అవును కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసింది, పార్టీ వైఖరి మారాలి - రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi: కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసిందని, పార్టీ వైఖరిలో మార్పు రావాలని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi Admits Congress Made Mistakes: కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసిందని, వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. త్వరలోనే కాంగ్రెస్ వైఖరి మారుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా పార్టీలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. లఖ్నోలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో రాజ్యాంగం గురించీ మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాతలు కోరుకుంటున్న స్థాయిలో ఇది ప్రజలకు ఉపకరించడం లేదని అన్నారు. కుల వ్యవస్థ, రిజర్వేషన్‌ల ప్రస్తావనా తీసుకొచ్చారు. పుట్టక ముందే వాళ్ల భవిష్యత్ ఏంటో నిర్ణయించే ఆలోచనా విధానం పెరిగిపోతోందని, వాళ్లు ఏం చేయగలరో ఏం చేయలేరో ముందే డిసైడ్ చేసేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. పదవుల కోసం వెంపర్లాడే నేతలు ఎప్పటికీ రియాల్టీ ఏంటో అర్థం చేసుకోలేరని మండి పడ్డారు రాహుల్ గాంధీ. కనీసం ఎదుటి వాళ్లలో ఎంత సత్తా ఉన్నదీ అర్థం చేసుకోలేరని మండి పడ్డారు.
"కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసింది. వాటిని సరిదిద్దుకోవాల్సి ఉంది. ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా పార్టీ విధానంలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరమూ ఉంది. ఇక మన దేశంలో కుల వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే పుట్టక ముందే వాళ్ల భవిష్యత్‌ని నిర్ణయించేస్తున్నారు. కోట్లాది మంది ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. అలాగే బతుకుతున్నారు. సమాజమే వాళ్ల ఫ్యూచర్‌ని డిసైడ్ చేసేస్తోంది. వాళ్లలో ఎంత సామర్థ్యం ఉన్నా అదంతా వృథా అయిపోతోంది. చాలా మంది ఈ పద్ధతిని మార్చేందుకు ప్రయత్నించారు. ఎదిరించి నిలబడ్డారు"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
నిజానికి ఈ లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్‌కి చావోరేవో లాంటివే. ఇప్పటికే ఉత్తరాదిలో పూర్తిగా పట్టు కోల్పోయింది ఈ పార్టీ. దక్షిణాదిన మాత్రం తెలంగాణ,కర్ణాటకలో అధికారంలో ఉంది. అయితే...లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం విజయం మాదే అని చాలా ధీమాగా చెబుతోంది బీజేపీ. దక్షిణాదిని కూడా గట్టిగానే సీట్లు సాధిస్తామని స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ గట్టిగానే ప్రచారం చేస్తున్నప్పటికీ జాతీయ నాయకత్వం బలంగా లేకపోవడం వల్ల ఆ ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడే అవకాశాలున్నాయి. రాహుల్ గాంధీ ఒక్కడే పార్టీ బాధ్యతలు తీసుకుని ముందుకు నడిపిస్తున్నప్పటికీ సీనియర్‌లు కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నారు. ఇప్పటికే మణిశంకర్ అయ్యర్, శ్యాం పిట్రోడా వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేయాలని కుట్ర చేస్తోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమూ విమర్శలకు తావిస్తోంది. నెహ్రూ రిజర్వేషన్‌లకు వ్యతిరేకం అంటూ ఒకప్పటి డాక్యుమెంట్స్‌ని బయటపెట్టి బీజేపీ కౌంటర్ అటాక్ చేస్తోంది.
లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నెల 13వ తేదీన నాలుగో విడత పోలింగ్ జరగనుంది. ఆ తరవాత మరో మూడు విడతలు మిగిలి ఉన్నాయి. జూన్ 1న ఏడో విడత పోలింగ్‌తో లోక్‌సభ ఎన్నికలు ముగిసిపోతాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో దూకుడు పెంచాయి. పార్టీల్లోని ముఖ్య నేతలతో పాటు స్టార్ క్యాంపెయినర్‌లూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
Also Read: Arvind Kejriwal: ఎన్నికల ప్రచార బరిలోకి దిగిన అరవింద్ కేజ్రీవాల్, హనుమాన్ ఆలయంలో పూజలు