ ఘటనా స్థలానికి చేరుకుంది. చుట్టుపక్కల వారి నుంచి కూడా సమాచారం తీసుకున్నారు. కాలనీ వెనుక రైలు మార్గంలో కొందరు యువకులు డ్రగ్స్ తీసుకుంటారని ప్రజలు తెలిపారు. ఈ కారణంగా పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న దొంగతనాలు కూడా జరుగుతుంటాయి. ఈ పని వారే చేసి ఉంటారని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం జీఆర్పీ, ఆర్పీఎఫ్, జిల్లా పోలీసులు ఈ స్తంభాన్ని ఉంచిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
యూపీలో మరో రైలును బోల్తా కొట్టించేందుకు కుట్ర
రాంపూర్ కంటే ముందే యూపీలోని కాన్పూర్, డియోరియా, ఘాజీపూర్‌లలో రైలును బోల్తా కొట్టించే కుట్ర జరిగింది. కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్‌ను బోల్తా కొట్టేందుకు రైల్వే ట్రాక్‌పై సిలిండర్లు పెట్టారు. ఘటనా స్థలంలో సిలిండర్‌తో పాటు గాజు సీసా, అగ్గిపుల్లలు, అనుమానాస్పద బ్యాగ్ లభ్యమయ్యాయి. కాగా ఘాజీపూర్‌లో రైల్వే ట్రాక్‌పై పెద్ద చెక్క దిమ్మెను ఉంచారు. వరుస ఘటనలతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. రైలులో వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అలాంటిది కనీస ఆలోచన లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.