China Covid Wave: చైనాలో మరోసారి కరోనా టెన్షన్, జూన్‌లో కేసుల సునామీ తప్పదట!
China Covid Wave: చైనాలో మరో కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తోంది.
China Covid Wave:
పెరుగుతున్న కేసులు..
చైనాలో మళ్లీ కరోనా అలజడి మొదలైంది. మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చిందని అనుకునే లోపే మళ్లీ విస్తరిస్తోంది. దేశమంతా ఇప్పుడు వ్యాక్సిన్‌ల కోసం క్యూ కడుతోంది. మరో కరోనా వేవ్ వచ్చి ఒక్కసారిగా కుదిపేసింది. ఇప్పటికే బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇది చాలదని సైంటిస్ట్‌లు చావు కబురు చల్లగా చెప్పారు. జూన్‌లో కరోనా విధ్వంసం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. కనీసం 6 కోట్ల 50 లక్షల మందికి ఈ కొత్త వేరియంట్ సోకే ప్రమాదముందని స్పష్టం చేశారు. XBB వేరియంట్‌లు దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకూ వ్యాక్సిన్‌లతో వచ్చిన ఇమ్యూనిటీని కూడా ఛేదించి మరీ సోకుతుందని వివరించారు. గతేడాది జీరో కొవిడ్ పాలసీతో చైనా విపరీతమైన ఆంక్షలు విధించింది. ప్రజలందరూ తిరగబడ్డారు. ఫలితంగా..కొన్నాళ్లకు ఆ పాలసీని పక్కన పెట్టేసింది. అప్పటి నుంచి వైరస్ బాధితులు పెరుగుతూ వస్తున్నారు. మధ్యలో కాస్త తెరపినిచ్చినట్టు అనిపించినా...ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. అక్కడి మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం...చైనా ఎపిడెమాలజిస్ట్ జాంగ్ నన్షన్ కీలక విషయాలు చెప్పారు. కరోనా కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో..XBB ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్‌కి కొత్త టీకాలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. త్వరలోనే నాలుగు వ్యాక్సిన్‌లకు అప్రూవల్ వస్తుందని తెలిపారు.
జీరో కొవిడ్ పాలసీని తీసేయడం వల్లే ఈ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అప్పటి నుంచే కేసుల సంఖ్య 85% మేర పెరిగిందని అంచనా వేస్తున్నారు. ఒక్క చైనాలోనే కాదు. అమెరికాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉన్నట్టుండి కేసుల సంఖ్య పెరిగింది. కొత్త వేరియంట్‌లు వచ్చే అవకాశాలు లేవని ఎక్స్‌పర్ట్స్ కాన్ఫిడెంట్‌గా చెప్పలేకపోతున్నారు.
"ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న వేరియంట్‌తో పెద్ద ప్రభావమేమీ ఉండకపోవచ్చు. ఆసుపత్రుల్లో చేర్చాల్సిన అవసరం రాకపోవచ్చు. అలా అని మనం లైట్ తీసుకోడానికి వీల్లేదు. ఉన్నట్టుండి కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముంది"
- ఎపిడెమాలజిస్ట్, చైనా
చైనాలో ఏప్రిల్ చివరి రెండు వారాల నుంచి మొదలైన వ్యాప్తి..ఇప్పటికీ కొనసాగుతోంది. మరీ మునుపు ఉన్నంత తీవ్ర స్థాయిలో లక్షణాలు లేకపోయినప్పటికీ..స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
కరోనా ఇక మన నుంచి దూరమైనట్టే అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ అదనామ్ టెడ్రోస్ మరో బాంబు పేల్చారు. మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అది కొవిడ్ కన్నా దారుణంగా ఉండొచ్చని అన్నారు. ఇప్పుడిప్పుడే దాదాపు అన్ని దేశాల్లో కొవిడ్ వ్యాప్తి తగ్గిపోతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. "కొవిడ్ 19 ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా తొలగించినంత మాత్రాన..ఎవరికీ ఎలాంటి ముప్పు లేదని కాదు" అని తేల్చి చెప్పారు.
"కరోనా మహమ్మారిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ నుంచి తొలగించాం. అంత మాత్రాన ముప్పు ముగిసిందని కాదు. మరో వేరియంట్ వచ్చి ఎప్పుడు మీద పడుతుందో తెలియదు. మళ్లీ కేసులు పెరిగి, మరణాలూ నమోదయ్యే ప్రమాదముంది. కరోనా కన్నా దారుణంగా వేధించే మహమ్మారి మరోటి పుట్టే అవకాశం లేకపోలేదు. ఇలాంటి ప్యాండెమిక్ మళ్లీ వచ్చిందంటే అందుకు మనం అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. అంతా ఒక్కటిగా పోరాడాలి"
- టెడ్రోస్, WHO డైరెక్టర్ జనరల్
Also Read: Rs 75 Coin: రూ.75 కాయిన్ విడుదల చేయనున్న ప్రధాని మోదీ, పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజునే