Chandrababu Naidu: ఈస్థాయిలో దొంగఓట్లు ఏనాడూ చూడలేదు, ఈసీ కూడా ఆగ్రహం - చంద్రబాబు
Chandrababu News: చంద్రగిరి టీడీపీ ఇన్‌ఛార్జి పులివర్తి నానిని చంద్రబాబు నాయుడు సోమవారం (జనవరి 15) పరామర్శించారు. ఇటీవల పులివర్తి నాని ఇటీవల నిరాహార దీక్ష చేశారు.
Chandrababu Naidu Comments: రాష్ట్రంలో ఈ స్థాయిలో దొంగ ఓట్లు నమోదు చేయడం ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రగిరిలో కూడా వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్చారని ఆరోపించారు. అంతేకాక.. తిరుపతి, శ్రీకాళహస్తి, పీలేరు, సత్యవేడు ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా దొంగ ఓట్లను చేర్చారని ఆరోపించారు. ఇలా ఇష్టారీతిన దొంగ ఓట్లు చేర్చుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాలపై తిరుపతి జిల్లా కలెక్టర్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఒకే వ్యక్తికి మూడు వేర్వేరు చోట్ల కూడా ఓటు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సచివాలయ సిబ్బంది సాయంతోనే ఇలా దొంగ ఓట్లు నమోదు చేయడం సాధ్యం అవుతూ ఉందని అన్నారు. బోగస్ గుర్తింపు కార్డులు కూడా ఇస్తున్నారని.. ఈ స్థాయిలో అక్రమాలు చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు.
చంద్రగిరి టీడీపీ ఇన్‌ఛార్జి పులివర్తి నానిని చంద్రబాబు నాయుడు సోమవారం (జనవరి 15) పరామర్శించారు. ఇటీవల పులివర్తి నాని ఇటీవల నిరాహార దీక్ష చేశారు. నియోజకవర్గంలో దొంగ ఓట్లు తొలగించాలని తిరుపతి రూరల్ ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనారోగ్యం పాలవడంతో ఆయన ప్రస్తుతం ఇంట్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. అందుకే చంద్రబాబు పులివర్తి నానిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు.
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే టీడీపీ (TDP News) పోరాటం చేస్తుందని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. గత 40 ఏళ్లుగా నేను ఈ జిల్లాను చూస్తూ వస్తున్నానని అన్నారు. ఎప్పుడూ లేనంతగా భూకబ్జాలు, జనాలను వేధించడం లాంటివి ఇక్కడ జరుగుతున్నాయని అన్నారు. దోచుకున్న డబ్బుతో పంపిణీ చేపట్టి.. ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.