(Source: Poll of Polls)
AIIMS Delhi Server: ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్‌ల హ్యాకింగ్ చైనా పనే, ప్రాథమిక విచారణలో వెల్లడి!
AIIMS Delhi Server: ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ సర్వర్లపై హ్యాకింగ్‌కు పాల్పడింది చైనాయేనని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
AIIMS Delhi Server Hacking:
డేటా సేఫ్..
ఢిల్లీలోని AIIMS ఆసుపత్రి సర్వర్‌పై ఇటీవల హ్యాకర్లు దాడి చేశారు. మొత్తం 100 సర్వర్లలో 40 సర్వర్‌లు ఫిజికల్‌గా హ్యాక్ అవ్వగా..మరో 60 వర్చువల్‌గా హ్యాక్‌కు గురయ్యాయి. అప్పటి నుంచి పోలీసులతో పాటు సైబర్ నిపుణులు ఈ హ్యాకర్ల మూలాలు కనుగొనే పనిలో నిమగ్న మయ్యారు. అయితే...ఈ పని చైనాదేనని ప్రాథమికంగా వెల్లడించారు అధికారులు. ఇప్పటికే 5 సర్వర్లను రికవరీ చేశారు. అందులోని డేటా కూడా భద్రంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 25న జరిగిన ఈ ఘటనను సైబర్ టెర్రరిజంగా పరిగణించిన అధికారులు...వెంటనే FIR నమోదు చేశారు. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన Intelligence Fusion and Strategic Operations (IFSO) యూనిట్ ఈ కేసు నమోదు చేసింది. అటు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)దీనిపై విచారణ కొనసా గిస్తోంది. ఎన్‌ఐఏతో పాటు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, ఢిల్లీ సైబర్ క్రైమ్ సెల్, ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్, ఐబీ, సీబీఐ కూడా విచారణ సాగిస్తున్నాయి.
ఐటీ మంత్రి కామెంట్స్..
కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవలే ఈ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ABP Newsకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావించారు. "ఈ హ్యాకింగ్‌ను చిన్న విషయంలా తీసుకోకూడదు. దీని వెనకాల కచ్చితంగా కుట్ర ఉండే ఉంటుంది" అని అన్నారు. సీఈఆర్‌టీతో పాటు ఎన్‌ఐఏ, పోలీసులు కూడా ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారని చెప్పారు. ఇలాంటి దాడులు పదే పదే జరగకుండా...ప్రజల వ్యక్తిగత సమాచారం ఎవరి చేతుల్లోకీ వెళ్లకుండా కేంద్రం Digital Data Protection Billను తీసుకొస్తున్నట్టు వివరించారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెడతామని అన్నారు. ప్రతి పౌరుడి వ్యక్తిగత ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఈ బిల్ రక్షిస్తుందని వివరించారు. ఎయిమ్స్ సర్వర్ హ్యాక్‌కు గురైన వెంటనే రాజీవ్ చంద్రశేఖర్ ఉన్నత స్థాయి అధికారులతో మీటింగ్ పెట్టారు. త్వరలోనే సర్వర్‌ను రీస్టోర్ చేసి..పనులు సవ్యంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఇక NIA కూడా రంగంలోకి దిగి దీని వెనకాల ఉగ్రకుట్ర ఏమైనా ఉందా ...అనే కోణంలో విచారణ కొనసాగిస్తోంది. కొందరు వీవీవఐపీల డిటెయిల్స్ కూడా ఈ సర్వర్‌లో ఉండటం వల్లే ఇది ఉగ్రవాదుల పనా..? అన్న అనుమానాలకు తావిస్తోంది. నవంబర్ 23న ఢిల్లీలోని AIIMS సర్వర్‌లు ఉన్నట్టుండి పని చేయకుండా పోయాయి. రూ.200 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ ఇవ్వాలని హ్యాకర్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది. కానీ... పోలీసులు మాత్రం దీన్ని ఖండించారు. సైబర్ టెర్రరిజం కింద కేసు నమోదు చేసిన పోలీసులు...విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపు 3-4కోట్ల మంది పేషెంట్ల డేటాను హ్యాకర్లు దొంగిలించినట్టు తెలుస్తోంది.