Privilege Motion: ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్
Privilege Motion Against PM Modi: మంగళవారం నాటి లోక్‌సభ కార్యక్రమాల నుంచి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ వీడియోను షేర్ చేసినందుకు ప్రధాని మోదీపై కాంగ్రెస్ బుధవారం ప్రివిలేజ్ మోషన్ ను ప్రవేశపెట్టింది.
Privilege Motion:లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంగళవారం సభలో ఈ విషయంలో వివాదం సద్దుమణగడానికి బదులు అంతకంతకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం నాటి లోక్‌సభ కార్యక్రమాల నుంచి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ వీడియోను షేర్ చేసినందుకు ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రివిలేజ్ మోషన్ ను ప్రవేశపెట్టింది. రాహుల్‌గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. దీంతో కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జిత్ సింగ్ చన్నీ(Charanjit Singh Channi) ప్రధాని మోదీ పై ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టారు.
కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జిత్ సింగ్ చన్నీ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ప్రధాని మోదీపై ప్రత్యేకాధికారాల ఉల్లంఘన ఫిర్యాదు(ప్రివిలేజ్ మోషన్)ను సమర్పించినట్లు పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి. అనురాగ్ ఠాకూర్ ప్రసంగంలోని కొన్ని భాగాలు తొలగించడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కులాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో కుల గణన చేయాలనే రాహుల్ గాంధీ డిమాండ్‌పై అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో సమాధానమిచ్చారు. మంగళవారం సభలో కులగణనపై రాహుల్ మాట్లాడుతుండగా అనురాగ్ ఠాకూర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అనంతరం అనురాగ్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లుగా సభాధ్యక్ష స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ తెలిపారు. కాగా అనురాగ్ ఠాకుర్ ప్రసంగాన్ని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. తప్పనిసరిగా వినాల్సిన ప్రసంగం అంటూ సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇండియా కూటమి మురికి రాజకీయాలను బహిర్గతం చేస్తూ, వాస్తవాలను, హాస్యాన్ని కలగలిపి అనురాగ్ మాట్లాడారని మోదీ చెప్పుకొచ్చారు.
ట్విట్టర్లో వీడియో షేర్ చేసిన మోదీ
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో అనురాగ్ ఠాకూర్ స్టేట్‌మెంట్‌ను మోదీ షేర్ చేశారు. దాంట్లో.. నా యంగ్ అండ్ ఎనర్జిటిక్ సహోద్యోగి అనురాగ్ ఠాకూర్ చేసిన ఈ ప్రసంగాన్ని తప్పకుండా వినాలని ప్రధాని మోదీ రాశారు. ఇండియా కూటమి మురికి రాజకీయాలను బహిర్గతం చేస్తూ, వాస్తవాలను, హాస్యాన్ని కలగలిపి అనురాగ్ మాట్లాడారని మోదీ చెప్పుకొచ్చారు. అనురాగ్ ఠాకూర్ తనను అవమానించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. చరణ్‌జిత్ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు చేసిన ఫిర్యాదులో, లోక్‌సభలో బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను అభ్యంతరకరంగా గుర్తించి సభాపతి తొలగిస్తే ప్రధాని ఆ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో మోదీ పోస్ట్ చేశారని చెప్పుకొచ్చారు.
ఘాటుగా స్పందించిన జైరాం రమేష్
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మీరు నన్ను దూషించవచ్చు , అవమానించవచ్చు, అయితే ఈ పార్లమెంటులో కుల జనాభా గణన బిల్లును ఖచ్చితంగా ఆమోదిస్తామనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా ఘాటుగా స్పందించారు. ఆయన ప్రధాని మోదీపై ఎదురుదాడికి దిగారు. ప్రధాని చెబుతున్న ఈ ప్రసంగం చాలా అవమానకరమైనది. రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. దీన్ని షేర్ చేయడం ద్వారా ఆయన పార్లమెంటరీ ప్రత్యేక హక్కును ఉల్లంఘించడాన్ని ప్రోత్సహించారని జైరాం రమేష్ ఆరోపించారు. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తన కులం గురించి ఎంపీని, ప్రతిపక్ష నేతను అడగడం ద్వారా పార్లమెంటు చర్చ స్థాయిని మరింత దిగజార్చారని రమేష్ అన్నారు. విపక్షాల నిరసన నేపథ్యంలో స్పీకర్ జగదాంబిక పాల్ ప్రసంగంలోని ఆ భాగాలను తొలగిస్తామని ఎంపీలకు హామీ ఇచ్చారు. బుధవారం సభా కార్యక్రమాలు సజావుగా సాగకపోవడంతో అనురాగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై కిరణ్ రిజిజు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.