Cold Waves In Andhra Pradesh And Telangana : తెలుగు రాష్ట్రాలపై చలి పంజా-మరింత పెరుగుతుందన్న వాతావరణ శాఖ
తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఇప్పటికే గజగజా వణుకిపోతున్నారు ప్రజలు. మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
Cold Waves In Telangana And Andra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలే కాదు... పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. ఉదయం సమయం పొగమంచు కురుస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు మొదలవుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడంలేదు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే... గజగజా వణికిపోతున్నారు. బయటే కాదు ఇళ్లలో కూడా ఏ వస్తువు ముట్టుకున్నా జిల్లు మంటోంది. ఇక... మరో మూడు రోజుల పాటు చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ చలితో ఎలాగరా దేవుడా అంటూ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. చలి పెరగడంతో ముఖ్యమంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు కూడా... జలుబు, జ్వరాల బారిన పడుతున్నారు.
తెలంగాణలో పరిస్థితి చూస్తే... ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండలో 12.3 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 13.1, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.5, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 13.6, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13.9, పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో 13.9, మెదక్ జిల్లా దామరంచలో కనిష్ఠ ఉష్ణోగ్రత 14.3 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వచ్చే రెండు రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. పగటిపూట కూడా చలి గాలులు వీస్తుండటంతో... ప్రజలు వణికిపోతున్నారు. చలి మరింత పెరిగితే ఎలా తట్టుకోవాలంటూ ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గి పగటి పూట కూడా పొగమంచు కురుస్తోంది. ఉదయం సమయంలో ప్రధాన రహదారులపై పొగమంచు దట్టంగా అలుముకుంటోంది. దీని వల్ల వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. రోడ్డు సరిగా కనిపించకపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పగటి పూట లైట్లు వేసుకుని వాహనాలు నడపాల్సిన పరిస్థితి ఉంది.
హైదరాబాద్ కూడా చలి తీవ్రతతో వణికిపోతోంది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో చలి పంజా విసురుతోంది. నిన్న (సోమవారం) రామచంద్రాపురంలో అత్యల్పంగా 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాజేంద్రనగర్‌లో 14.9, సికింద్రాబాద్‌లో 15.4, కుత్బుల్లాపూర్‌లో 15.7, హయత్‌నగర్‌లో 15.8, మల్కాజ్‌గిరిలో 16.3, కూకట్‌పల్లిలో 16.7, బేగంపేట్‌లో 16.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమ 36 శాతంగా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరో రెండు రోజల పాటు చలి తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇక... ఆంధ్రప్రదేశ్ (ఏపీ)లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రెండురోజులపాటు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఏపీ కంటే తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత తట్టుకోలేక చలి మంటలు వేసుకుని ఉపసమనం పొందుతున్నారు ప్రజలు. పెరుగుతున్న చలితో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.