Center on FM Radio Channels: రేడియోలో అలాంటి పాటలు ప్రసారం చేస్తే ఊరుకోం, కేంద్రం హెచ్చరికలు
Center on FM Radio Channels: రేడియోలో డ్రగ్స్‌కి సంబంధించిన పాటలు ప్రసారం చేయకూడదని కేంద్రం హెచ్చరికలు చేసింది.
Center on FM Radio Channels:
రేడియో ఛానల్స్‌కి మార్గదర్శకాలు..
డ్రగ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఎక్కడా వాటి జాడ కనిపించకుండా ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తోంది. డ్రగ్స్ ఎక్కువగా సరఫరా అవుతున్న ప్రాంతాల్లో నిఘాను పెంచింది. ముఖ్యంగా పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ లాంటి సరిహద్దు రాష్ట్రాల్లో విజిలెన్స్ కఠినంగా ఉంటోంది. వీటితో పాటు ఏ మాధ్యమంలోనూ డ్రగ్స్ కి సంబంధించిన ప్రచారం, ప్రస్తావన రాకుండా చూసుకుంటోంది. ఈ క్రమంలోనే..కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ FM రేడియో ఛానల్స్‌కి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. డ్రగ్స్‌ని, గన్ కల్చర్‌ని ప్రమోట్ చేసే విధంగా ఉండే పాటల్ని ప్రసారం చేయకూడదని తేల్చి చెప్పింది. ఈ నిబంధనను అతిక్రమిస్తే..కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లిక్కర్, డ్రగ్స్, గన్స్‌ని ప్రమోట్ చేస్తూ ఉండే పాటలు తరచుగా రేడియోలో ప్రసారమవుతున్నాయని గుర్తించిన కేంద్రం...ఈ హెచ్చరికలు చేసింది. ఈ నిబంధనను తప్పకుండా పాటించాలని వెల్లడించింది. ఇలాంటి పాటలు ప్రసారం చేస్తే...All India Radio Programme Codeని అతిక్రమించినట్టే అవుతుందని తెలిపింది. అలాంటి పరిస్థితే వస్తే...ఆ ఛానల్‌ను నిషేధించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తీసుకోక ముందు పంజాబ్, హరియాణా హైకోర్టులు కీలక వ్యాఖ్యలు చేశాయి. రేడియోలో ఇలాంటి పాటలు ప్రసారం అవడం వల్ల యువత ఆలోచనా ధోరణి మారిపోయే ప్రమాదముందని అన్నాయి. గన్ కల్చర్‌ని ఇవి మరింత పెంచే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం...వెంటనే ఈ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
భారీగా డ్రగ్స్ పట్టివేత..
ఇటీవలే గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (Anti Terrorist Squad), ఇండియన్ కోస్ట్ గార్డ్‌తో కలిసి ఓ కీలక ఆపరేషన్ చేపట్టింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ బోట్‌లో నుంచి రూ. 200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్‌ను సీజ్ చేసింది. అరేబియన్ సముద్ర మధ్యలో ఈ పడవను స్వాధీనం చేసుకున్నారు. ఈ పడవలో ఉన్న ఆరుగురు పాకిస్థానీలను అరెస్ట్ చేశారు. సముద్రం మధ్యలో ఈ ఫిషింగ్ బోట్‌పై దాడి చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఏటీస్ బృందాలు...కచ్ జిల్లాలోని జకావ్ హార్బర్ వద్ద గుర్తించారు. గుజరాత్‌లో అన్‌లోడ్ చేసి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పంజాబ్‌కు తరలించారని ప్లాన్ వేసుకున్నారు నిందితులు. ఇప్పుడే కాదు. గతంలోనూ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, కోస్ట్ గార్డ్ బృందాలు కలిసి డ్రగ్ స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు. భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జులైలో...75.3 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.376.5 కోట్లు. ఫ్యాబ్రిక్ రోల్స్‌లో హెరాయిన్‌ను దాచి పెట్టి గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ప్రయత్నించారు నిందితులు. యూఏఈ నుంచి వచ్చిన హెరాయిన్‌ను...పంజాబ్‌కు తరలించాలని నిందితులు ప్లాన్ చేసినట్టు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి Directorate of Revenue Intelligence (DRI) కోట్ల రూపాయల డ్రగ్స్‌ను సీజ్ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో దాదాపు రూ.21,000కోట్ల విలువైన 3 వేల కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఇక ఈ ఏడాది మేలో 56 కిలోలు, అంతకు ముందు ఏప్రిల్‌లో 205 కిలోల హెరాయిన్ సీజ్ చేశారు.
Also Read: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీకి రోజా పూలు ఇచ్చిన హీరోయిన్