Rosayya No More: రాజకీయ భీష్మాచార్యుడి మృతి తీరని లోటు.. రోశయ్యకు సినీ ప్రముఖుల సంతాపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు.
రోశయ్య మరణంపై స్పందించిన పలువురు సినీ సెలబ్రెటీలు తమ సంతాపాన్ని తెలియజేశారు. చిరంజీవి తన సంతాపాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ‘‘మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యగారి మరణం తీరని విషాదం. ఆయన రాజకీయాల్లో భీష్మాచార్యుడు వంటివారు. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడటంలో ఆయన రుషిలా సేవ చేశారు. వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజల మన్ననలు పొందారు. ఆయన మరణంతో రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు చిరంజీవి.
Shri #KonijetiRosaiah Garu #RestInPeace pic.twitter.com/jp8KPuWCuJ
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 4, 2021
రోశయ్య హఠాన్మరణం తనను ఎంతో కలిచి వేసిందన్నారునందమూరి బాలకృష్ణ. సమయస్ఫూర్తికి, చమత్కార సంభాషణలకు రోశయ్య మారు పేరని గుర్తు చేశారు. అత్యధిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రోశయ్య పేరొందారని పేర్కొన్నారు బాలయ్య.రోశయ్య మృతితో గొప్ప అనుభవం ఉన్న నేతను తెలుగు జాతి కోల్పోయినట్లు అయ్యిందని బాధపడ్డారు. కంచు కంఠంతో నిండైన రూపంతో.. పంచె కట్టుతో తెలుగు సంప్రదాయానికి రోశయ్య ప్రతీకగా ఉండేవారని బాలకృష్ణ పేర్కొన్నారు.
రాజకీయాన్నిశ్వాసగా, రాజకీయాన్ని అవపోసన పట్టి, రాజకీయ భాషను కొత్త పుంతలు తొక్కించి, అప్రతిహతఘటనా సమర్ధులైన రాజకీయ భీష్ములు, రాజకీయ దురంధురులు కొణిజేటి రోశయ్యగారు ఆకస్మికంగా భువి నుంచి దివికేగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు మంచు మోహన్ బాబు. ముఖ్యమంత్రిగా వారు ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని ముక్కోటి దేవతలను కోరుకుంటున్నాను అన్నారు.
రాజకీయ పితామహుడు, సహనశీలి.. నిరాడంబరుడు, తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారి మరణం తెలుగు రాష్ట్రాలకు, తమిళనాడుకు తీరనిలోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. " తెలుగు దర్శకుల సంఘం " కోరుకుంటోందంటూ TFDA ప్రెసిడెంట్ వై.కాశీవిశ్వనాథ్ ట్వీట్ చేశారు.
ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా, ఆ తరువాత ముఖ్యమంత్రిగా , గవర్నర్ గా అనేక పదవులు చేపట్టిన ఆయన సుదీర్గ రాజకీయ ప్రస్థానంలో అనితర సాధ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆర్ధిక శాఖ అంటే నాకు అత్యంత ఇష్టమైన సబ్జెక్టు అని ప్రకటించుకున్న ఆయన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 15 సార్లు బడ్జేట్ ప్రవేశపెట్టిన నేతగా గుర్తింపు పొందారు, ఈ క్రమంలో వరుసుగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేతగా కూడా రికార్డు సృష్టించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం చూపడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దిగాలు పడటం ఎరుగని నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి . హోం మంత్రి అయినా ఆర్ధిక మంత్రి అయినా రెవెన్యూ శాఖా మంత్రి అయినా సరే ఆయన నిర్ణయాలను కాదనేవారు ఉండరు. ఆయన ఒక సూచన చేస్తే దాన్ని కచ్చితంగా అమలు చెయ్యాల్సిందే. ఆయన ఒక్క మాట చెప్తే పార్టీలో అయినా, ఏ ప్రభుత్వంలో అయినా, ఏ సిఎం ఉన్నా సరే, ఎలాంటి మంత్రి అయినా సరే పని జరగాల్సిందే. ఆయనను ఇబ్బంది పెట్టిన నాయకుడు లేరు. ఉమ్మడి ఏపీలో ఆయన సాధించిన విజయాలు ఇప్పటి వరకు ఏ ఆర్ధిక మంత్రి కూడా సాధించలేదు.
Also Read: సీఎం పదవిలో ఉన్న రోజులే రోశయ్యకు గడ్డు కాలం ! అప్పుడేం జరిగిందంటే...?
Also Read: నొప్పింపని ..తానొవ్వని నేత..! వర్గ పోరాటాల కాంగ్రెస్‌లో అజాతశత్రువు రోశయ్య !
Also Read: ఆ పంచ్‌లకు ఎవరి దగ్గరా ఆన్సర్ ఉండదు !
Also Read: వైఎస్‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి