తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ Vs గవర్నర్ తమిళి సై - గులాబి నేతల గట్టి కౌంటర్!
BRS Party కి, గవర్నర్‌కు మధ్య తాజా వివాదానికి ఎమ్మెల్సీల నియామకం కారణమైంది. ఈ వివాదం మరోసారి బహిర్గతమైంది.
![తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ Vs గవర్నర్ తమిళి సై - గులాబి నేతల గట్టి కౌంటర్! BRS Vs Telangana Governor Tamilisai war again started KTR other leaders strongly condemns తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ Vs గవర్నర్ తమిళి సై - గులాబి నేతల గట్టి కౌంటర్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/26/82e58b1a6fb1479e5d9d79bc6e8934711706262821558930_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BRS vs Governor War: తెలంగాణలో భారతీయ రాష్ట్ర సమితి, గవర్నర్ తమిళ సై మధ్య కొన్నాళ్లుగా నెలకొన్న వివాదం కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు వ్యతిరేకంగా గవర్నర్ అనేక నిర్ణయాలను తీసుకున్నారు. గవర్నర్ వ్యవహారశైలి పట్ల బాహాటంగానే అప్పట్లో కేసీఆర్, కేటీఆర్ సహా అనేక మంది బీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో గవర్నర్ తమిళ సై, బీఆర్‌ఎస్ మధ్య ఉన్న విబేధాలు తగ్గుముఖం పడతాయని అంతా భావించారు. అందుకు విరుద్ధంగా గణతంత్ర దినోత్సవం రోజున బీఆర్‌ఎస్, గవర్నర్‌కు మధ్య ఉన్న వివాదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. బీఆర్‌ఎస్ పార్టీకి, గవర్నర్‌కు మధ్య తాజా వివాదానికి ఎమ్మెల్సీలు నియామకం కారణమయ్యాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ అధికారిక ప్రసంగంలోనూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టేలా ఉండడంతో.. గవర్నర్ తమిళ సై, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య వివాదం కొనసాగుతోందన్న విషయం మరోసారి బహిర్గతమైంది.
గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ఏమన్నారంటే
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆమె ప్రసంగించారు. గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టన అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి వివరించడంతోపాటు గత ప్రభుత్వంపైనా ఆమె విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించినప్పుడు ప్రజలే కార్యోన్ముకులై తమ పోరాటాలను, తీర్పులు ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తి రాజ్యాంగం ఇచ్చిందన్నారు గవర్నర్ తమిళ సై. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని విస్పష్టమైన తీర్పుతో ప్రకటించిందన్నారు. పదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే పునర్మించుకుంటున్నాయన్నారు. గడిచిన పదేళ్ల పాలకుల వైఫల్యం యువతకు ఉపాధి, ఉద్యోగాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైందని, ప్రజల హక్కులను, స్వేచ్ఛను గౌరవించే పాలన తెలంగాణలో ఉందంటూ గత బీఆర్‌ఎస్ పాలనను గవర్నర్ తూర్పారబట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఇచ్చిన ప్రసంగంలో దాదాపు సగం.. గత ప్రభుత్వంపై విమర్శల, ఆరోపణలకు కేటాయించడం ఆసక్తిని కలిగిస్తోది. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు ఘాటుగానే స్పందించారు.
కాంగ్రెస్-బీజేపీ మధ్య రహస్య అవగాహనకు నిదర్శనం
గణతంత్ర దినోత్సవం రోజున బీఆర్‌ఎస్ గత ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు చేసేలా ప్రసంగించిన గవర్నర్‌పై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో గతంలో మాదిరిగానే ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్‌ఎస్ వర్సెస్ తమిళ సై అన్న రీతిలో వ్యవహారం నడుస్తోంది. గవర్నర్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.. కాంగ్రెస్, బీజేపీ రహస్య మైత్రి మరోసారి బయటపడిందన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలైందన్నారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేలా గవర్నర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్రీడా, సాంస్కృతిక, విద్యా, సామాజిక, సేవా రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేసిందని, అప్పుడు గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఆమోదించారని హరీష్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటై బీఆర్‌ఎస్‌ను అనగదొక్కాలని చూస్తున్నాయని, ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం దురదృష్టకరమన్నారు.
గవర్నర్ పక్షపాత ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు
తెలంగాణ గవర్నర్ తమిళ సై పక్షపాత ధోరణిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని, రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించారన్నారు. కానీ, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరాంను ఎమ్మెల్సీగా ఎలా ఆమోదించారని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి అహంకారం, వెకిలి వ్యవహారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారన్నారు. కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు ప్రజలందరికీ తెలుసన్నారు. బీజేపీ కాంగ్రెస్‌కు జాకీలు పెట్టి మద్ధతుగా నిలుస్తోందన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ వర్సెస్ గవర్నర్ అన్నట్టుగా ఉన్న వాతావరణం కాస్త చల్లబడిందని భావిస్తున్న తరుణంలో.. మళ్లీ గణతంత్ర దినోత్సవ వేడుకలు వేళ వీరి మధ్య మరోసారి వివాదం రాజుకోవడం ఆసక్తికర పరిణామంగా కనిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)